- సభ్యత్వం దక్కితే పైరవీ కుదిరినట్టే!
- కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల్లోనూ తీవ్రమైన పోటీ
- 2జి స్పెక్ట్రమ్ జెపిసి విధివిధానాలతో జెఎల్‌సి సభ్యత్వానికి పెరిగిన గ్లామర్
- నిజాయితీ, నిబద్ధత కలిగిన సభ్యులను ప్రధాన పార్టీలు ఎంపిక చేస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం
హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబుల భూ పందారాలపై నియమించే జాయింట్ లెజిస్లేచర్ కమిటీ సభ్యత్వాల ఎంపిక ప్రధాన పార్టీల నేతలకు కత్తిమీదసాములా మారింది. రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్‌లు, ఇతర శాసనసభా కమిటీల సభ్యత్వాలు, చైర్మన్‌గిరిలు, ఆఖరికి మంత్రి పదవులకంటే జెఎల్‌సి సభ్యత్వాలకే గ్లామర్ ఏర్పడింది. ఇందులో సభ్యత్వం పొందితే చాలు... రానున్న మూడేళ్ళూ రాష్ట్రంలో నయా ధనవంతులు, కార్పొరేట్ సంస్థల యజమానులు, ప్రైవేటు పోర్టులు, సెజ్‌లు, సంపన్న కంపెనీల చైర్మన్లను కూడా తమ ముందుకు పిలిపించుకుని నిలదీసి కడిగేసే అవకాశం లభిస్తుంది. ఈ హోదాను అడ్డుపెట్టుకుంటే భూ కుంభకోణాల్లో ఇరుక్కున్న సీనియర్ ఐఎఎస్‌ల నుంచి సాధారణ అధికారులు, వాణిజ్య, పారిశ్రామికవేత్తల్ని బెదిరించి, అదిలించి తమ పనులు చేసుకునే వీలుదక్కుతుంది. ఆర్థికంగా, సామాజికంగా లాభపడే అవకాశాలుంటాయి. తమ అవసరాలన్నీ తీర్చేసుకోవచ్చన్న ధోరణి వివిధ పార్టీల ఎమ్మెల్యేల్లో వ్యక్తమౌతోంది. దీంతో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల్లోనూ ఈ సభ్యత్వాల కోసం ఊహించని స్థాయిలో డిమాండ్ వెల్లువెత్తుతోంది.
కిరణ్‌కుమార్, డిఎస్, చంద్రబాబు, చిరంజీవి, కెసిఆర్‌ల నుంచి బిజెపి, వామపక్షనేతలకు కూడా ఈ డిమాండ్ తలబొప్పి కట్టిస్తోంది. వైఎస్, చంద్రబాబులు విచ్చలవిడిగా భూ పందారాలు చేశారని, ప్రజాధనాన్ని దోపిడీ చేశారని, ప్రభుత్వాస్తుల్ని అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టేశారని, వారంతా ప్రపంచ కుబేరులుగా మారేందుకు దోహదపడ్డారంటూ శాసనసభలో పదిరోజుల పాటు అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఇదే అంశంపై అన్ని పక్షాలు అసెంబ్లీలో ఆందోళనకు దిగాయి. సమావేశాల నిర్వహణకు అడ్డంపడ్డాయి. ప్రభుత్వంపై పోరాటం చేశాయి. ఆఖరికి ప్రభుత్వం మెడలు వంచి శాసనసభా కమిటీ నియమానికి ఒప్పించాయి. కమిటీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన బాధ్యతను డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేపట్టారు. ఈ కమిటీలో సభ్యుల ఎంపిక అధికారాలు డిప్యూటీ స్పీకర్ లేదా ముఖ్యమంత్రికి లేవు. అసెంబ్లీ, కౌన్సిల్‌లలోని పార్టీలు తమ సంఖ్యా బలానికనుగుణంగా నిర్దేశించినంతమంది పేర్లను డిప్యూటీ స్పీకర్‌కు సూచించాలి. సభలో పెద్దపక్షం కావడంతో కాంగ్రెస్‌కు కమిటీ చైర్మన్ గిరి లభిస్తుంది. ఈ కమిటీలో కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం, పిఆర్‌పి, ఎమ్‌ఐఎమ్, టిఆర్‌ఎస్, బిజెపి, వామపక్ష పార్టీలకు చెందిన సభ్యులుంటారు. ఇప్పుడు ఈ సభ్యత్వాల కోసం అన్ని పార్టీల్లోనూ పోటీ మొదలైంది. ఈ సభ్యత్వాల్ని దక్కించుకుంటే రానున్న మూడేళ్ళు అనూహ్యరీతిలో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని, తాము కలలో కూడా ఊహించని స్థాయిలో అతిపెద్ద కార్పొరేట్ యాజమాన్యాలపై పెత్తనం చేయవచ్చన్న ఆకాంక్ష పలువురు సభ్యుల్లో వ్యక్తమౌతోంది. తెలుగుదేశంలో రేవంత్‌రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, ముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చింతమనేని ప్రభాకర్, ఇలా డజనుమందికి పైగానే సభ్యుత్వాల కోసం బాబుపై ఒత్తిడి మొదలుపెట్టారు.
