Thursday, March 31, 2011

పులి వన్నె శునకం


వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌లో పెంపుడు జంతువుల అలంకరణ వంటి వి షయాలను చూసే ఒక సం స్థ యజమానురాలు తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించేందుకు తన పెంపుడు కుక్కకు రంగుల అద్ది దానిని పెద్ద పులిలా కనబడేలా చేసింది. జోలీవుడ్‌ హౌస్‌ అనె ఈ యజమానురాలు తన వద్ద ఉన్న మూడేళ్ల ఆస్ట్రేలియన్‌ లాబ్రడూడల్‌ కుక్కకు సిందూరం (ఆరెంజ్‌) రంగు పూయడంతోపాటు దానిపై నల్లటి చారలు దిద్దింది. దీనిని చూసిన వారు ఒక నవ్వు నవ్వేలా చేయడం, వారికి సరదాగా మాట్లాడుకోవడానికి ఏదో ఒక అంశం కల్పించడానికే తాను ఇటువంటి అలంకరణ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఎక్కువమంది దీనిని చూసి సానుకూలంగానే స్పందించారని తెలిపారు.
కొంత మందికి ఇలా ఎందుకు చేసామో అర్థం కాలేదని అయితే సరదా కోసమే ఇలా చేశామని తెలుసుకున్నాక వారు ఆనందం వ్యక్తం చశారని జోడీ వుడ్‌హౌస్‌ తెలిపారు. తాను తన కుక్కకు 100 శాతం క్షేమకరమైన జపాన్‌ డైని వాడానని ఆమె తెలిపారు. కొద్ది నెలల వరకూ మళ్లి ఆ కుక్క జూలును క్లిప్పింగ్‌ చేసేవరకూ ఆ అలంకరణ నిలుస్తుందని ఆమె తెలిపారు. ఆమె సెలబ్రిటీ వుడ్‌హౌస్‌ అని పిలిచే తన కుక్కను ప్రతిరోజూ తాను పని చేసే టౌరంగా ప్రాంతానికి వెంట తీసుకువెడుతుంది.

ముందు కాళ్ల నడక

బీజింగ్‌ : కేవలం ముందు రెండు కాళ్లతో నడుస్తున్న మేకపిల్ల చైనాలో వెలుగు చూసింది. లియాంగింగ్‌ రాష్ట్రం యాంగ్జీ ప్రాంతంలోని హెగ్జింగ్‌ గ్రామ వాసి ల్వీ (61) మాట్లాడుతూ మూడు నెలల క్రితం చిన్న ఊతకర్రలాంటి వెనక కాళ్లతో జన్మించిన మేకపిల్ల మనుగడ సాగిస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశాడు. తాను పలు దఫాలు ఆ మేకపిల్లను నిలబెట్టేందుకు విఫలయత్నం చేశానని ల్వీ పేర్కొన్నాడు. ప్రతిరోజు తాను, తన భార్య ఆ మేకపిల్లను ఎత్తుకుని తల్లి మేక వద్దకు తీసుకెళ్లి పాలు త్రాగిస్తున్నామని ల్వీ తెలిపాడు. అయితే ముందుకాళ్లతోనే నిలబడేందుకు ప్రయత్నిస్తున్న ఈ బుల్లి మేక వెంటనే పడిపోతుందని ఆయన వివరించాడు. నిత్యం ఈ బుల్లి మేకకు ముందు కాళ్ల ఆధారంగా నడిచేందుకు శిక్షణనిస్తున్నామని ల్వీ తెలిపాడు. ఈ విషయం తెలిసి చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు ప్రతిరోజూ వచ్చి వెళుతున్నారని ల్వీ తెలిపాడు. మూడు నెలల శిక్షణ తర్వాత ప్రస్తుతం తన తల్లి మేక వద్దకు వెళ్లి పాలు తాగుతోందన్న ల్వీ తన జీవితంలో ఇటువంటి వింత చూడలేదన్నాడు.

ఆడియో-విడియో చాట్‌ సేవలు అందించనున్న జోహో


హైదరాబాద్‌: కాలిఫోర్నియా కేంద్రంగా ఆన్‌లైన్‌ బిజినెస్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ సేవలందిస్తున్న జోహో కార్పొరేషన్‌ చిన్న, మధ్య తరహా కంపెనీల కోసం ఆడియో - విడియో చాటింగ్‌ సేవలను డిసెంబర్‌లోగా అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త అప్లికేషన్‌లో జోహో మెయిల్‌ వంటి అదనపు ఫీచర్లనూ అందిస్తున్నామని, బిజినెస్‌, ప్రొఫెషనల్స్‌కు ఉపయోగపడేలా తీర్చిదిద్దామని సంస్థ ఆసియా పసిఫిక్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ మార్తి వివరించారు. ఇక్కడ జరుగుతున్న 20వ అంతర్జాతీయ వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన సైడ్‌లైన్స్‌లో మీడియాతో మాట్లాడారు.
యాహూ లేదా గూగుల్‌లో ఎకౌంట్‌ను కలిగివున్నవారు జోహోలో సైన్‌ చేసి విడియో ఆడియో చాటింగ్‌ సేవలు పొందవచ్చని, ఇందుకోసం తాము ప్లగ్‌-ఇన్‌లను అందిస్తామని వివరించారు. ప్రారంభదశలో జోహో మెయిల్‌ సేవల కోసం సంవత్సరానికి 25 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. సంస్థ చెన్నైలో నిర్వహిస్తున్న కార్యాలయంలో 1500 మంది ఉద్యోగులు విధులను నిర్వహిస్తున్నారని తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ పిసిల కోసం 28 కొత్త అప్లికేషన్లను విడుదల చేయనున్నామని వివరించారు.

మరో ఆల్‌ టైం రికార్డుకు వెండి


  • కిలో 56,900/-
ముంబై: మధ్య ప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న అనిశ్చితి వెండి ధరలను మరింతగా పెంచింది. గురువారం నాటి బులియన్‌ మార్కెట్లో కిలో వెండి ధర క్రితం ముగింపుతో పోలిస్తే 490 రూపాయలు పెరిగి 56,900 రూపాయలకు చేరి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయిని నమోదు చేసింది. దేశ రాజధానిలో ఇదే కాంట్రాక్టు ధర 600 రూపాయలు పెరిగి 56,600కు చేరింది. వెండి కొనుగోలుకు స్టాకిస్టులు, ఆభరణాల తయారీదారుల నుంచి మంచి మద్దతు వస్తుండటమే ధరలు పెరిగేందుకు కారణమైనాయని నిపుణులు వ్యాఖ్యానించారు. స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 80 రూపాయలు పెరిగి 20,875 రూపాయలకు, ఆర్నమెంట్‌ బంగారం 20,775 రూపాయలకు చేరింది. మరోవైపు యూరప్‌లో స్పాట్‌ గోల్డ్‌ధర ఔన్సుకు 1,428.90 డాలర్లకు, వెండి ధర 37.76 డాలర్లకు పెరిగింది.

