Wednesday, March 30, 2011

మొహాలీ రణక్షేత్రంలో నేడే దాయాదుల భీకర పోరు


  • సెమీస్‌ సమరానికి సర్వం సిద్ధం 
  • ప్రపంచకప్‌లో పాక్‌పై‌ భారత్‌ది అజేయ రికార్డు... తుత్తునీయులు చేసేందుకు పట్టుదలతో పాక్‌
  • ఇరు జట్లలోనూ ఒంటి చేత్తో ఫలితాన్ని తారుమారు చేయగల హేమాహేమీలు
  • బౌలింగ్‌లో పటిష్టంగా పాకిస్తాన్‌
  • బ్యాటింగ్‌లో అజేయంగా భారత్‌ 
  • బాల్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆఫ్రిది 
  • బ్యాట్‌తో చెలరేగిపోతున్న యువరాజ్‌ సెహ్వాగ్‌, మాస్టర్‌, జహీర్‌లు రాణిస్తే విజయం మనదే 
  • దేశాధినేతల సమక్షంలో ప్రతిష్టాత్మకంగా మారిన మ్యాచ్‌
మొహాలీ: చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ జట్ల ప్రపంచకప్‌ సెమీస్‌ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచులు ఒక ఎత్తయితే బుధవారం దాయాదుల మధ్య జరిగే పోరు మరో ఎత్తు.
సెహ్వాగ్‌ జోరు సాగాలి...: తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగే డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ మ్యాచ్‌లో భారత్‌కు కీలకంగా మారాడు. ఆస్ట్రేలియాపై తక్కువ స్కోరుకే ఔటైన సెహ్వాగ్‌ ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరముంది. వీరూ తనదైన శైలిలో చెలరేగితే భారీ స్కోరు సాధించే మార్గం సుగమం అవుతుంది. పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతున్న సెహ్వాగ్‌ కనీసం 40 ఓవర్ల వరకు క్రీజులో నిలబడితే జట్టుకు భారీ స్కోరు ఖాయం.
అందరి కళ్లు మాస్టర్‌పైనే...: ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌పై నిలిచాయి. వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై మెరుగైన రికార్డును కలిగిన మాస్టర్‌ ఈసారి కూడా చెలరేగాలనే లక్ష్యంతో ఉన్నాడు. అంతేగాక ఇప్పటికే టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 99 శతకాలు సాధించిన సచిన్‌ పాక్‌పై వందో సెంచరీని పూర్తి చేయాలని శతకోటి అభిమానులు కోరుకుంటున్నారు. మొహాలిలోనే సచిన్‌ ఈ ఫీట్‌ను సాధించి జట్టును ఫైనల్‌కు చేర్చితే అభిమానులకు ఇంతకంటే కావల్సిందెెమీ ఉండదు.
యువీనే కీలకం..: ప్రపంచకప్‌లో అటు బంతితో ఇటు బ్యాట్‌తో నిలకడగా రాణించి జట్టును సెమీస్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌ ఈ మ్యాచ్‌లోనూ కీలకంగా మారాడు. యువీ మరోసారి చెలరేగితే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. ఇప్పటికే నాలుగు మ్యాచుల్లో మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచులు సాధించి జట్టును ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చిన యువీపైనే జట్టు ఆశలు పెట్టుకుంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ భారాన్ని సమర్థంగా మోస్తున్న యువీ కీలక సమయాల్లో బంతితోనూ సత్తా చాటుతున్నాడు. మరోవైపు గంభీర్‌, కోహ్లిలు కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ వీరి పాత్ర కీలకంగా మారింది. ధోనీ, రైనాలు కూడా మెరుగ్గా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. హర్భజన్‌, అశ్విన్‌, జహీర్‌లు కూడా బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నారు. మరోవైపు బౌలింగ్‌ భారం ఈసారి కూడా జహీర్‌, యువీలపైనే ఉంది. హర్భజన్‌ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. మునాఫ్‌, నెహ్రాలు