Friday, April 22, 2011

విషాద సమయంలో విష ప్రచారమా?


  • ట్రస్ట్‌ వ్యహారాలపై భక్తులను బాధిస్తున్న మీడియా కథనాలు 
  • బాబాకే నేరుగా విరాళాలు... చెక పవర్‌ ఆయనదే
  • కార్యక్రమాలన్నీ పారదర్శకమే, సేవా సంస్థలన్నీ బాబా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే 
  • సహాయం కోసం ట్రస్ట్‌ సభ్యులుగా కొందరి నియామకం
  • బాబా స్థానంలో ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహిస్తే భక్తుల విశ్వాసం సడలే అవకాశం లేదు
హైదరాబాద్‌: కోట్లాది మంది భక్తులు అవతార పురుషుడిగా భావిస్తున్న సత్యసాయి బాబా అంపశయ్యపై ఉంటే ఆయన తర్వాత సత్యసాయి ట్రస్ట్‌ నిర్వహణా బాధ్యతల్ని ఎవరు చేపట్టాలన్న అంశంపై విస్తృతంగా మీడియాలో చర్చలు జరగడం బాబా భక్తుల మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. డాక్టర్లు గంటకో రకంగా సత్యసాయి ఆరోగ్యంపై ప్రకటనలిస్తున్నప్పటికీ భక్తులంతా సాయిబాబా తప్పకుండా కోలుకుంటారని, తిరిగి తమకు దర్శనిమిస్తారని, తమనాశీర్వదిస్తారని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఏదో అద్భుతం జరిగి తీరుతుందని నమ్ముతున్నారు. కానీ బాబా సజీవుడిగా ఉండగానే ఆయన అనంతరం జరగాల్సిన కార్యక్రమాలపై బాధ్యత కలిగిన మీడియా, కొంతమంది వ్యక్తులు చేపట్టిన విషప్రచారం వీరందరినీ బాబా ఆరోగ్య స్థితికంటే కూడా ఎక్కువగా బాధిస్తోంది.
సత్యసాయి సేవా ట్రస్ట్‌ అధ్యక్షుడిగా సాక్షాత్తు సాయిబాబాయే ఉన్నారు. ఆయన పర్యవేక్షణలోనే ట్రస్ట్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ట్రస్ట్‌కు సంబంధించిన విరాళాలన్నీ ఆయనకే నేరుగా వస్తున్నాయి. ప్రతిపైసాను ఆయనే ఖర్చు చేస్తూవచ్చారు. చెక్కులపై సంతకాలు పెట్టే అధికారం ఆయనొక్కరికే ఉంది. ట్రస్ట్‌లో బాబా తర్వాతెవరు ? అనే చర్చకే తావులేదు. బాబాను చూసే భక్తులు విరాళాలిచ్చారు. ట్రస్ట్‌ నిర్వహిస్తున్న కళాశాలలు, వైద్యశాలలు, మంచినీటి పథకాలు, ఇతర సేవా సంస్థలన్నీ బాబా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే. తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు, వాటిని ఆచరణలో పెట్టేందుకే బాబా కొంతమంది సహాయకుల్ని ట్రస్ట్‌ సభ్యుల పేరిట నియమించుకున్నారు. బాబా పట్ల భక్తులకున్న విశ్వాసం ఈ ప్రపంచంలో మరెవరిపట్ల వారికుండదు. బాబా ఆధ్వర్యంలో తమ విరాళాలు సద్వినియోగమౌతాయని, బాబా ఆశయాలకనుగుణంగా వాటిని వ్యయం చేస్తారన్న విశ్వాసంతోనే ఇప్పటికీ విరాళాలు వెల్లువెత్తున్నాయి. బాబా స్థానంలో మరెవరున్నా విరాళాల వెల్లువ ముందుకుసాగదు. కేవలం ప్రభుత్వ అజమాయిషీలో ట్రస్ట్‌ కొనసాగితేనే దీనికి విశ్వసనీయత ఉంటుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణంతా పాలకమండలి సభ్యు లే చేపట్టినప్పటికీ పూర్తి పర్యవేక్షణ, అజమాయిషీ ప్రభుత్వానికే ఉంటు ంది. పాలకమండలి సభ్యులు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రభుత్వ ఆమోదం మేరకే అమలౌతున్నాయి. వారు చేపట్టే ఖర్చులకు పరోక్షంగా ప్రభుత్వం బాధ్యత వహిస్తోంది. అందుకే టిటిడి పట్ల ప్రజల్లో నమ్మకం సడలడంలేదు. రోజూ కోట్ల రూపాయలు టిటిడికి విరాళాలుగా అందుతున్నాయి.

