Thursday, March 31, 2011

మంత్రి పదవికి వివేకా రాజీనామా, తిరస్కరించిన సిఎం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: వ్యవసాయ శాఖ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డిని బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో కలిసి రాజీనామా లేఖను అందచేశారు. వివేకానంద రెడ్డి రాజీనామాను ఆమోదించడం లేదని ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు. ఎమ్మెల్సీ పదవికాలం ముగియడంతో వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. అంతకు ముందు మీడియా ప్రతినిధులతో వివేకానందరెడ్డి మాట్లాడారు. ఎన్నికలకు వెళ్లేవారికి పదవి అవసరం లేదని స్పష్టం చేశారు. తన రాజీనామా ఆమోదించారా లేదా అనేది ముఖ్యమంత్రిని అడగండని సూచించారు. ముఖ్యమంత్రికి రాజీనామా చేసిన తర్వాత నగరంలోని తన కార్యాలయంలో వివేకానందరెడ్డి కడప జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. త్వరలోనే ఎన్నికలకు వెళ్లవలసి ఉందని చెప్పారు. కడప స్ధానిక సంస్థల నియోజకవర్గం నుండి వివేకానందరెడ్డి శాసన మండలికి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం ఈనెల 29తో ముగిసింది. మండలిలో ప్రాతినిథ్యం లేకుండా మంత్రివర్గంలో కొనసాగడం ఇష్టం లేకనే వివేకానందరెడ్డి రాజీనామా చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వివేకానందరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే కేంద్ర ఎన్నికల సంఘం కడప పార్లమెంటు, పులివెందుల శాసన సభ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించడం గమనార్హం.

No comments:

Post a Comment