కూడా తమ స్థాయికి తగ్గ బౌలింగ్‌ను ప్రదర్శించలేక పోతున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా మెరుగ్గా రాణించాల్సిన బాధ్యత ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో యూసుఫ్‌ను ఆడిస్తారా లేక అశ్విన్‌ను కొనసాగిస్తారా అనేది ఇంకా తేలలేదు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక, మునాఫ్‌ స్థానంలో నెహ్రా జట్టులోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పాక్‌పై మెరుగైన రికార్డును కలిగిన నెహ్రాకేతుదిజట్టులో చాన్స్‌ దక్కే అవకాశం కనిపిస్తోంది.
ప్రతీకారం కోసం...: మరోవైపు పాకిస్తాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి గతంలో ఎదురైన ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. లీగ్‌ దశలో మెరుగ్గా రాణించిన పాక్‌ క్వార్టర్స్‌లోనూ అదరగొట్టింది. అయితే ఓపెనర్ల వైఫల్యం జట్టుకు సమస్యగా మారింది. షెజాద్‌, మహ్మద్‌ హఫీజ్‌లు ఒక్క మ్యాచ్‌లోనూ మెరుగ్గా రాణించలేక పోయారు. అయితే వెస్టిండీస్‌పై మాత్రం కమ్రాన్‌ అక్మల్‌-హఫీజ్‌ తొలి వికెట్‌కు అజేయంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం కాస్త ఊరట కలిగించే అంశం. లీగ్‌ దశలో పటిష్టమైన శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లను ఓడించిన ఆత్మవిశ్వాసంతో పాక్‌ ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. కాని సీనియర్‌ ఆటగాళ్లు మిస్బా, యూనిస్‌ ఖాన్‌ బ్యాటింగ్‌లో అంతంత మాత్రంగానే రాణించడం జట్టును కలవర పెడుతోంది.
అంతేగాక, కెప్టెన్‌ అఫ్రిది కూడా బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం చవిచూశాడు. ఇది కూడా జట్టుకు ప్రతికూలంగా మారే అంశం. అయితే అసద్‌ షఫిక్‌, కమ్రాన్‌, రజాక్‌, ఉమర్‌ అక్మల్‌లు ఫాంలో ఉండడం జట్టుకు ఊరటకలిగించే అంశం. మరోవైపు బౌలింగ్‌లో అఫ్రిది ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇప్పటికే 21 వికెట్లతో టోర్నీలో అగ్రస్థానంలో నిలిచాడు. ఉమర్‌గుల్‌ కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. అజ్మల్‌, అక్తర్‌, రజాక్‌లతో బౌలింగ్‌ పటిష్టంగా మారింది. దీంతో భారత బ్యాట్స్‌మెన్లకు, పాక్‌ బౌలర్లకు హోరాహోరీ పోరాటం ఖాయంగా కనిపిస్తోంది.
భారత్‌దే పైచేయి..: ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు నాలుగు మ్యాచులు జరిగాయి. నాలుగు మ్యాచుల్లోనూ భారతే విజయం సాధించింది. రెండు జట్లు ప్రపంచకప్‌లో తొలిసారిగా 1992లో తలపడ్డాయి. దీనిలో భారత్‌ 43 పరుగుల తేడాతో గెలిచింది. రెండోసారి 1996లో రెండు జట్లు ఢీకొన్నాయి. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. 1999 ప్రపంచకప్‌లో భారత్‌ ముచ్చటగా మూడో విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 2003 వరల్డ్‌కప్‌లో ఇరు జట్ల మధ్య పోరు జరిగింది. ఈసారి కూడా భారత్‌కే విజయం వరించింది.
జట్ల వివరాలు: భారత్‌(అంచనా): ధోనీ (కెప్టెన్‌), సెహ్వాగ్‌, సచిన్‌, గంభీర్‌, యువరాజ్‌, కోహ్లి, రైనా, యూసుఫ్‌/అశ్విన్‌, జహీర్‌, హర్భజన్‌, మునాఫ్‌/నెహ్రా.
పాకిస్తాన్‌(అంచనా): అఫ్రిది (కెప్టెన్‌), కమ్రాన్‌ అక్మల్‌, ఉమర్‌ అక్మల్‌, రజాక్‌, యూనిస్‌ ఖాన్‌, మిస్బా, మహ్మద్‌ హఫీజ్‌, అసద్‌ షఫిక్‌, షోయబ్‌ అక్తర్‌, వహాబ్‌ రియాజ్‌, సయిద్‌ అజ్మల్‌, ఉమర్‌గుల్‌.

1 comment: