Thursday, March 31, 2011

అడుగు దూరంలో..


కోట్లాది మంది దేశ ప్రజల ఆశలను మోస్తూ ఫైనల్‌కు చేరిన టీమిండియా ప్రపంచకప్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్‌ ఆసియాకే చెందిన శ్రీలంకతో తలపడుతుంది. మొహాలీలో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై చిరస్మరణీయ విజయం సాధించిన భారత్‌ తుదిపోరుకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే సంచలన విజయాలకు పెట్టింది పేరైన లంకతో తుది సమరం టీమిండియాకు సవాలుగా మారింది. సమకాలిన ప్రపంచ క్రికెట్‌లో శ్రీలంక అత్యంత బలమైన జట్టుగా కొనసాగుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు లంకలో ఉన్నారు. దీనికి తోడు భారత జట్టులోని బలబలహీనతలు అన్ని లంకకు బాగా తెలుసు. ఈ పరిస్థితుల్లో తుది సమరంలో సంగక్కర సేనను ఓడించాలంటే ధోనీ సేన తన అస్త్రాలకు పదును పెట్టక తప్పదు. కిందటిసారి వెస్టిండీస్‌ గడ్డపై జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన లంక ఈసారి ఎలాగైన విశ్వవిజేతగా నిలువాలనే పట్టుదలతో ఉంది. దీంతో లంకను ఓడించేందుకు భారత్‌ పకడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో రెండు జట్లు కూడా చిరస్మరణీయ ఆటను కనబరిచాయి. ఇరు జట్లలోనూ ప్రతిబకు కొదవలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో బలబలాలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కచ్చితంగా ఫలానా జట్టు కప్పు గెలుస్తుందని చెప్పడం అత్యాశే అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సొంతగడ్డపై జరుగుతున్న ఫైనల్లో టీమిండియాకే మెరుగైన అవకాశాలున్నాయని వారు అభిప్రాయ పడుతున్నారు. అయితే స్పిన్‌, ఫాస్ట్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్లు లంకకు అందుబాటులో ఉన్నారు. ఓపెనర్లు తిలకరత్నే దిల్షాన్‌, ఉపుల్‌ తరంగలతోపాటు కెప్టెన్‌ సంగక్కర, మాజీ సారథి మహేల జయవర్ధనే, సమరవీర, కపుగెడెర, చమరసిల్వా వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్లు లంక సొంతం. దీనికితోడు మలింగ, మురళీధరన్‌, కులశేఖర, రంగన హెరాత్‌, అజంత మెండిస్‌ వంటి ప్రతిభావంతులతో కూడిన బలమైన బౌలింగ్‌ లైనప్‌ భారత్‌కు సవాలు విసిరేందుకు సిద్ధంగా ఉంది. దీంతో టీమిండియా ఏమాత్రం నిర్లక్ష్యంగా ఆడిన కప్‌ గెలిచేందుకు అందివచ్చిన సువర్ణ అవకాశం చేజారి పోవడం ఖాయం.
ఒత్తిడి లేకుండా...
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను ఓడించి ఫైనల్‌కు చేరిన టీమిండియాకే ప్రపంచకప్‌ గెలుచుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే దీని కోసం ఒత్తిడిని దరి చేరకుండా చూడాలి. 1996లో ముంబైలో శ్రీలంకతోనే జరిగిన వరల్డ్‌కప్‌ సెమీస్‌లో భారత్‌ ఒత్తిడికి తట్టుకోలేక ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కళ్లు చెదిరే శుభారంభం చేసిన భారత్‌ తర్వాత ఒత్తిడికి తట్టుకోలేక 120 పరుగులకే 8వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియా ఆ మ్యాచ్‌లో అవమానకర రీతిలో ఓటమి పాలుకాక తప్పలేదు. ఈసారి మాత్రం అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత జట్టుపై ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో భారత్‌ ఎంతో బలంగా ఉంది. ఓపెనర్లు సచిన్‌, సెహ్వాగ్‌ అద్భుత ఫాంలో ఉన్నారు. సెహ్వాగ్‌ ఫైనల్లో కనీసం 30 ఓవర్లల వరకైన క్రీజులో నిలదొక్కుకుంటే జట్టుకు భారీ స్కోరు ఖాయం. అదే విధంగా సచిన్‌ కూడా మరోసారి మాస్టర్‌ ఇన్నింగ్స్‌ ఆడాలి. పాక్‌పై కాస్త ఒత్తిడికి గురైన మాస్టర్‌ లంకపై మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న ఫైనల్లో వందో సెంచరీని సాధించి జట్టును విశ్వవిజేతగా నిలపాలని శతకోటి అభిమానులు కోరుకుంటున్నారు. వారి ఆశలను వమ్ము చేయకూడదనే పట్టుదలతో మాస్టర్‌ ఉన్నాడు.
ఇదే జరిగితే లంక బౌలర్లకు కష్టాలు తప్పవు. మరోవైపు కోహ్లి, గంభీర్‌, యువరాజ్‌, ధోనీ, రైనాలు కూడా బ్యాటింగ్‌లో చెలరేగాలి. వీరిలో కనీసం ఒక్కరైనా భారీ ఇన్నింగ్స్‌ ఆడితే జట్టు పటిష్టస్థితిలో నిలువడం ఖాయం. ఇక, బౌలింగ్‌లో జట్టు భారమంత జహీర్‌పైనే ఆధారపడి ఉంది. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్న జహీర్‌ ఫైనల్లోనూ చెలరేగితే జట్టు బౌలింగ్‌ కష్టాలు తీరుతాయి. నెహ్రా, మునాఫ్‌, హర్భజన్‌లు కూడా మెరుగ్గా రాణించక తప్పదు. ఇక, యువీ ఐదో బౌలర్‌ బాధ్యతను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఇటు బ్యాట్స్‌తో అటు బంతితో మెరుగ్గా రాణించిన యువీ ఫైనల్లోనూ అదే జోరును కనబరచాలనే పట్టుదలతో ఉన్నాడు. అంత అనుకున్నట్టుగా సాగితే టీమిండియా తన ఖాతాలో రెండో ప్రపంచకప్‌ ట్రోఫీని జమ చేసుకోవడం ఖాయం. 

No comments:

Post a Comment