రూ 22,250 కోట్లతో ఎస్సార్‌ ను కోనుగోలు చేయనున్న వోడాఫోన్‌


లండన్‌/న్యూఢిల్లి: ఆదాయం పరంగా ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్‌ ఆపరేటర్‌గా ఉన్న వోడాఫోన్‌ భారత్‌లో ఎస్సార్‌ కార్యకలాపాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 5 బిలియన్‌ డాలర్లను (సుమారు 22,250 కోట్ల రూపాయలు) చెల్లించేందుకు సంస్థ ప్రాధమిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. వోడాఫోన్‌, ఎస్సార్‌ గ్రూప్‌లు ఇండియాలో జాయింట్‌ వెంచర్‌ను ప్రారంభించి వోడాఫోన్‌ ఎస్సార్‌ పేరిట టెలికం సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడా జాయింట్‌ వెంచర్‌లోని 33 శాతం ఎస్సార్‌ వాటాలను వోడాఫోన్‌ కొనుగోలు చేయడంతో పాటు త్వరలో ఐపిఒకు వెళ్ళి నిధులను సేకరించాలని కూడా భావిస్తోంది. కాగా, 2007లో టెలికం రంగంలోకి వచ్చిన వోడాఫోన్‌ ఆది నుంచి అమితమైన పోటీని ఎదుర్కొంటూ నిలదొక్కుకోవడంలో విజయం సాధించింది.
ఎస్సార్‌ 33 శాతం వాటాలను కొనుగోలు చేస్తే వోడాఫోన్‌కు 75 శాతం వరకూ వాటా పెరుగుతుందని అంచనా. దేశంలో నిబంధనలను అనుసరించి ఏ లిస్టెడ్‌ కంపెనీలో కూడా 74 శాతానికి మించి ప్రమోటర్‌ వాటా ఉండకూడదు. ఈ నేపథ్యంలో ఒక శాతం వాటాను ఐపిఒ ద్వారా విక్రయించాల్సి వుంటుంది. ఇదే సమయంలో మరింత వాటాలను ఉపసంహరించుకుని సంస్థ అభివృద్ధి ప్రణాళికల అమలుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
నవంబర్‌ నాటికి ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ను చేయనున్నామని వివరించారు. ఈ డీల్‌ విలువ, లావాదేవీలో పొందుపరిచిన నిబంధనలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంగీకరించాల్సి వుంది. 2007లో వోడాఫోన్‌ 11.1 బిలియన్‌ డాలర్లు చెల్లించి హచ్‌ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రూపంలో వచ్చిన అత్యధిక నిధుల మొత్తం ఈ డీల్‌దే కావడం గమనార్హం. ఎస్సార్‌ వాటాలను కొనుగోలు చేసిన తరువాత సంస్థలో వోడాఫోన్‌ వాటా ఎంతకు పెరుగుతుందన్న విషయం స్పష్టంగా వెల్లడికావాల్సి వుంది. ఈ విషయంలో కంపెనీ కూడా స్పందించలేదు. టెలికం రంగంలో ఎఫ్‌డిఐ అవధి 74 శాతం కాగా, వోడాఫోన్‌ దాన్ని అధిగమించకుండా డీల్‌ను పూర్తి చేయాల్సి వుంది.

అడుగు దూరంలో..


కోట్లాది మంది దేశ ప్రజల ఆశలను మోస్తూ ఫైనల్‌కు చేరిన టీమిండియా ప్రపంచకప్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్‌ ఆసియాకే చెందిన శ్రీలంకతో తలపడుతుంది. మొహాలీలో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయం సాధించిన భారత్‌ తుదిపోరుకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే సంచలన విజయాలకు పెట్టింది పేరైన లంకతో తుది సమరం టీమిండియాకు సవాలుగా మారింది. సమకాలిన ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు లంకలో ఉన్నారు. దీనికి తోడు భారత జట్టులోని బలబలహీనతలు అన్ని లంకకు బాగా తెలుసు. ఈ పరిస్థితుల్లో తుది సమరంలో సంగక్కర సేనను ఓడించాలంటే ధోనీ సేన తన అస్త్రాలకు పదును పెట్టక తప్పదు. కిందటిసారి వెస్టిండీస్‌ గడ్డపై జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన లంక ఈసారి ఎలాగైన విశ్వవిజేతగా నిలువాలనే పట్టుదలతో ఉంది. దీంతో లంకను ఓడించేందుకు భారత్‌ పకడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో రెండు జట్లు కూడా చిరస్మరణీయ ఆటను కనబరిచాయి. ఇరు జట్లలోనూ ప్రతిబకు కొదవలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో బలబలాలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కచ్చితంగా ఫలానా జట్టు కప్పు గెలుస్తుందని చెప్పడం అత్యాశే అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సొంతగడ్డపై జరుగుతున్న ఫైనల్లో టీమిండియాకే మెరుగైన అవకాశాలున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. అయితే స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్లు లంకకు అందుబాటులో ఉన్నారు. ఓపెనర్లు తిలకరత్నే దిల్షాన్‌, ఉపుల్‌ తరంగలతోపాటు కెప్టెన్‌ సంగక్కర, మాజీ సారథి మహేల జయవర్ధనే, సమరవీర, కపుగెడెర, చమరసిల్వా వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్లు లంక సొంతం. దీనికితోడు మలింగ, మురళీధరన్‌, కులశేఖర, రంగన హెరాత్‌, అజంత మెండిస్‌ వంటి ప్రతిభావంతులతో కూడిన బలమైన బౌలింగ్‌ లైనప్‌ భారత్‌కు సవాలు విసిరేందుకు సిద్ధంగా ఉంది. దీంతో టీమిండియా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఆడిన కప్‌ గెలిచేందుకు అందివచ్చిన సువర్ణ అవకాశం చేజారి పోవడం ఖాయం.
ఒత్తిడి లేకుండా...
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించి ఫైనల్‌కు చేరిన టీమిండియాకే ప్రపంచకప్‌ గెలుచుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే దీని కోసం ఒత్తిడిని దరి చేరకుండా చూడాలి. 1996లో ముంబైలో శ్రీలంకతోనే జరిగిన వరల్డ్‌కప్‌ సెమీస్‌లో భారత్‌ ఒత్తిడికి తట్టుకోలేక ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కళ్లు చెదిరే శుభారంభం చేసిన భారత్‌ తర్వాత ఒత్తిడికి తట్టుకోలేక 120 పరుగులకే 8వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియా ఆ మ్యాచ్‌లో అవమానకర రీతిలో ఓటమి పాలుకాక తప్పలేదు. ఈసారి మాత్రం అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జట్టుపై ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో భారత్‌ ఎంతో బలంగా ఉంది. ఓపెనర్లు సచిన్‌, సెహ్వాగ్‌ అద్భుత ఫాంలో ఉన్నారు. సెహ్వాగ్‌ ఫైనల్లో కనీసం 30 ఓవర్లల వరకైన క్రీజులో నిలదొక్కుకుంటే జట్టుకు భారీ స్కోరు ఖాయం. అదే విధంగా సచిన్‌ కూడా మరోసారి మాస్టర్‌ ఇన్నింగ్స్‌ ఆడాలి. పాక్‌పై కాస్త ఒత్తిడికి గురైన మాస్టర్‌ లంకపై మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న ఫైనల్లో వందో సెంచరీని సాధించి జట్టును విశ్వవిజేతగా నిలపాలని శతకోటి అభిమానులు కోరుకుంటున్నారు. వారి ఆశలను వమ్ము చేయకూడదనే పట్టుదలతో మాస్టర్‌ ఉన్నాడు.
ఇదే జరిగితే లంక బౌలర్లకు కష్టాలు తప్పవు. మరోవైపు కోహ్లి, గంభీర్‌, యువరాజ్‌, ధోనీ, రైనాలు కూడా బ్యాటింగ్‌లో చెలరేగాలి. వీరిలో కనీసం ఒక్కరైనా భారీ ఇన్నింగ్స్‌ ఆడితే జట్టు పటిష్టస్థితిలో నిలువడం ఖాయం. ఇక, బౌలింగ్‌లో జట్టు భారమంత జహీర్‌పైనే ఆధారపడి ఉంది. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్న జహీర్‌ ఫైనల్లోనూ చెలరేగితే జట్టు బౌలింగ్‌ కష్టాలు తీరుతాయి. నెహ్రా, మునాఫ్‌, హర్భజన్‌లు కూడా మెరుగ్గా రాణించక తప్పదు. ఇక, యువీ ఐదో బౌలర్‌ బాధ్యతను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఇటు బ్యాట్స్‌తో అటు బంతితో మెరుగ్గా రాణించిన యువీ ఫైనల్లోనూ అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. అంత అనుకున్నట్టుగా సాగితే టీమిండియా తన ఖాతాలో రెండో ప్రపంచకప్‌ ట్రోఫీని జమ చేసుకోవడం ఖాయం. 

సిద్ధాంతాలకు తిలోదకాలా?


తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ మహా పురుషులకు ఇలా ఉరి వేసింది టెర్రరిస్టులేననేది సుస్పష్టం. టిఆర్‌ఎస్‌ అంటే తాలిబన్‌ రౌడీ పార్టీ అని సీమాంధ్ర నేతలు అనడానికి కారణం ఇప్పుడు ఉద్యమం బిజెపి, టిఆర్‌ఎస్‌ల చేతిలో లేదు. అది ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ ప్రత్యేక తెలంగాణా వచ్చినా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల భవిష్యత్తు ఈ రౌడీల చేతిలో సురక్షితంగా ఉంటుందా?? ఇంత విధ్వంసం జరుగుతున్నా ఢిల్లిd పెద్దలు ఎందుకు చోద్యం చిత్తగిస్తున్నారు? అంటే ఎపి ''చే''జారిపోకూడదని? అదే జరిగితే సూట్‌కేసులు మరో రాష్ట్రం నుండి అందవు - అని''
వాము తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించకుంటూ కూర్చున్నాడని ఇంగ్లిష్‌లో ఓ సామెత అది నిజమేనని 2011లో మరోసారి భారత్‌లో రుజువు అయింది. పింగళి వెంకయ్య జాతీయ కాంగ్రెస్‌ పతాక నిర్మాత. నిస్వార్థ జీవితం గడిపిన పుణ్య పురుషుడు. ఆయన విగ్రహం నేలకూల్చడం రాక్షసులు చేసే పని. అంటే అరాజకం సృష్టించడానికి 'తెలంగాణ' ఉద్యమాన్ని టెర్రరిస్టులు ఒక 'సాకు' (ూస|ష|ష)గా వాడుకుంటున్నారు అనే సుస్పష్టం. మరి కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తున్నది? కారణం ఒకటే ఆంధ్రప్రదేశ్‌ 'చే'జారిపోతే వింధ్యకు దిగువన గల మొత్తం దక్షిణ భారతంలో కాంగ్రెస్‌ అన్న పేరు మిగలదు - ఇక రెండవ కారణం సోనియాగాంధీ, ఇందిరాగాధీ కాదు? ఈమెకు జాషువా, అన్నమయ్య, పింగళి వెంకయ్యల మీద ఎందుకు గౌరవం, ప్రేమాభిమానాలు ఉంటాయి?? ఎందుకంటే ఈమెకు ఈ దేశ చరిత్ర తెలియదు. అన్నమాచార్య అంటే అన్నము - చారు అనుకుంటుంది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా వెంకటేశ్వరస్వామి ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? బహుశ మన మత పెద్దలు అందుకే ఆయనకు కళ్లు కనపడకుండా తెల్లటి పట్టీలు వేశారు?! ''విగ్రహాల విధ్వంసం భావోద్రేకంతో తాత్కాలికంగా జరిగిన పని కాదు - ఆందోళనకారులు సుత్తెలు - బ్లేడ్లు తాళ్లతో ప్రణాళిక బద్ధంగా టాంక్‌బండ్‌కు చేరారు'' అని పోలీసు ఉన్నతాధికారి అకున్‌ సభర్వాల్‌ మార్చి 11వ తేదీ శుక్రవారం ప్రకటించారు. అంటే ఈ పుణ్య పురుషుల విగ్రహాలను తొలగించాలని చాలా ముందే ఉద్యమకారులు నిర్వహించుకున్నారని అందుకే టాంక్‌బండ్‌పై సమావేశ స్థలాన్ని నిర్ణయించుకొని పగులగొట్టిన విగ్రహాలను అన్నింటినీ హుస్సేన్‌సాగర్‌లో విసిరివేయాలని వ్యూహరచన చేశారనేది సుస్పష్టం. దీనికి నైతిక బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కోరారు. అది జరిగే పని కాదు - శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని వాగ్దానం చేసి విధ్వంసం సృష్టించినందుకు కనీసం కెసిఆర్‌, కోదండ రాంలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి ఉండవలసింది.
''నాడు బాబ్రీ మసీదు వలె నేడు టాంక్‌బండ్‌పై విగ్రహాల ధ్వంసానికి బిజెపియే కారణం'' అని ఒక ఆరోపణ. విగ్రహాల ధ్వంసం సందర్భంలో జరిగిన ప్రత్యక్ష సంభాషణను ఒక పత్రిక ఇలా రిపోర్టు చేసింది. ఆందోళనకారులు విగ్రహాలు వరుసగా ధ్వంసం చేస్తూ శ్రీశ్రీ విగ్రహం వద్దకు వెళ్లారు. కాసింత డామేజ్‌ జరిగింది. ఇంతలో తోటి మిత్రులు వచ్చి 'ఇతడు మనవాడు. విప్లవ రచయిత - ఈ విగ్రహాన్ని ఏమీ చేయకండి' అన్నారు. దానితో ఆ విగ్రహాన్ని వదిలి పక్క విగ్రహం వద్దకు పోయారు. దీనిని బట్టి విగ్రహాలను ధ్వంసం చేసింది అతివాదులేనని సుస్పష్టం - కాకుంటే బాబ్రీ విధ్వంసం చేసింది శివసైనికులు వారేనని బిజెపి తెలియజేసింది. టాంక్‌బండ్‌ విగ్రహాల విధ్వంసం చేసింది విప్లవ విద్యార్థి సంఘాలు, ఎబివిపి బిజెపి వారు చెట్టాపట్టాలు వేసుకొని ఉద్యమం నడపుతున్నారు. అందువల్లనే ఈ ఆరోపణలు. కాకుల గూటిలో కోకిల ఉన్నా కోకిలను కాకి అనే అనుకుంటారు.
ఉద్యమ స్వరూపమేమిటి?
తెలంగాణా ప్రాంతం ఏడు వందల సంవత్సరాలు ముస్లిం పరిపాలనలో ఉంది. 1310 మాలిక్‌ కాఫర్‌ దండయాత్రలో కాకతీయ సూర్యుడు (ప్రతాపుడు) అంతరించాడు - నాటినుంచి 1948 వరకు తెలంగాణ ప్రజలు బానిసలుగా బతికారు. 'బాంచను దొరా నీ కాల్మొక్తా' అనేది ఇక్కడ నేటికీ ఊతపదం - వీరిని బానిసలు చేసింది ఎవరా!
1. ముస్లిం పాలకులు 2. రెడ్డిదొరలు 3. వెలమదొరలు. ఈ మూడూ ప్రధాన వర్గాలు. స్వాతంత్య్రం వచ్చాక వారికి స్వరాష్ట్ర కాంక్ష ఉండేది. ఐతై 'తెలుగు భాష మాట్లాడే వారంతా ఒకేచోట ఉండాలనే భాషా ప్రయుక్త రాష్ట్ర దృష్టిలో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ గారు ఆంధ్ర, సీమ, తెలంగాణ ప్రాంతాలను ఏకం చేశారు. ఇలా భౌగోళిక సమైక్యత వచ్చినా భావ సమైక్యత రాలేదూ ఇదే ప్రధాన కారణం.
ఇప్పుడు 2011లో తెలంగాణ ఉద్యమం నడుపుతున్నదెవరు? మళ్లిd రెడ్డి, వెలమ నాయకులే. 1969లో ఉద్యమం నడిపింది కూడా రెడ్డి నాయకులే బలి అయింది. అప్పుడు ఇప్పుడు (500్శ600) సామాన్యులు, అట్టడుగు వర్గాల వారు, విద్యార్థులు. అలాగే ఆంధ్ర ప్రాంతంలో కూడా జైఆంధ్ర ఉద్యమం నడిపిన వారిలో కాకాని (ఉక్కు కాకాని బిరుదాంకితుడు) వంటి కమ్మవారు ప్రధాన పాత్ర పోషించారు.
ఇవాళ (2011) తెలంగాణా ఉద్యమంలో ఎవరెవరు ఎందుకు పాల్గొంటున్నారు?
(1) బిజెపి : ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి పట్టులేదు. ఆంధ్ర ప్రాంతంలో మరొక యాభై ఏళ్ళకు కూడా ఒక్క అసెంబ్లిd సీటు కూడా రాదు. తెలంగాణా ఉద్యమం ద్వారా ఇక్కడ కొన్ని పార్లమెంట్‌ సీట్లు సంపాదించుకోవాలని కోరిక.