ప్ర'శాంతి'నిలయంలో కొనసాగుతున్న భజనలు


పుట్టపర్తి: అది పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం. పేరుకు తగినట్లే ప్రపంచ శాంతికి అంకితమైన భగవాన్‌ సత్యసాయిబాబా మనోన్మందిరం. గత నాలుగైదు దశాబ్దాలుగా నిత్యం భజనలు, పూజలతో సత్యసాయి భక్తులతో కళకళలాడుతోంది. బాబా పుట్టపర్తిలో ఉన్నా, పర్యటనలకు వెళ్లినా అక్కడి కార్యక్రమాల్లో ఏ మాత్రం తేడా ఉండదు. ప్రస్తుతం బాబా ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ప్రశాంతి నిలయంలోగానీ, బాబా ఆధ్యర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థలు, వైద్యసేవలకుగాని ఎలాంటి విఘాతం కలుగలేదు. బాబా ఆరోగ్యవంతుడై తిరిగివస్తారన్న ప్రగాఢ నమ్మకంతో అక్కడి సిబ్బంది, భక్తులు, సేవాదళ్‌ కార్యకర్తలు తమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. అనుదినం బాబా భక్తులకు దర్శనమిచ్చే సాయి కుల్వంత్‌ హాలులో ఉదయం, సాయంత్రం భజన కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ప్రశాంతి నిలయంలోని లైబ్రరీ, షాపింగ్‌ కాంప్లెక్స్‌, క్యాంటీన్లు ఎప్పటిలాగే పనిచేస్తున్నాయి. ప్రశాంతి నిలయానికి భక్తుల రాకపోకలు కూడా అధికంగానే ఉన్నాయి. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో అక్కడ సందడి కనిపించడం లేదు. చైతన్య జ్యోతి మ్యూజియం, నక్షత్రశాల, ఇండోర్‌ స్టేడియంలలో శుక్రవారం సందర్శకులను అనుమతించలేదు.
గత రెండు మూడు రోజులుగా పుట్టపర్తిలో పోలీసుల ఆంక్షలు అధికం కావడంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. పట్టణంలో వ్యాపార సంస్థలు, లాడ్జిలు, హోటళ్లు పోలీసుల ఆంక్షలతో మూతపడడంతో భక్తులతోపాటు స్థానికులు ఇబ్బందుల పాలయ్యారు. పుట్టపర్తికి వచ్చే బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పలుచబడింది. ఆర్‌టిసి డిపో కలెక్షన్‌లు పడిపోయాయి. రోజుకు రూ.5 లక్షల కలెక్షన్లు వస్తుండగా బాబా అనారోగ్యానికి గురైన నాటి నుండి రాబడి తగ్గిందని, ప్రస్తుతం రోజుకు సుమారు రూ.4లక్షలు కలెక్షన్‌ వస్తోందని ఆర్టీసి అధికారులు తెలిపారు.

Saturday, April 16, 2011

వేసవి 'పాట్లు' పై సన్నద్ధం ప్రజావసరాలపై ప్రత్యేక దృష్టి


  • తాగు నీరు, విద్యుత్‌, ఉపాధి కల్పన, వ్యాధుల నివారణకు సత్వర చర్యలు 
  • మేలో ప్రజా పథం, రైతు చైతన్య యాత్రలు 
  • ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం
  • కలెక్టర్లతో సిఎం వీడియో కాన్ఫరెన్స్‌
హైదరాబాద్‌: వేసవిలో తాగునీరు, వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా, వలసల నివారణ, ఉపాధి హామీ పథకం అమలు, అంటువ్యాధుల నియంత్రణకు ముందస్తు ప్రణాళికలతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వేసవిలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు, తాత్కాలిక ప్రత్యామ్నాయ ప్రణాళికలు, నిధుల అవసరాలను ప్రత్యేకంగా చర్చించారు. వ్యవసాయానికి విద్యుత్‌ వినియోగం కొంత వరకు తగ్గినప్పటికీ, రాబోవు పక్షం రోజుల పాటు పంటలకు అవసరమైన మేరకు విద్యుత్‌ సరఫరా చేయడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా అత్యంత ప్రాధాన్యం అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
వనరులను గుర్తించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయడం, విద్యుత్‌ శాఖతో సమన్వయం ఏర్పరచుకొని సకాలంలో సక్రమంగా మంచినీటిని సరఫరా చేయడంపై గ్రామీణ మంచినీటి వ్యవస్థ దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. గ్రామీణ మంచినీటి అవసరాల కోసం రూ. 52 కోట్లు, పట్టణ ప్రాంత మంచినీటి సరఫరా కోసం రూ. 42 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంచినీటి అవసరాల కోసం నిధుల కొరత రానివ్వబోమని తెలిపారు. గ్రామాల్లో వలసలు నివారించాలని ముఖ్యమంత్రి సూచించారు. వేసవిలో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే కూలి 30 శాతం అధికం చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాబోవు 65 రోజుల పాటు కూలీలకు పనులు కల్పించడానికి స్థానికంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
రాబోవు మూడు సంవత్సరాల కాలంలో షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన 11 లక్షల ఎకరాల భూములను అభివృద్ధి పర్చడానికి రూ. 5675 కోట్లు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మహాత్మాగాంధీ వనాల పెంపకం పథకం కింద 30 కోట్ల మొక్కలు పెంచే పథకాన్ని పటిష్టంగా అమలు జరపాలని ఆదేశించారు. ప్రజాపధం, రైతు చైతన్య యాత్రల కోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా అధికారుల స్థాయిలో కార్యాచరణ ఉండాలని, రచ్చబండలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించి అర్హులకు ప్రయోజనం కల్పించవలసి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 572 కోట్లతో చేపట్టిన 1868 శాశ్వత తాగునీటి సరఫరా పథకాలను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయడానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను
కోరారు. వేసవిలో వచ్చే వ్యాధుల నియంత్రణ, నివారణలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెప్పారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగవలసి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసే విధంగా నిరంతర పర్యవేక్షణ, సమీక్ష అవసరమని సూచించారు.
వచ్చే నెల మొదటి వారంలో ప్రజాపధం కార్యక్రమం ఉంటుందని, అది పూర్తి కాగానే రైతు చైతన్య యాత్రలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, ఎన్‌.రఘువీరారెడ్డి, పి. బాలరాజు, డి.శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, మహీధర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి. ప్రసాద్‌, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ కాన్ఫరెన్‌లో పాల్గొన్నారు.

హ్యాపీ డేస్‌


వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలకు ఒకటే సరదా. అమ్మమ్మ, తాతయ్య ఊర్లకు వెళ్ళేవాళ్ళు కొందరైతే, మరికొందరు నగరాలలో స్విమ్మింగ్‌ పూల్స్‌, సమ్మర్‌ క్యాంప్స్‌లో కాలం గడుపుతారు. వేసవి ఎండలు ముదురు తుంటే గ్రామాలలో ముంజికాయ బండ్లు, చెరువుదగ్గర ఆటలు, చెరువులో స్నానాలు ఓ పక్కఅయితే, నగరాలలో ఐస్‌క్రీంలు తినడం, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడటం ఓ రివాజుగా మారింది. ఇక ఎండలకు తాళలేక, ముంజెలు, కొబ్బరి బోండాలు, చెరుకురసం, నిమ్మరసం, మామిడిపళ్ళ రసం మొదలైనవి లాగిస్తుంటారు.
రాను రాను, నగరాలలో సమ్మర్‌ క్యాంప్స్‌ పేరిట సమయం వృధా పోకుండా అనేక సంస్థలు విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు రూపొందించాయి. సమ్మర్‌లో ఏ మాత్రం బోర్‌ కొట్టకుండా వారికి మానసిక ఆనందాన్ని కలుగజేస్తాయి. హైదరాబాద్‌లోని వివిధ సంస్థలు నిర్వహించే కార్యక్రమాల సరళిని పరిశీలిద్దాం.
బాలవికాస్‌, మల్లికార్జున నగర్‌:
గోపాల్‌ నగర్‌లో నివాసముంటున్న ఉమ ఎస్‌బిఐలో సీనియర్‌ ఉద్యోగిని. ఆమె కేవలం వేసవిలోనే కాక సంవత్సర మంతా సత్యసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బాలవికాస్‌ తరగతులను పిల్లలకు నిర్వహిస్తారు. దీనిలో వేద పఠనం, శ్లోకాలు, గీత పంచతంత్ర కథలు ఇత్యాదివి నేర్పుతూ నేటి బాలల్ని రేపటి ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.
ట్రెజర్‌ హౌస్‌:
హాస్య కవితలు, పబ్లిక స్పీకింగ్‌, సైంటిఫిక క్రాఫ్ట్‌, యోగా, తరగ తుల ద్వారా మానసిక వికాసానికి, శారీరక వికాసానికి తోడ్పడుతున్నారు.
దివ్య ఇన్‌స్టిట్యూట్‌, కొంపల్లి:
సమ్మర్‌ క్యాంపులో పెయింటింగ్‌, వాటర్‌ కలర్స్‌, డ్రాయింగ్‌, స్కెచింగ్‌ నేర్పిస్తారు. ఏప్రిల్‌ 17 నుండి మే 17 వరకు చిత్రకళలో విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు.
ఇస్కాన్‌, సికిందరాబాద్‌:
ఇక్కడ పిల్లలకు భగవద్గీత శ్లోకాలను ఎంతో సులభంగా ఆలపించే విధంగా తర్ఫీదునిస్తారు. అంతేకాక వారి మానసిక ఉన్నతికి కాలానికను గుణంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించారు.
కిట్స్‌ జోన్‌, గాంధీ నగర్‌్‌:
ఇక్కడ డాన్స్‌, మ్యూజిక, క్రాఫ్ట్స్‌, గ్లాస్‌ డిజిటల్‌ పెయింటింగ్‌లో తరగతులను మే 4 నుండి జూన్‌ 3 వరకు నిర్వహించనున్నారు.
ఆల్‌ సైన్స్‌ హైస్కూల్‌, అబిడ్స్‌:
ఇక్కడ ఫుట్‌బాల్‌ తరగతులను 5 సంవత్సరాలనుండి 17 సంవత్స రాల పిల్లలకు ఏప్రిల్‌ 17 నుండి మే 20 వరకు నిర్వహించనున్నారు.
కళానిధి ఇన్‌స్టిట్యూట్‌, మారేడ్‌ పల్లి:
ఇక్కడ గిటార్‌, పియానో, ఫ్లూట్‌, కర్ణాటక సంగీతంను, సాయంకాలం 4 నుండి రాత్రి 9 వరకు నిర్వహించనున్నారు.
మామ్‌ అండ్‌ మి:
హైదరాబాద్‌ నగరంలోని ఆంధ్ర మహిళా సభ 'మామ్‌ అండ్‌ మి' సంస్థ ద్వారా ఏప్రిల్‌ 18 నుండి పిల్లలకు వేదగణితం, తోలుబొమ్మలాట, డ్రాయింగ్‌, పెయింటింగ్‌, నగల తయారీ, క్రాఫ్ట్‌, చేతివ్రాత, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ, కుండపై పెయింటింగ్‌, గ్లాస్‌పెయింటింగ్‌, ఇంగ్లీష్‌ బోధన నేర్పనున్నారని పోగ్రామ్‌ కో- ఆర్డినేటర్‌ స్వర్ణ దుర్గ తెలియజేశారు.
బెంగుళూరు
బెంగుళూరులో చిన్నార చావిడి:
ఈ సంస్థ మే 1నుండి 15 వరకు ఉదయం 9 నుండి సాయంకాలం 4.30 వరకు వాయిస్‌ కల్చర్‌, బాడీ లాంగ్వేజ్‌, పాటలు, డాన్స్‌, డ్రాయింగ్‌, బాలకవుల సమ్మేళనం నిర్వహించనున్నారు.
కిండర్‌ డాన్స్‌:
ఈ సంస్థ 2 సంవత్సరాలనుండి 8 సంవత్సరాల వయస్సు విద్యార్థులకు ఫిట్‌నెస్‌, డాన్స్‌, జిమ్నాస్టిక్స, బాడీ ఎవేర్‌నెస్‌ తదితర వినూత్న కార్యక్రమాలను రూపొందించారు.
ఐ-లీప్‌ అకాడమి:
ఈ సంస్థ ఏప్రిల్‌ 11 నుండి 16 వరకు పిల్లలకు ప్రకృతిని ఎలా ఆస్వాదించాలో వర్క్‌షాపులను నిర్వహించనున్నారు. మైక్రోస్కోప్‌ ద్వారా ప్రకృతి రహస్యాలను సైన్స్‌తో జోడించి అందజేయనున్నారు.
లాంచ్‌ పాడ్‌:
ఈ సంస్థ 5 సంవత్సరాలనుండి 10 సంవత్సరాల పిల్లలకు ఏప్రిల్‌ 29 వరకు సమ్మర్‌ క్యాంపులను నిర్వహించనున్నది.
జి-లెర్న్‌:
ఈ సంస్థ 3 నుండి 15 సంవత్సరాల పిల్లలకు వాళ్ళ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి రోబో టెక వర్క్‌షాపును నిర్వహించనుంది. దీని కారణంగా విద్యార్థులు గణితంలోనూ, సైన్స్‌లోనూవారి ప్రతిభ మరింత రాణిస్తుంది. వీరికి రోబోకిట్‌ ఇచ్చివారితో రోబోలను తయారుచేయిస్తారు.
జి-స్కూల్‌:
కిడ్‌జీ, మౌంట్‌ లిటరా జి స్కూల్‌తో కలిసి ఫ్రీ స్టెయిల్‌ డాన్స్‌ను నిర్వహించనున్నారు.
లతాస్‌ క్రియేటివిటీ:
పిల్లలకే కాక పెద్దలకు కూడా గిఫ్ట్‌ ప్యాకుల తయారీ, చాకలెేట్ల తయారీ, డెకరేటివ్‌ ప్యాకింగ్‌, క్రిస్టల్‌, గ్లాస్‌ పెయింటింగ్‌, గ్రీటింగ్‌ కార్డ్‌ తయారీ, పాట్‌ డెకరేషన్‌లో తరగతులను నిర్వహించనున్నారు.
గార్డెన్‌ గుషప్స్‌:
నేత, బొమ్మల తయారీ, బ్యాగుల తయారీలో పిల్లలకు తర్ఫీదునిస్తారు.
వేసవి కాలాన్ని వృధా చేయకుండా ప్రతిభకు పదును పెడితే పిల్లలు బాగా రాణిస్తారు. అయితే, చాలా సంస్థలు సమ్మర్‌ క్యాంపులకు రుసుం(ఫీజు) వసూలు చేస్తున్నాయి. ఆ సంస్థలు మధ్యతరగతి, దిగువ తరగతి విద్యార్థులను దృష్టిలో వుంచుకుని ఫీజులు వారికి అందు బాటులో ఉండేటట్లు చూడాలి. వేసవి దాటిందంటే మళ్ళీ స్కూలు ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులకు ఇబ్బందే! బాలవికాస్‌ లాంటి సంస్థలను మిగతా సంస్థలు ఆదర్శంగా తీసుకొంటే మంచిది. నేడు డాన్స్‌ బేబీ డాన్స్‌ తదితర కార్య క్రమాలు పిల్లలను విశేషంగా ఆకర్షిస్తు న్నాయి. వీటివైపు ప్రధానంగా దృష్టి మళ్ళించకుండా, వారు చదువుల్లో, మానసికంగానూ, శారీరకంగా అభివృద్ధి చెందేందుకు యోగాను ఎంపిక చేసుకో వాలి. విద్యార్థులను సెలవుల్లో ప్రయోజ నాత్మక సమ్మర్‌ క్యాంపులవైపు మళ్ళిస్తే , అవి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్లు అవుతుంది.

దిగజారిన ఇన్ఫీ క్యూ-4


ముంబై: స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ క్యూ-4 ఆర్థిక ఫలితాలు అంచనాలను చేరలేకపోయాయి. కనీసం ఆ సంస్థ ముందుగా ప్రకటించిన ఆదాయ లక్ష్యాన్ని సైతం తాకకపోడవంతో దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఇన్ఫోసిస్‌ ఈక్విటీ ఒక రోజు సెషన్‌లో భారీ నష్టాన్ని నమోదు చేసింది. ఒకవైపు సంస్థ ఆర్థిక ఫలితాల వెల్లడి ప్రారంభం కాగానే బిఎస్‌ఇలో ఇన్ఫీ షేర్‌ ప్రైస్‌ 10 శాతం పతనమైంది.
దేశంలోని రెండవ అతిపెద్ద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థ కన్సాలిడేటెడ్‌ విధానంలో 1,818 కోట్ల రూపాయల నికర లాభాన్ని నాలుగో త్రైమాసికంలో నమోదు చేసింది. గత సంవత్సరం నెట్‌ ప్రాఫిట్‌ 1,779.8 కోట్లతో పోలిస్తే ఇది కేవలం 2.15 శాతం అధికం. సంస్థ ఆదాయం సైతం 2 శాతపు నామమాత్రపు వృద్ధిని నమోదు చేసి 7,105.6 కోట్ల నుంచి 7,250 కోట్లకు చేరింది. అంతకుముందు సంస్థ నికరలాభం 1.856 కోట్లకు, ఆదాయం 7,447 కోట్లకు పెరుగుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. జనవరి-మార్చి మధ్య కాలంలో ఇబిఐటి మార్జిన్లు సైతం తగ్గి 29 శాతానికి చేరాయి. ఇతర అదాయాలు 65 శాతం పెరిగి 252 కోట్ల నుంచి 415 కోట్లకు చేరాయి. ఇపిఎస్‌ 119.41 రూపాయలుగా నమోదైంది.
ఈ మూడు నెలల కాలంలో 3,041 మంది సంస్థను వీడిపోయారు. ఇదే సమయంలో 45 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని సంస్థ వెల్లడించింది.
పాయ్‌ రాజీనామా
కాగా, ఇన్ఫోసిస్‌ బోర్డుకు మోహన్‌దాస్‌ పాయ్‌ రాజీనామా చేశారు. దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇన్ఫోసిస్‌ బోర్డుతో అనుబంధం పెంచుకున్న పాయ్‌ ప్రస్తుతం సంస్థలో టాప్‌-2 పొజిషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. నందన్‌ నిలేకనితో కలసి ఇన్ఫీ ఫౌండర్‌లలో ఒకరైన పాయ్‌ రాజీనామా అనంతరం అతనితోనే కలసి ప్రతిష్ఠాత్మక ఆధార్‌ ప్రాజెక్టుకు సేవలందించాలని నిర్ణయించుకున్నారు. సాధ్యమైనంత త్వరగా తనను విధుల నుంచి తప్పించాలని శుక్రవారం నాడు పాయ్‌ ఇన్ఫోసిస్‌ బోర్డును కోరారు. జూన్‌ 11న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన సంస్థను వీడవచ్చని సమాచారం.
2011-12 కనీస వృద్ధి 5.5 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి వార్షిక వృద్ధి 5.5 శాతం నుంచి 7.3 శాతం మధ్య ఉంటుందని ఇన్ఫోసిస్‌ అంచనా వేసింది. ఇపిఎస్‌ 126.05 నుంచి 128.21 రూపాయల మధ్య ఉంటుందని బోర్డు డైరెక్టర్‌ మోహన్‌ దాస్‌ పాయ్‌ వివరించారు. ఐటి సేవల నిమిత్తం క్లయింట్లు వెచ్చిస్తున్న మొత్తం ఒడిదుడుకులకు లోనవుతోందని, దీనికితోడు మారక ద్రవ్య విలువల్లో మార్పు ఫలితాలపై ప్రభావం చూపుతోందని వివరించారు.
100 కంపెనీలకు సిఇఒలు ఇన్ఫీ ఉద్యోగులే
సమీప భవిష్యత్‌లో కనీసం 100 కంపెనీల్లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లుగా ఇన్ఫోసిస్‌ ఉద్యోగులను చూడనున్నామని మోహన్‌దాస్‌ పాయ్‌ అభిప్రాయపడ్డారు. సంస్థలో 1.3 లక్షల మంది ఉద్యోగులు అత్యంత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దబడ్డారని, భవిష్యత్‌లో వీరిలో నుంచి కనీసం వంద మంది చిన్న, మధ్య తరహా కంపెనీలకు చీఫ్‌లు కానున్నారని ఆయన అన్నారు. కె దినేష్‌ రాజీనామాపై స్పందిస్తూ, ఆరోగ్య కారణాల వల్లే ఆయన సంస్థకు దూరం కావాల్సి వచ్చిందని వివరించారు.

నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ వాట్సన్‌


దుబాయి: అంతర్జాతీయ క్రికెట్‌ (ఐసిసి) వన్డే ఆల్‌రౌండర్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్‌ సిరీస్‌లో మెరుగైన ప్రతిభను కనబరచడం ద్వారా వాట్సన్‌ నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. వాట్సన్‌ ఆల్‌రౌండర్స్‌ జాబితాలో నెంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకోవడం కెరీర్‌లో ఇదే ప్రథమం. మరోవైపు వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లోనూ వాట్సన్‌ తన స్థానాన్ని మెరుగు పరుచుకున్నాడు. ఏకంగా తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకొని 4వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్స్‌ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ సాకిబ్‌ అల్‌ హసన్‌ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్‌ వన్డే సారథి షాహిద్‌ అఫ్రిది మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రతిభను కనబరిచి భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌కు ఈ జాబితాలో నాలుగో స్థానం దక్కింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన యువీ భారత్‌కు ఒంటిచేత్తో కప్పును సాధించి పెట్టిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌కు ఐదో ర్యాంక్‌ లభించింది. గతంలో నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగిన కలిస్‌ కొంతకాలంగా గాయంతో సతమతమవుతున్నాడు. దీని ప్రభావం అతని ఆటపై పడింది. దీంతో అతను ఐదో ర్యాంక్‌తోనే సరిపెట్టుకోక తప్పదు. మరోవైపు వన్డే బ్యాటింగ్స్‌లో హాషిం ఆవ్లూ టాప్‌ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. డివిలియర్స్‌ రెండో, దిల్షాన్‌ మూడో ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్‌ విభాగంలో డానియల్‌ వెటోరీ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ప్రైస్‌ రెండో, స్వాన్‌ మూడో ర్యాంక్‌ను పొందారు.
ఆసీస్‌దే అగ్రస్థానం...
వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను కాపాడుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా ఆస్ట్రేలియా టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకొంది. ఇటీవల ప్రపంచకప్‌ గెలుచుకున్న టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్‌కప్‌ గెలిచినా భారత్‌కు అగ్రస్థానం దక్కలేదు. బంగ్లాపై ఘన విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా 129 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌ 121 పాయింట్లతో రెండో, శ్రీలంక 118 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ జట్లు తర్వాత స్థానాలను దక్కించుకొన్నాయి. మరోవైపు టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను కాపాడుకొంది. 128 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా రెండో, ఇంగ్లండ్‌ మూడో స్థానంలో నిలిచాయి. శ్రీలంకకు నాలుగో ర్యాంక్‌ దక్కింది. ఆస్ట్రేలియా 107 పాయింట్లతో ఐదో స్థానంతో సంతృప్తి పడింది. బ్యాటింగ్‌లో సచిన్‌కు టాప్‌ ర్యాంక్‌ దక్కింది. బౌలింగ్‌లో స్టెయిన్‌ మొదటి ర్యాంక్‌లో నిలిచాడు.

ముంబైకి కొచ్చి షాక్ !


ముంబై: ఐపిఎల్‌లో కొచ్చి టస్కర్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో కొచ్చి 8వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ముంబైకి ఇది ఓటమి కాగా, కొత్త జట్టు కొచ్చికి ఇదే మొదటి గెలుపు కావడం విశేషం. మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ 66 బంతుల్లోనే 12ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయ సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కొచ్చి 19 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకొంది. ఓపెనర్లు బ్రాండన్‌ మెకుల్లమ్‌ 60 బంతుల్లో 10ఫోర్లు, రెండు సిక్సర్లతో 81, మహేల జయవర్ధనే 36 బంతుల్లో 9ఫోర్లతో 56 పరుగులు సాధించి కొచ్చి విజయం కీలక పాత్ర పోషించారు. చివర్లో రవీంద్ర జడేజా 11 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 25, హడ్జ్‌ 7 బంతుల్లో 11 పరుగులతో అజేయంగా నిలిచి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.