పిఆర్‌పిలో కూడా సి రామచంద్రయ్య, కన్నబాబు, బండారు సత్యానందరావు, గంటా శ్రీనివాసరావు తదితరులు పోటీపడుతున్నారు. టిఆర్‌ఎస్ నుంచి హరీష్‌రావు, ఈటెల రాజేందర్, కెటిఆర్‌లు సభ్యత్వాల్ని ఆశిస్తున్నారు. కాగా కాంగ్రెస్‌లో అయితే ఈ సంఖ్య రెండు డజన్లకు పైగానే ఉంది. వైఎస్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కూడా ఈ సభ్యత్వాల కోసం పోటీలు పడుతున్నాయి. ఈ సభ్యత్వాలకింత డిమాండ్, గ్లామర్ ఏర్పడ్డానికి 2జి స్పెక్ట్రమ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విధానాలే కారణం.
కేంద్రానికి సుమారు 1.76 లక్షల కోట్ల నష్టాన్ని తెచ్చిన 2 జిస్పెక్ట్రమ్ కుంభకోణంపై జెపిసి కోసం ఎన్‌డిఎ మూడు మాసాలు దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించింది. ముప్ఫై రోజులు పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేగాయి. ఈ కుంభకోణంతో సంబంధమున్న రాజకీయ ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఈ పరిణామంతో ఆందోళనకు గురయ్యాయి. దీనిపై జెపిసి వేసి నిగ్గు తేలిస్తేనే జాతి సంతృప్తి చెందుతుందంటూ విపక్షాలు చేసిన డిమాండ్‌కు యుపిఎ ప్రభుత్వం దిగివచ్చింది. సీనియర్ పార్లమెంటేరియన్ పిసి చాకో అధ్యక్షతన కమిటీని నియమించింది. దీంతో ఈ సభ్యులంతా
అత్యంత ఉత్సాహంతో కుంభకోణంతో సంబంధమున్న అధికారులు, రాజకీయ ప్రముఖుల్తో పాటు కార్పొరేట్ దిగ్గజాలపై కూడా దృష్టిపెట్టారు. రతన్‌టాటానుకూడా తమముందుకొచ్చి సంజాయిషీ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేశారు. వీరు ఓ సాధారణ ఎమ్‌పిల హోదాలో ఈ కార్పొరేట్ అధిపతుల అపాయింట్‌మెంట్ సంపాదించడం కూడా దుర్లభం. కార్పొరేట్ యాజమాన్యాలేవీ ఎమ్‌పి స్థాయిలోని వ్యక్తుల్ని ఖాతరు చేయరు. కానీ జెపిసి సభ్యులు అతిపెద్ద కార్పొరేట్ వ్యవస్థల్ని, ప్రధానిని, ఆఖరికి సిబిఐను కూడా పిలిపించుకుని, మీడియా సమక్షంలో నిలదీసి ముద్దాయిలుగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎమ్‌పిలు, వివిధ పార్లమెంటరీ కమిటీల చైర్మన్‌లు, ఆఖరికి కేంద్రమంత్రి హోదాల కంటే కూడా ఈ జెపిసి సభ్యుల హోదా, ఆధిపత్యాలే దేశ ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. 2జి స్పెక్ట్రమ్ జెపిసికి దేశంలో మరెవరికీ లేని గ్లామర్ ఏర్పడింది. దీన్ని పరిగణనలోకి తీసుకునే భూపందారాలపై నియమించనున్న జెఎల్‌సిలో సభ్యత్వాలకు ఇంత పోటీ జరుగుతోందన్నది విశ్లేషకుల అంచనా. రాష్ట్ర శ్రేయస్సు పట్ల బాధ్యత కలిగిన ప్రధాన పార్టీల నేతలంతా తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో నిజాయితీ, నిబద్ధతలున్న వారినే జెఎల్‌సిలో సభ్యత్వాలకు సిఫార్సు చేస్తే ప్రజలు, రాజకీయ పక్షాలు ఆశించినట్లుగా భూ పందారాల్లో నిజం నిగ్గు తేలుతుంది. రాష్ట్రానికి కొంతమేరకైనా ప్రయోజనం కలుగుతుంది.

No comments:
Post a Comment