(2) గద్దర్‌ : విప్లవ గాయకుడు - చత్తీస్‌గఢ్‌ ఉత్తర తెలంగాణా దండకారణ్యం కలిపి బృహత్‌ దండకారణ్య రెడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని వారి లక్ష్యం.
కెసిఆర్‌, వెలమ దొర - కోల్పోయిన తమ ప్రాభవాన్ని పెత్తనాన్ని మళ్ళీ ఈ ఉద్యమం ద్వారా పునరుద్ధరించుకోవాలని కోరిక.
ఎంఐఎం : ప్రత్యేక రాష్ట్రం వస్తే బిజెపి బలపడుతుందని మత యుద్ధాలు వస్తాయని వారు సమైక్య రాష్ట్రం కోరుతున్నారు.
స్థూలంగా ఇదీ 2011 నాటి ఆంధ్ర - తెలంగాణా ఉద్యమ ముఖచిత్రం!!
'అన్నదమ్ముల్లా విడిపోదాం - విడిపోయి కలిసి ఉందా' అనే తియతియ్యని మాటలు చెప్పిన వారే 'ఆంధ్ర భాగో - తెలంగాణ జాగో' అనే నినాదాలు ఇచ్చారు. హైదరాబాద్‌ నగరంలోనే ముస్లింలు ముప్పది లక్షలు ఆంధ్రులు మరొక ముప్పది లక్షలు - పార్సీ, కన్నడ, మహారాష్ట్ర, తమిళ, బెంగాలీ ఇత్యాది కాస్మా పాలిటన్‌ వర్గాలు మరొక పది లక్షలు ఉన్నారు. వీరెవరికీ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష లేదు. హైదరాబాద్‌ రాజధాని కావటం వల్ల అంతా ఇక్కడికి వచ్చారు. వీరంతా 'భాగో' అంటే విజయవాడకు, పాకిస్థాన్‌ను, బొంబయి, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రాంతాలకు పోవాలి. ఇదే ప్రధాన సమస్య!!
ఇక విగ్రహాలకు సంబంధించి మరికొన్ని విగ్రహాలు పెట్టాలి అని తెలంగాణావాదులు అడుగుతున్నారు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదు.
(1) పాల్కురికి సోమనాథుడు, (2) రావి నారాయణరెడ్డి, దాశరథి, కాళోజీ నారాయణరావు, విద్యానాథుడు చెర్విరాల భాగయ్య, మహామంత్రి మాదన్న, సర్వాయి పాపన్న ఇత్యాదుల విగ్రహాలు టాంక్‌బండ్‌ మీద లేకపోవడం లోపమే! వీరంతా తెలంగాణా ప్రాంతం వారే. ఇక్కడ చోటు చాలకపోతే నెక్లెస్‌ రోడ్డు వైపు మరికొన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు. అంతేకాని ఉన్న విగ్రహాలు కూల్చటం విద్రోహ చర్య.
అలాగే హైదరాబాద్‌ మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ, కొక్కొండ వెంకటరత్నం పంతులు (తొలి తెలుగు నవలా రచయిత) చిలకమర్తి లక్ష్మీనరసింహం, టి.ఎల్‌.కాంతారావు, మహానటి సావిత్రి, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణ, ఆనంద గజపతి, శ్రీనాథుడు అల్లసాని పెద్దన వంటి మరికొందరి విగ్రహాలు కూడా అటు నెక్లెస్‌ రోడ్‌వైపు పెట్టుకోవచ్చు.
'కెసిఆర్‌, కోదండరామ్‌లపై కేసులు పెడితే చాలదు వారిని అండమాన్‌కు (రాష్ట్రానికి) దూరంగా ఈ విచారణ పూర్తయ్యే వరకు పంపాలి' అని మంత్రి టి.జి. వెంకటేశ్‌ గారు (12-3-2011) ప్రకటించారు.
పాఠాలు - గుణపాఠాలు :
2011 మార్చి 10 గురువారం హైదరాబాద్‌లో టాంక్‌బండ్‌పై జరిగిన సంఘటన భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాధానమైనది. బాబ్రీ మసీదు విధ్వంసం వంటి ప్రముఖ సంఘటన ఇది. దీని వలన చరిత్రకారులు కొన్ని పాఠాలు - గుణపాఠాలు విశ్లేషించి చరిత్రలో చేర్చవచ్చు.
(1) ఉద్యమం తీవ్రరూపంలో ఉన్నప్పుడు అది నాయకుల చేతిలో నుండి అదుపు తప్పుతుంది.
(2) లక్ష్యసాధన కోసం ఉద్యమకారులు విధ్వంస మార్గాలను ఎంచుకుంటారు.
(3) జాతి సంస్కృతి - సభ్యత - నాగరికతలను కూడా నిర్మూలించి లక్ష్యసాధన కోసం ముందుకు సాగవచ్చు.
(4) రాజకీయ లబ్ధి కోసం సిద్ధాంతాలకు తిలోదకాలు వదులుతారు. ఖద్దర్లూ - గద్దర్లూ కలుస్తారు. కాషాయం ఎర్ర రంగుగా మారుతుంది.
(5) లక్ష్యసాధన కోసం రాజకీయ నాయకులు (1) మతం, (2) ప్రాంతం, (3) భాష, యాన వంటి దురభిమానాలను రెచ్చగొట్టవచ్చు.
(6) మొత్తం మానవ చరిత్రలో ఎప్పుడైనా ఏ దేశంలోనైనా అధిపతులూ, వారి వారసులు, సంతతి, వంది మాగధులూ సుఖంగా ఉంటారు. భావోద్రేకాలను రెచ్చగొట్టి సామాన్యులను బలి పశువులను చేస్తూ ఉంటారు.
హిట్లర్‌, స్టాలిన్‌, బిన్‌ లాడెన్‌, భింద్రేన్‌వాలా, కోదాడ రామరెడ్డి, కెసిఆర్‌, బాలథాక్రే, కరుణానిధి వంటి కొన్ని పేర్లు ఇందుకు ఉదాహరణలు.
(7) విధ్వంసకారులుకు మానవత్వం ఉండదు. లక్ష్యసాధన కోసం వందలాది ప్రజలను రెచ్చగొట్టి పోలీసు కాల్పుల్లో చంపిస్తారు లేదా భావోద్రేకాలలో ఆత్మాహత్యలు చేసుకునేటట్లు చేస్తారు.
(8) శాంతి, అహింస వంటి నీతులు పుస్తకాలకే పరిమితం. నిత్యజీవితంలో హింస, ద్వేషం ద్వారా విజయం సాధిస్తున్నారు.
(9) ఉద్యమ నిర్వహణకు సైద్ధాంతిక నిబద్ధత గల కార్యకర్తలను వాడుకోవచ్చు - లేదా మెర్సినరీస్‌ (కిరాయి వ్యక్తులను) వాడుకోవచ్చు.
(10) ఉద్యమానికి గాంధేయ మార్గంలో కార్యకర్తల నుండి వాలంటరీగా విరాళాలు సేకరించవచ్చు లేదా ధనిక వర్గాల నుండి నయాన - భయాన భారీ మొత్తాలు సేకరించవచ్చు. అందులో పెద్ద మొత్తాలు వ్యక్తిగత ప్రయోజనాలకు మిగుల్చుకోవచ్చు.
(11) ఉద్యమాలు అదుపు తప్పింది హింసాత్మకంగా మారితే అందుకు బాధ్యత ఇతరుల మీద లేదా పాలకుల మీద, రక్షక భటుల మీద నెట్టి తప్పించుకోవచ్చు.
ఉద్యమం అనే మాట 'యమ' అనే ధాతువుకు ఉత్‌ అనే ఉపసర్గ చేర్చటం వల్ల సిద్ధించింది. ఆంగ్లంలో మూవ్‌మెంట్‌ అనే పదం సమానార్థకంగా వాడుతున్నారు. యమ్‌ అంటే స్వాధీనంలో ఉంచుకొను అని అర్థం. కాని మానవ చరిత్రతో ఏ ఉద్యమమూ ఇంత వరకూ ఉద్యమ ప్రారంభకుల చేతిలో (సాత్వికంగా) ఉండలేరు. అతి త్వరగా స్వార్థపర శక్తులు, విచ్ఛిన్నకర శక్తులూ చొచ్చుకుపోతాయి. ఉద్యమం గాడి తప్పుతుంది. దారి తప్పుతుంది. ఫలితంగా ఉద్యమ సాధకుల తొలి ఆశయాలకు ఉద్యమం దూరంగా వెళ్లిపోతుంది.
- ప్రొఫెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌

సభ్యత్వం పట్టు పైరవీ చేపట్టు!


  • సభ్యత్వం దక్కితే పైరవీ కుదిరినట్టే! 
  • కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల్లోనూ తీవ్రమైన పోటీ 
  • 2జి స్పెక్ట్రమ్‌ జెపిసి విధివిధానాలతో జెఎల్‌సి సభ్యత్వానికి పెరిగిన గ్లామర్‌ 
  • నిజాయితీ, నిబద్ధత కలిగిన సభ్యులను ప్రధాన పార్టీలు ఎంపిక చేస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం
హైదరాబాద్‌: వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబుల భూ పందారాలపై నియమించే జాయింట్‌ లెజిస్లేచర్‌ కమిటీ సభ్యత్వాల ఎంపిక ప్రధాన పార్టీల నేతలకు కత్తిమీదసాములా మారింది. రాష్ట్రంలో కార్పొరేషన్‌ చైర్మన్‌లు, ఇతర శాసనసభా కమిటీల సభ్యత్వాలు, చైర్మన్‌గిరిలు, ఆఖరికి మంత్రి పదవులకంటే జెఎల్‌సి సభ్యత్వాలకే గ్లామర్‌ ఏర్పడింది. ఇందులో సభ్యత్వం పొందితే చాలు... రానున్న మూడేళ్ళూ రాష్ట్రంలో నయా ధనవంతులు, కార్పొరేట్‌ సంస్థల యజమానులు, ప్రైవేటు పోర్టులు, సెజ్‌లు, సంపన్న కంపెనీల చైర్మన్లను కూడా తమ ముందుకు పిలిపించుకుని నిలదీసి కడిగేసే అవకాశం లభిస్తుంది. ఈ హోదాను అడ్డుపెట్టుకుంటే భూ కుంభకోణాల్లో ఇరుక్కున్న సీనియర్‌ ఐఎఎస్‌ల నుంచి సాధారణ అధికారులు, వాణిజ్య, పారిశ్రామికవేత్తల్ని బెదిరించి, అదిలించి తమ పనులు చేసుకునే వీలుదక్కుతుంది. ఆర్థికంగా, సామాజికంగా లాభపడే అవకాశాలుంటాయి. తమ అవసరాలన్నీ తీర్చేసుకోవచ్చన్న ధోరణి వివిధ పార్టీల ఎమ్మెల్యేల్లో వ్యక్తమౌతోంది. దీంతో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల్లోనూ ఈ సభ్యత్వాల కోసం ఊహించని స్థాయిలో డిమాండ్‌ వెల్లువెత్తుతోంది.
కిరణ్‌కుమార్‌, డిఎస్‌, చంద్రబాబు, చిరంజీవి, కెసిఆర్‌ల నుంచి బిజెపి, వామపక్షనేతలకు కూడా ఈ డిమాండ్‌ తలబొప్పి కట్టిస్తోంది. వైఎస్‌, చంద్రబాబులు విచ్చలవిడిగా భూ పందారాలు చేశారని, ప్రజాధనాన్ని దోపిడీ చేశారని, ప్రభుత్వాస్తుల్ని అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టేశారని, వారంతా ప్రపంచ కుబేరులుగా మారేందుకు దోహదపడ్డారంటూ శాసనసభలో పదిరోజుల పాటు అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఇదే అంశంపై అన్ని పక్షాలు అసెంబ్లీలో ఆందోళనకు దిగాయి. సమావేశాల నిర్వహణకు అడ్డంపడ్డాయి. ప్రభుత్వంపై పోరాటం చేశాయి. ఆఖరికి ప్రభుత్వం మెడలు వంచి శాసనసభా కమిటీ నియమానికి ఒప్పించాయి. కమిటీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన బాధ్యతను డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చేపట్టారు. ఈ కమిటీలో సభ్యుల ఎంపిక అధికారాలు డిప్యూటీ స్పీకర్‌ లేదా ముఖ్యమంత్రికి లేవు. అసెంబ్లీ, కౌన్సిల్‌లలోని పార్టీలు తమ సంఖ్యా బలానికనుగుణంగా నిర్దేశించినంతమంది పేర్లను డిప్యూటీ స్పీకర్‌కు సూచించాలి. సభలో పెద్దపక్షం కావడంతో కాంగ్రెస్‌కు కమిటీ చైర్మన్‌ గిరి లభిస్తుంది. ఈ కమిటీలో కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం, పిఆర్‌పి, ఎమ్‌ఐఎమ్‌, టిఆర్‌ఎస్‌, బిజెపి, వామపక్ష పార్టీలకు చెందిన సభ్యులుంటారు. ఇప్పుడు ఈ సభ్యత్వాల కోసం అన్ని పార్టీల్లోనూ పోటీ మొదలైంది. ఈ సభ్యత్వాల్ని దక్కించుకుంటే రానున్న మూడేళ్ళు అనూహ్యరీతిలో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని, తాము కలలో కూడా ఊహించని స్థాయిలో అతిపెద్ద కార్పొరేట్‌ యాజమాన్యాలపై పెత్తనం చేయవచ్చన్న ఆకాంక్ష పలువురు సభ్యుల్లో వ్యక్తమౌతోంది. తెలుగుదేశంలో రేవంత్‌రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, ముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చింతమనేని ప్రభాకర్‌, ఇలా డజనుమందికి పైగానే సభ్యుత్వాల కోసం బాబుపై ఒత్తిడి మొదలుపెట్టారు.
పిఆర్‌పిలో కూడా సి రామచంద్రయ్య, కన్నబాబు, బండారు సత్యానందరావు, గంటా శ్రీనివాసరావు తదితరులు పోటీపడుతున్నారు. టిఆర్‌ఎస్‌ నుంచి హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, కెటిఆర్‌లు సభ్యత్వాల్ని ఆశిస్తున్నారు. కాగా కాంగ్రెస్‌లో అయితే ఈ సంఖ్య రెండు డజన్లకు పైగానే ఉంది. వైఎస్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలు కూడా ఈ సభ్యత్వాల కోసం పోటీలు పడుతున్నాయి. ఈ సభ్యత్వాలకింత డిమాండ్‌, గ్లామర్‌ ఏర్పడ్డానికి 2జి స్పెక్ట్రమ్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ విధానాలే కారణం.
కేంద్రానికి సుమారు 1.76 లక్షల కోట్ల నష్టాన్ని తెచ్చిన 2 జిస్పెక్ట్రమ్‌ కుంభకోణంపై జెపిసి కోసం ఎన్‌డిఎ మూడు మాసాలు దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించింది. ముప్ఫై రోజులు పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేగాయి. ఈ కుంభకోణంతో సంబంధమున్న రాజకీయ ప్రముఖులు, కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా ఈ పరిణామంతో ఆందోళనకు గురయ్యాయి. దీనిపై జెపిసి వేసి నిగ్గు తేలిస్తేనే జాతి సంతృప్తి చెందుతుందంటూ విపక్షాలు చేసిన డిమాండ్‌కు యుపిఎ ప్రభుత్వం దిగివచ్చింది. సీనియర్‌ పార్లమెంటేరియన్‌ పిసి చాకో అధ్యక్షతన కమిటీని నియమించింది. దీంతో ఈ సభ్యులంతా
అత్యంత ఉత్సాహంతో కుంభకోణంతో సంబంధమున్న అధికారులు, రాజకీయ ప్రముఖుల్తో పాటు కార్పొరేట్‌ దిగ్గజాలపై కూడా దృష్టిపెట్టారు. రతన్‌టాటానుకూడా తమముందుకొచ్చి సంజాయిషీ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేశారు. వీరు ఓ సాధారణ ఎమ్‌పిల హోదాలో ఈ కార్పొరేట్‌ అధిపతుల అపాయింట్‌మెంట్‌ సంపాదించడం కూడా దుర్లభం. కార్పొరేట్‌ యాజమాన్యాలేవీ ఎమ్‌పి స్థాయిలోని వ్యక్తుల్ని ఖాతరు చేయరు. కానీ జెపిసి సభ్యులు అతిపెద్ద కార్పొరేట్‌ వ్యవస్థల్ని, ప్రధానిని, ఆఖరికి సిబిఐను కూడా పిలిపించుకుని, మీడియా సమక్షంలో నిలదీసి ముద్దాయిలుగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎమ్‌పిలు, వివిధ పార్లమెంటరీ కమిటీల చైర్మన్‌లు, ఆఖరికి కేంద్రమంత్రి హోదాల కంటే కూడా ఈ జెపిసి సభ్యుల హోదా, ఆధిపత్యాలే దేశ ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. 2జి స్పెక్ట్రమ్‌ జెపిసికి దేశంలో మరెవరికీ లేని గ్లామర్‌ ఏర్పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకునే భూపందారాలపై నియమించనున్న జెఎల్‌సిలో సభ్యత్వాలకు ఇంత పోటీ జరుగుతోందన్నది విశ్లేషకుల అంచనా. రాష్ట్ర శ్రేయస్సు పట్ల బాధ్యత కలిగిన ప్రధాన పార్టీల నేతలంతా తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో నిజాయితీ, నిబద్ధతలున్న వారినే జెఎల్‌సిలో సభ్యత్వాలకు సిఫార్సు చేస్తే ప్రజలు, రాజకీయ పక్షాలు ఆశించినట్లుగా భూ పందారాల్లో నిజం నిగ్గు తేలుతుంది. రాష్ట్రానికి కొంతమేరకైనా ప్రయోజనం కలుగుతుంది.

కార్యకర్తను కొట్టి... మీడియాకెక్కిన అధినేత

చెన్నై: ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. గురువారం ఎన్నికల ప్రచార ర్యాలీ పాల్గొన్న ఆయన వందలాది మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఓ కార్యకర్తను విరక్కొట్టుడు కొట్టి మీడియాకు చిక్కారు. ఈ విషయం వివాదంగా మారడంతో కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. ఆ దృశ్యాలను చిక్రీకరించిన కలైంజ్ఞర్‌ టీవీ ఛానెన్‌ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన విజయకాంత్‌ తనపై దుష్ప్రచారం చేసేందుకు దృశ్యాలను మార్ఫింగ్‌ చేసిందని ఆరోపించారు. అంతే కాదు .. సన్‌ టీవీ, కలైంజ్ఞర్‌ టీవీ ఛానెళ్ల యాజమాన్యానికి ఆయన నోటీసులు పంపించారు. 

పాక్‌ ఓటమి 'సామూహిక వధ' లాంటిది....

ఇస్లామాబాద్‌: ఇండియా చేతిలో పాకి స్థాన్‌ ఘోర పరాజయం చెందడాన్ని ఆ దేశ పత్రికలు సహించలేకపోయాయి. ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌లో పాక్‌ ఓటమి 'సామూహిక వధ'అని పతాక శీర్షికలతో ఉర్దూ, ఇంగ్లీష్‌ పత్రికలు విరుచుకుపడ్డాయి. అత్యంత పేలవమైన ఆటను, ఫీల్డింగ్‌ను ప్రదర్శించారని దినపత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. క్రీడాకారులు తమ ప్రతిభను సరైన రీతిలో కనబరచలేదని విమర్శించాయి. క్యాచ్‌లను వదిలివేయడం, పేలవమైన షాట్లు, మిస్బా చేసిన ఇన్నింగ్స్‌ను పాక్‌ ఓటమికి కారణాలుగా డాన్‌, తదితర పత్రికలు పేర్కొన్నాయి.

ఈ వేసవి చాలా హాట్‌ గురూ!

వేసవిలో స్టార్‌వార్‌
వేసవి వేడిలో ప్రేక్షకులను సందడి చేయడానికి నాలుగు భారీ చిత్రాలు రాబోతున్నాయి. క్రికెట్‌ హంగామా ముగింపు దశకు రావడంతో భారీ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. అగ్రహీరోలు పవన్‌కల్యాణ్‌, జూ.ఎన్టీఆర్‌, ప్రభాస్‌ నటించిన 'తీన్‌మార్‌', 'శక్తి', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌', రానా, ఇలియానా నటించిన 'నేను నా రాక్షసి' వేసవిలో రానున్నాయి. వేసవిలో స్టార్‌ వార్‌ జరగనుంది. వాణిజ్యపరంగా కూడా వీటిపై భారీ అంచనాలున్నాయి. ఈ నాలుగు చిత్రాలకు కలిపి సుమారు 160 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. దాదాపు 1300 థియేటర్లను ఈ చిత్రాల ప్రదర్శనకు ముస్తాబవుతున్నాయి. జూ.ఎన్టీఆర్‌ కెరిర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన 'శక్తి' ఏప్రిల్‌ 1న వస్తోంది. సీనియర్‌ నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. మెహర్‌రమేష్‌ దర్శకుడు. కొద్ది విరామం తర్వాత పవన్‌కల్యాణ్‌ నటించిన 'తీన్‌మార్‌' వస్తోంది. అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. దీనికి నటుడు గణష్‌ నిర్మాత. జయంత్‌ దర్శకుడు. ప్రభాస్‌ నటించిన 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' కూడా వేసవిలో వస్తుంది. దీనికి దిల్‌ రాజు నిర్మాతకాగా, దశరథ్‌ దర్శకత్వం వహించారు. వీటికి తోడు పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన 'నేను నా రాక్షసి' కూడా విడుదలకు ముస్తా బవుతోంది.

మంత్రి పదవికి వివేకా రాజీనామా, తిరస్కరించిన సిఎం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: వ్యవసాయ శాఖ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డిని బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో కలిసి రాజీనామా లేఖను అందచేశారు. వివేకానంద రెడ్డి రాజీనామాను ఆమోదించడం లేదని ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు. ఎమ్మెల్సీ పదవికాలం ముగియడంతో వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. అంతకు ముందు మీడియా ప్రతినిధులతో వివేకానందరెడ్డి మాట్లాడారు. ఎన్నికలకు వెళ్లేవారికి పదవి అవసరం లేదని స్పష్టం చేశారు. తన రాజీనామా ఆమోదించారా లేదా అనేది ముఖ్యమంత్రిని అడగండని సూచించారు. ముఖ్యమంత్రికి రాజీనామా చేసిన తర్వాత నగరంలోని తన కార్యాలయంలో వివేకానందరెడ్డి కడప జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. త్వరలోనే ఎన్నికలకు వెళ్లవలసి ఉందని చెప్పారు. కడప స్ధానిక సంస్థల నియోజకవర్గం నుండి వివేకానందరెడ్డి శాసన మండలికి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం ఈనెల 29తో ముగిసింది. మండలిలో ప్రాతినిథ్యం లేకుండా మంత్రివర్గంలో కొనసాగడం ఇష్టం లేకనే వివేకానందరెడ్డి రాజీనామా చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే కేంద్ర ఎన్నికల సంఘం కడప పార్లమెంటు, పులివెందుల శాసన సభ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించడం గమనార్హం.

గ్రేట్‌ విక్టరీ



  • విజేతలకు జేజేలు..
  • దేశాధినేతల అభినందనలు
  • మిన్నంటిన ఉత్సాహంతో దీపావళిని తపించిన ఆనందకేళి
మొహాలీ: ప్రపంచకప్‌లో ధోనీసేన ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన హోరాహోరీ సెమీఫైనల్లో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. శనివారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్‌-శ్రీలంకతో తలపడుతుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సచిన్‌ (85), సెహ్వాగ్‌ (38), రైనా (36 నాటౌట్‌) పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. మిస్బా ఉల్‌ హక్‌ (59) ఒంటరి పోరాటం చేసినా పాక్‌ను ఫైనల్‌కు చేర్చలేక పోయాడు. మిగతావారిలో మహ్మద్‌ హఫీజ్‌ (43), అసద్‌ షఫీక్‌ (30), ఉమర్‌ అక్మల్‌ (29), ఆఫ్రిది (19) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జహీర్‌, నెహ్రా, మునాఫ్‌, హర్భజన్‌, యువరాజ్‌ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో రాణించిన మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కాగా, భారత్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. 1983లో కప్‌ సాధించిన టీమిండియా 2003 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
మొహాలి: ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం ఇక్కడ హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో భారత్‌ 29 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి తుది సమరానికి చేరుకొంది. ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం భారత్‌కు ఇది మూడోసారి. శనివారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్‌-శ్రీలంకతో తలపడుతుంది. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. సచిన్‌ (85), సెహ్వాగ్‌ (38), రైనా(36 నాటౌట్‌) జట్టును ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది. మిస్బా ఉల్‌ హక్‌ (56) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఊరిస్తున్న లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన పాక్‌కు ఓపెనర్లు కమ్రాన్‌ అక్మల్‌, మహ్మద్‌ హఫిజ్‌ శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అయితే 19 పరుగులు చేసిన కమ్రాన్‌ను జహీర్‌ పెవిలియన్‌పంపాడు. మరోవైపు హఫిిజ్‌ 59 బంతుల్లో 7ఫోర్లతో 43 పరుగులు సాధించాడు. అసద్‌ షఫిక్‌ (30), ఉమర్‌ అక్మల్‌ (29) పరుగులు చేశారు. ఒంటరి పోరాటం చేసిన మిస్బా 75 బంతుల్లో 5ఫోర్లు, ఒక సిక్స్‌తో 56 పరుగులు చేసి జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జహీర్‌, మునాఫ్‌, నెహ్రా, యువీ, భజ్జీ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో రాణించిన మాస్టర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
సెహ్వాగ్‌ విధ్వంసం...
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌కు సచిన్‌-సెహ్వాగ్‌ కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. ఉమర్‌గుల్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో సెహ్వాగ్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ ఓవర్‌లో ఐదు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును పరిగెత్తించాడు. దీంతో భారత్‌కు ఏకంగా 21 పరుగులు దక్కాయి. తర్వాతి ఓవర్‌లోనూ టీమిండియాకు మరో 12 పరుగులు లభించాయి. ఐదో ఓవర్లో మరో 8 పరుగులు జట్టు ఖాతాలోకి వచ్చాయి. అయితే దూకుడుగా ఆడుతున్న సెహ్వాగ్‌ 25 బంతుల్లో 9ఫోర్లతో (38)ను వహాబ్‌ రియాజ్‌ పెవిలియన్‌ పంపాడు. వహాబ్‌ వేసిన అద్భుత బంతికి సెహ్వాగ్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 48 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది.
రాణించిన సచిన్‌...
తర్వాత ఇన్నింగ్స్‌ మరమ్మతు బాధ్యతను సచిన్‌ తనపై వేసుకున్నాడు. గంభీర్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్ల ఆధిపత్యాన్ని అడ్డుకున్నారు. ఇదే క్రమంలో పరుగుల వేగం తగ్గకుండా చూశారు. దీంతో భారత్‌ స్కోరు 15.2 ఓవర్లలో 100కు చేరుకొంది. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన మాస్టర్‌ సచిన్‌ 67 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అంతకుముందు అజ్మల్‌ వేసిన ఒక ఓవర్‌లో సచిన్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి రెండుసార్లు తృటిలో తప్పుకున్నాడు. అజ్మల్‌ బంతికి సచిన్‌ను అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీనిపై మాస్టర్‌ రివ్యూకు వెళ్లాడు. దీంతో నాటౌట్‌గా తేలాడు. తర్వాతి బంతికి స్టంప్‌ ఔట్‌ నుంచి కొద్దిలో తప్పించుకున్నాడు. తర్వాత కూడా రెండుసార్లు సచిన్‌ ఇచ్చిన క్యాచ్‌ను పాక్‌ ఫీల్డర్లు జారవిడిచారు. మరోవైపు కుదురుగా ఆడుతున్న గంభీర్‌ (27) హఫిజ్‌ పెవిలియన్‌ పంపాడు. దీంతో 68 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కోహ్లి ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. 9 పరుగులు వహాబ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాతి బంతికే యువరాజ్‌ (0) కూడా ఔటయ్యాడు. దీంతో భారత్‌ 141 పరుగుల వద్దే నాలుగో వికెట్‌ను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా సచిన్‌ పోరాటాన్ని కొనసాగించాడు. అయితే 115 బంతుల్లో 11 ఫోర్లతో 85 పరుగులు చేసిన సచిన్‌ను అజ్మల్‌ పెవిలియన్‌ పంపాడు. దీంతో సచిన్‌ వందో శతకాన్ని చూడాలని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. చివర్లో భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. ధోనీ (25), రైనా (36 నాటౌట్‌) మెరుగ్గా రాణించడంతో టీమిండియా 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లలో వహాబ్‌ ఐదు, అజ్మల్‌ రెండు వికెట్లు పడగొట్టారు.
స్కోరు బోర్డు
భారత్‌ ఇన్నింగ్స్‌: సెహ్వాగ్‌ ఎల్బీ- వహాబ్‌ రియాజ్‌ 38, సచిన్‌ (సి) అఫ్రిది (బి) అజ్మల్‌ 85, గౌతమ్‌ గంభీర్‌ (స్టంప్డ్‌) కమ్రాన్‌ అక్మల్‌ (బి) మహ్మద్‌ హఫీజ్‌ 27, విరాట్‌ కోహ్లి (సి) ఉమర్‌ అక్మల్‌ (బి) వహాబ్‌ రియాజ్‌ 9, యువరాజ్‌ సింగ్‌ (బి) వహాబ్‌ రియాజ్‌ 0, ధోనీ ఎల్బీ-వహాబ్‌ రియాజ్‌ 25, సురేశ్‌ రైనా (నాటౌట్‌) 36, హర్భజన్‌ సింగ్‌ (స్టంప్డ్‌) కమ్రాన్‌ అక్మల్‌ (బి) అజ్మల్‌ 12, జహీర్‌ ఖాన్‌ (సి) కమ్రాన్‌ అక్మల్‌ (బి) వహాబ్‌ రియాజ్‌ 9, ఆశిశ్‌ నెహ్రా (రనౌట్‌) 1, మునాఫ్‌ పటేల్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 18, మొత్తం 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు.
బౌలింగ్‌: ఉమర్‌ గుల్‌ 8-0-69-0, అబ్దుల్‌ రజాక్‌ 2-0-14-0, వహాబ్‌ రియాజ్‌ 10-0-46-5, సయీద్‌ అజ్మల్‌ 10-0-44-2, షాహిద్‌ అఫ్రిది 10-0-45-0, మహ్మద్‌ హఫీజ్‌ 10-0-34-1.
పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: కమ్రాన్‌ అక్మల్‌ (సి) యువరాజ్‌ (బి) జహీర్‌ ఖాన్‌ 19, మహ్మద్‌ హఫీజ్‌ (సి) ధోనీ (బి) మునాఫ్‌ 43, అసద్‌ షఫిక్‌ (బి) యువరాజ్‌ 30, యూనిస్‌ ఖాన్‌ (సి) రైనా (బి) యువరాజ్‌ 13, మిస్బా (సి) కోహ్లి (బి) జహీర్‌ 56, ఉమర్‌ అక్మల్‌ (బి) హర్భజన్‌ 29, అబ్దుల్‌ రజాక్‌ (బి) మునాఫ్‌ 3, షాహిద్‌ అఫ్రిది (సి) సెహ్వాగ్‌ (బి) హర్భజన్‌ 19, వహబ్‌ రియాజ్‌ (సి) సచిన్‌ (బి) నెహ్రా 8, ఉమర్‌ గుల్‌ ఎల్బీ-నెహ్రా 2, అజ్మల్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం 49.5 ఓవర్లలో 231పరుగులకు ఆలౌట్‌.
బౌలింగ్‌: జహీర్‌ ఖాన్‌ 9.5-0-58-2, ఆశిశ్‌ నెహ్రా 10-0-33-2, మునాఫ్‌ పటేల్‌ 10-1-40-2, హర్భజన్‌ సింగ్‌ 10-0-43-2, యువరాజ్‌ సింగ్‌ 10-1-57-2.
అభినందనల వెల్లువ
ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియాపై అభినందనల వర్షం కురుస్తోంది. రాష్ట్రప్రతి ప్రతిభాపాటిల్‌, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ తదితరులు భారత క్రికెట్‌ జట్టును అభినందించారు. సెమీస్‌లో పాకిస్తాన్‌ చిరస్మరణీయ విజయం సాధించిన ధోనీ సేన ఫైనల్లోనూ విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ్‌, పిఆర్‌పి అధ్యక్షుడు చిరంజీవి తదితరులు కూడా టీమిండియాను అభినందించారు.

Wednesday, March 30, 2011

ఫైనల్ లో శ్రీలంకతో తలపడనున్న భారత్ , మాన్ ఆఫ్ ది మ్యాచ్ సచిన్ టెండూల్కర్

భారత్ పాకిస్తాన్ ల మధ్య మొహాలిలో ఉత్కంట భరితంగా సాగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు నిర్ణయం కొంచెం క్లిష్టతరం ఐనప్పటికీ అధ్బుతమైన బాటింగ్ తో  85 రన్స్ చేసిన సచిన్ టెండూల్కర్ ఈ అవార్డు ని సొంతం చేసుకున్నారు . ఇప్పుడు మన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎక్కడ పుట్టి పేరిగాడో? ఎక్కడనుంచి తన కెరియర్ స్టార్ట్ చేసి ప్రపంచం లోనే గొప్ప క్రికెటర్ గా చరిత్ర పుటల్లో కేక్కాడో అదే ముంబై లో శ్రీలంక తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో తన 100 వ సెంచరి తో భారత్   కి వరల్డ్ కప్ ని అందిచ గలడని ఆశిద్దాం .


దాయాదుల పోరులో భారత్ విజయకేతనం


భారత్ , పాకిస్తాన్ మధ్య  ఉత్కంటభారితంగా జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో భారత్ 29 పరుగుల తేడాతో పాకిస్తాన్ మీద విజయం సాధించి ఫైనల్ లో ప్రవేశించింది. 


మొహాలీ రణక్షేత్రంలో నేడే దాయాదుల భీకర పోరు


  • సెమీస్‌ సమరానికి సర్వం సిద్ధం 
  • ప్రపంచకప్‌లో పాక్‌పై‌ భారత్‌ది అజేయ రికార్డు... తుత్తునీయులు చేసేందుకు పట్టుదలతో పాక్‌
  • ఇరు జట్లలోనూ ఒంటి చేత్తో ఫలితాన్ని తారుమారు చేయగల హేమాహేమీలు
  • బౌలింగ్‌లో పటిష్టంగా పాకిస్తాన్‌
  • బ్యాటింగ్‌లో అజేయంగా భారత్‌ 
  • బాల్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆఫ్రిది 
  • బ్యాట్‌తో చెలరేగిపోతున్న యువరాజ్‌ సెహ్వాగ్‌, మాస్టర్‌, జహీర్‌లు రాణిస్తే విజయం మనదే 
  • దేశాధినేతల సమక్షంలో ప్రతిష్టాత్మకంగా మారిన మ్యాచ్‌
మొహాలీ: చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ జట్ల ప్రపంచకప్‌ సెమీస్‌ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచులు ఒక ఎత్తయితే బుధవారం దాయాదుల మధ్య జరిగే పోరు మరో ఎత్తు.
సెహ్వాగ్‌ జోరు సాగాలి...: తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగే డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ మ్యాచ్‌లో భారత్‌కు కీలకంగా మారాడు. ఆస్ట్రేలియాపై తక్కువ స్కోరుకే ఔటైన సెహ్వాగ్‌ ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరముంది. వీరూ తనదైన శైలిలో చెలరేగితే భారీ స్కోరు సాధించే మార్గం సుగమం అవుతుంది. పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతున్న సెహ్వాగ్‌ కనీసం 40 ఓవర్ల వరకు క్రీజులో నిలబడితే జట్టుకు భారీ స్కోరు ఖాయం.
అందరి కళ్లు మాస్టర్‌పైనే...: ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌పై నిలిచాయి. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై మెరుగైన రికార్డును కలిగిన మాస్టర్‌ ఈసారి కూడా చెలరేగాలనే లక్ష్యంతో ఉన్నాడు. అంతేగాక ఇప్పటికే టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 99 శతకాలు సాధించిన సచిన్‌ పాక్‌పై వందో సెంచరీని పూర్తి చేయాలని శతకోటి అభిమానులు కోరుకుంటున్నారు. మొహాలిలోనే సచిన్‌ ఈ ఫీట్‌ను సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చితే అభిమానులకు ఇంతకంటే కావల్సిందెెమీ ఉండదు.
యువీనే కీలకం..: ప్రపంచకప్‌లో అటు బంతితో ఇటు బ్యాట్‌తో నిలకడగా రాణించి జట్టును సెమీస్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌ ఈ మ్యాచ్‌లోనూ కీలకంగా మారాడు. యువీ మరోసారి చెలరేగితే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. ఇప్పటికే నాలుగు మ్యాచుల్లో మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచులు సాధించి జట్టును ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చిన యువీపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ భారాన్ని సమర్థంగా మోస్తున్న యువీ కీలక సమయాల్లో బంతితోనూ సత్తా చాటుతున్నాడు. మరోవైపు గంభీర్‌, కోహ్లిలు కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ వీరి పాత్ర కీలకంగా మారింది. ధోనీ, రైనాలు కూడా మెరుగ్గా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. హర్భజన్‌, అశ్విన్‌, జహీర్‌లు కూడా బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నారు. మరోవైపు బౌలింగ్‌ భారం ఈసారి కూడా జహీర్‌, యువీలపైనే ఉంది. హర్భజన్‌ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. మునాఫ్‌, నెహ్రాలు కూడా తమ స్థాయికి తగ్గ బౌలింగ్‌ను ప్రదర్శించలేక పోతున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా మెరుగ్గా రాణించాల్సిన బాధ్యత ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో యూసుఫ్‌ను ఆడిస్తారా లేక అశ్విన్‌ను కొనసాగిస్తారా అనేది ఇంకా తేలలేదు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక, మునాఫ్‌ స్థానంలో నెహ్రా జట్టులోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పాక్‌పై మెరుగైన రికార్డును కలిగిన నెహ్రాకేతుదిజట్టులో చాన్స్‌ దక్కే అవకాశం కనిపిస్తోంది.
ప్రతీకారం కోసం...: మరోవైపు పాకిస్తాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి గతంలో ఎదురైన ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. లీగ్‌ దశలో మెరుగ్గా రాణించిన పాక్‌ క్వార్టర్స్‌లోనూ అదరగొట్టింది. అయితే ఓపెనర్ల వైఫల్యం జట్టుకు సమస్యగా మారింది. షెజాద్‌, మహ్మద్‌ హఫీజ్‌లు ఒక్క మ్యాచ్‌లోనూ మెరుగ్గా రాణించలేక పోయారు. అయితే వెస్టిండీస్‌పై మాత్రం కమ్రాన్‌ అక్మల్‌-హఫీజ్‌ తొలి వికెట్‌కు అజేయంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం కాస్త ఊరట కలిగించే అంశం. లీగ్‌ దశలో పటిష్టమైన శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లను ఓడించిన ఆత్మవిశ్వాసంతో పాక్‌ ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. కాని సీనియర్‌ ఆటగాళ్లు మిస్బా, యూనిస్‌ ఖాన్‌ బ్యాటింగ్‌లో అంతంత మాత్రంగానే రాణించడం జట్టును కలవర పెడుతోంది.
అంతేగాక, కెప్టెన్‌ అఫ్రిది కూడా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం చవిచూశాడు. ఇది కూడా జట్టుకు ప్రతికూలంగా మారే అంశం. అయితే అసద్‌ షఫిక్‌, కమ్రాన్‌, రజాక్‌, ఉమర్‌ అక్మల్‌లు ఫాంలో ఉండడం జట్టుకు ఊరటకలిగించే అంశం. మరోవైపు బౌలింగ్‌లో అఫ్రిది ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే 21 వికెట్లతో టోర్నీలో అగ్రస్థానంలో నిలిచాడు. ఉమర్‌గుల్‌ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. అజ్మల్‌, అక్తర్‌, రజాక్‌లతో బౌలింగ్‌ పటిష్టంగా మారింది. దీంతో భారత బ్యాట్స్‌మెన్లకు, పాక్‌ బౌలర్లకు హోరాహోరీ పోరాటం ఖాయంగా కనిపిస్తోంది.
భారత్‌దే పైచేయి..: ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు నాలుగు మ్యాచులు జరిగాయి. నాలుగు మ్యాచుల్లోనూ భారతే విజయం సాధించింది. రెండు జట్లు ప్రపంచకప్‌లో తొలిసారిగా 1992లో తలపడ్డాయి. దీనిలో భారత్‌ 43 పరుగుల తేడాతో గెలిచింది. రెండోసారి 1996లో రెండు జట్లు ఢీకొన్నాయి. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. 1999 ప్రపంచకప్‌లో భారత్‌ ముచ్చటగా మూడో విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 2003 వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల మధ్య పోరు జరిగింది. ఈసారి కూడా భారత్‌కే విజయం వరించింది.
జట్ల వివరాలు: భారత్‌(అంచనా): ధోనీ (కెప్టెన్‌), సెహ్వాగ్‌, సచిన్‌, గంభీర్‌, యువరాజ్‌, కోహ్లి, రైనా, యూసుఫ్‌/అశ్విన్‌, జహీర్‌, హర్భజన్‌, మునాఫ్‌/నెహ్రా.
పాకిస్తాన్‌(అంచనా): అఫ్రిది (కెప్టెన్‌), కమ్రాన్‌ అక్మల్‌, ఉమర్‌ అక్మల్‌, రజాక్‌, యూనిస్‌ ఖాన్‌, మిస్బా, మహ్మద్‌ హఫీజ్‌, అసద్‌ షఫిక్‌, షోయబ్‌ అక్తర్‌, వహాబ్‌ రియాజ్‌, సయిద్‌ అజ్మల్‌, ఉమర్‌గుల్‌.