Friday, April 22, 2011

ప్రకృతీ విలపిస్తోంది బాబా..క్షణమొక యుగంగా..


  • మరింత బలహీనమైన హృదయ స్పందన 
  • పూర్తిగా క్షీణించిన కిడ్నీల పనితీరు 
  • ట్రస్ట్‌ కీలక సమావేశం 
  • ప్రశాంతి నిలయం పరిసరాల్లో రెడ్‌ అలర్ట్‌ 
  • అశేషంగా తరలివస్తున్న భక్తజనం
శ్లోకంలో శోకం... వేదంలో ఖేదం
ఏమిటీ పరీక్ష... ఎవరికీ విషమ పరీక్ష?
బాబా భౌతిక దేహానికా, ఆధ్యాత్మిక మనుగడకా?
సర్వం సాయిమయమని విశ్వసించిన
భక్తజన కోటి మూగగా రోదిస్తోంది...
దీనికి ప్రకృతి కూడా అకాల వర్షాలతో జత కలుస్తోంది..
గంటగంటకూ విడుదలవుతున్న హెల్త్‌ బులెటిన్లు
భక్తుల గుండెల్లో పిడుగులు రాలుస్తున్నాయి
అటు ఆకాశంలో ఉరుములు, మెరుపులతో వడగళ్లు కురుస్తున్నాయి
ఇంతటి విషాదం మధ్య దైవత్వాన్నే ప్రశ్నిస్తూ
తీతువు పిట్టలు కూస్తున్నాయి-
నిషాదోన్మాద శక్తులు ధర్మసూక్ష్మాన్ని అవహేళన చేస్తున్నాయి!
ఆ దేహం నీది కాదని వారికెలా చెప్పేది?
ఈ సందేహం నుంచి భక్తులనెలా ఒప్పించేది??
పుట్టపర్తి, కెఎన్‌ఎన్‌ ప్రతినిధి: సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి 'అత్యంత విషమం'గానే ఉంది. గత 26 రోజులుగా వివిధ అవయవాల అస్వస్థతతో ఇక్కడి సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా మందులు, వైద్య పరికరాల సహాయంతోనే ప్రాణాన్ని కాపాడుకుంటున్నట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న వైద్యులు స్పష్టం చేశారు. ఆయన కాలేయం, కిడ్నీల పనితీరు పూర్తిగా క్షీణించింది. సిఆర్‌టిఆర్‌ (హీమో డయాలిసిస్‌) ద్వారా చికిత్సనందిస్తున్నారు. హృదయానికి పేస్‌మేకర్‌ అమర్చినప్పటికీ బ్లడ్‌ప్రెషర్‌ లెవల్‌ 60కి పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వెంటిలేటర్‌ సహాయంతో శ్వాస అందిస్తున్నారు. ఇక ఐవి ప్లూయిడ్‌ ద్వారా జీవరక్షక మందులను, ఇన్‌ఫెక్షన్లు సోకకుండా యాంటీ బయోటిక్స్‌ను నిరంతరం బాబా దేహానికి సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ చికిత్సకు బాబా స్పందించడంలేదు. ఇది వైద్యులను కలవరపాటుకు గురిచేస్తోంది.
దీంతో భగవాన్‌ సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి దినమొక యుగంగా గడుస్తోంది. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని బాబా భక్తకోటి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పుట్టపర్తిలో పరిస్థితి అత్యంత ఉద్విగ్నభరితంగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. సత్యసాయి ఆస్పత్రి వద్ద, ప్రశాంతి నిలయంలో, పట్టణవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయలసీమ ఐజి సంతోష్‌ మెహ్రా, డిఐజి చారుసిన్హా, అనంతపురం జిల్లా ఎస్‌పి షానవాజ్‌ ఖాసింల నేతృత్వంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కీలక సమావేశం
మంత్రి గీతారెడ్డి సత్యసాయి ఆస్పత్రి భవనంలో ప్రభుత్వ అధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యులతో శుక్రవారం మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించారు. బాబా ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండడంతో తాజా పరిస్థితిపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అనుకోనిది ఏదైనా జరిగితే తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత తదితర అంశాలపైన చర్చించి ముఖ్యమంత్రికి నివేదిక పంపినట్లు సమాచారం. మరోవైపు మీడియాలో వస్తున్న పలురకాల విమర్శనాత్మక కథనాలపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బాబా భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, బాబా ఆరోగ్యవంతునిగా తిరిగిరావాలని ఆ భగవంతుని ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. సమాజానికి బాబాచేసిన మేలు గురించి ప్రపంచానికి చాటిచెప్పాలని అంతే తప్ప బాబా గురించి గాని, ఆయన ట్రస్ట్‌ మీదగాని అభాండాలు వేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
రెడ్‌ అలర్ట్‌...
బాబా ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో పుట్టపర్తిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. శుక్రవారం కూడా నిషేధాజ్ఞలు కొనసాగాయి. సత్యసాయి ఆస్పత్రి, ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు విద్యుత్‌ అంతరాయం తలెత్తకుండా ఉండేందుకు రెండు హై పవర్‌ జనరేటర్లను రప్పించారు. విపత్కర పరిస్థితి ఏర్పడితే ఆస్పత్రి లోపలి దృశ్యాలను బయట ప్రపంచానికి తెలియజేసేందుకు డిస్‌ప్లే స్క్రీన్‌లను తెప్పించి కొత్తచెరువు మండల కార్యాలయం వద్ద ఉంచారు. మరోవైపు పుట్టపర్తికి విఐపిల తాకిడి అధికంకావడంతో ప్రోటోకాల్‌కోసం జిల్లాలోని పలువురు మండల తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌లను రప్పించారు. ఎటువంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విఐపిల కాన్వాయ్‌కు వాహనాలను సిద్ధంగా ఉంచారు. జిల్లా కలెక్టర్‌ జనార్దరెడ్డి పుట్టపర్తిలోనే మకాంవేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తరలివస్తున్న భక్తజనం
సత్యసాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందన్న వార్తల నేపథ్యంలో పుట్టపర్తికి భక్తులు ప్రవాహంలా తరలివస్తున్నారు. అనంతపురం జిల్లా నుండేకాక, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ తదితర పలు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు బస్సులు, రైళ్లు, స్వంతవాహనాల్లో ఇక్కడికి చేరుకుంటున్నారు. దీంతో పుట్టపర్తిలోని లాడ్జీలన్నీ నిండిపోయాయి. ప్రశాంతి నిలయంలోని వసతి గృహాలు కూడా భక్తులతో నిండి ఉన్నాయి. చాలా మందికి బసచేయడానికి అవకాశం లభించక తిరిగవెళుతున్నారు. బాబా సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగివస్తారని, తమకు ఆయన దర్శన భాగ్యం లభిస్తుందన్నది వారి ప్రగాఢ నమ్మకం. బాబా ఆరోగ్యం కోసం పుట్టపర్తి అంతటా పూజలు, ప్రార్థనలు, భజనలు చేస్తున్నారు.

సానుకూల దృక్పథం యువజనాభ్యుదయానికి మూలం


సానుకూల దృక్పథం యువజనాభ్యుదయానికి మూలం ఏశ ప్రగతి అయినా, ఆ దేశంలోని యువకుల ప్రతిభా సామర్ధ్యాలు, శక్తియుక్తులపైనే ఆధార పడి ఉంటుందంటూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ తరచు చేసే ప్రకటనలు మన కన్నా విదేశీయులనే ఎక్కువ ప్రభావితం చేస్తున్నా యేమోననిపిస్తోంది.యువశక్తిని సద్వినియోగం చేసుకోవడానికి పొజటివ్‌ యూత్‌ డవలెప్‌ మెంట్‌ (పివైడి) పేరిట వివిధ రంగాల్లో యు వతను ప్రోత్సహించే కార్యక్రమం అమెరికాతో సహా వివిధ దేశాల్లో ఇప్పుడు అమలు జేస్తు న్నారు. యువకుల మనోభావాలను గ్రహించి కట్టలు తెగిన ప్రవాహం వంటి వారి శక్తి సామర్ధ్యాలను ఏ విధంగా సమాజ కల్యాణా నికి ఉపయోగించుకోవాలో లోతైన అధ్యయనం చేసిన అనంతరం వివిధ కార్య క్రమాలను రూపొందిస్తున్నారు. విధాన నిర్ణ యాల్లోనూ, కొత్త విషయాలను కనుగొనడం లోనూ యువకులకు ప్రమేయం కల్పించడం జరుగుతోంది. ఈ విషయంలో భారతీయు లకు ఉన్న అంకితభావాన్నీ, పని మీద ఉండే శ్రద్ధాసక్తులను గ్రహించడం వల్లనే అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన ప్రభుత్వ యంత్రాం గంలో ప్రవాస భారతీయులు పెక్కు మందికి కీలకమైన పదవులను ఇచ్చారు. అమెరికాలో ఆరోగ్య, మానవ వనరుల మంత్రిత్వ శాఖలు యువజనాభ్యుదాయనికి సానుకూల వైఖరులను అనుసరిస్తున్నాయి. ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండే యువకుల్లో నిరాశానిస్పృహలు ఏర్పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా, వారికి తీరిక లేకుండా చేయడం కోసం వివిధ రంగాల్లో వారికి శిక్షణ పూర్తి అయిన వెంటనే ఉద్యోగా వకాశాలు లభించేట్టు చేయడం, అందుకు తగిన రీతిలో వారికి సలహాలూ, సూచనలు ఇవ్వడం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


యువత సాధికారత
యువ సాధికారతకి ఇప్పుడు అన్ని దేశాలూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. తరాల మధ్య అంతరం లేకుండా చేయడానికి పాలనా వ్యవహారాల్లోనూ అనుభవజ్ఞులతో పాటు కొత్త రక్తానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాయి.సమస్యల పరిష్కారంలో యువత ఆలోచనలూ,అభిప్రాయాలను పంచుకోవడం, వాటికి మెరుగులు దిద్ది పాలనా వ్యవహారాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించడం, తద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్నీ, చిత్తస్థయిర్యాన్నీ పెంపొందించడం వంటి కార్యక్రమాలను అప్పుడే వివిధ దేశాలు అమలులో పెట్టాయి. సాధారణ విద్యలోనే కాక, సాంకేతిక, వృత్తి విద్యల్లోనూ,ఇతర ఆధునిక శాస్త్ర,సాంకేతిక రంగాల్లో యువత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఆయా రంగాలలో వారు నైపుణ్యాన్ని సంపాదించుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కామన్వెల్త్‌లోని 53 దేశాలు 2007 నుంచి 2015 వరకూ కామన్వెల్త్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరిట ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. యువ సాధికారత అంటే ఆయా రంగాల్లో యువకులు అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నీ, దన్నునూ ఇవ్వడం, యువత ఆలోచనలకూ, అభిప్రాయాలకూ ప్రాధాన్యం ఇవ్వడం మొదలైనవి. యువకులు తమ హక్కుల గురించే కాక, సమాజం పట్ల తమకు గల బాధ్యతలను గురించి తెలియజెప్పడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా వారిని తీర్చి దిద్దే కార్యక్రమాలను ఈ కార్యాచరణలో పొందుపర్చారు. అలాగే, వివిధ అంశాలకు సంబంధించి సవాళ్ళను ఎదుర్కొనేందుకు
యువతను సన్నద్ధం చేయడం కూడా ఈ ప్రణాళికలోని ముఖ్యాంశం. యువకుల హక్కుల కోసం ఉద్యమాలు నిర్వహించడం, హక్కులతో పాటు బాధ్యతలను మరవ రాదని వారికి తెలియజెప్పడం, అట్టడుగు స్థాయి నుంచి యువకులను సమీకరించి వారికి ఏయే రంగాల్లో ఆసక్తి ఉందో గ్రహించి ఆయా రంగాల్లో ప్రోత్సహించడం ఈ కార్యాచరణ ప్రణాళికలో చేర్చడం జరిగింది. చైనా, యూ రప్‌,అమెరికా, తదితర దేశాల్లో యువజన సంస్థలు ప్రణాళికా బద్దంగా పని చేస్తున్నాయి. మానవ హక్కుల గురించి యువతకు సుబోధకం చేసేందుకు జర్మనీలో 2011లోనే యూత్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వ ర్యంలో విద్యార్దినీ విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నారు.బాల్యం నుంచే మానవ హక్కులపై అవగాహన పెంచేందుకు


చేపట్టిన ఈ కార్యక్రమం అన్ని వర్గాల ప్రజల ఆదరణను చూరగొన్నది. అలాగే, వక్తృత్వ పటిమను పెంపొందించేందుకు పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రాపంచిక, ప్రాదేశిక అంశాలపై అవగాహన పెంచడానికి కంప్యూటర్లు, ఇంటర్నెట్‌లు ఇప్పుడు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. పదవ తరగతి లోపు విద్యార్ధులు కూడా ఇంటర్నెట్‌లో వివిధ సైట్‌లు చూడటానికి అలవాటు పడుతున్నారు. గతంలో మాదిరిగా తమ తలలను పుస్తకాల్లో కాకుండా ఇంటర్నెట్‌లో గంటల తరబడి పెడుతున్నారు. ఇది ఒక విధంగా మంచి పరిణామే కానీ, అన్ని రంగాల్లో మాదిరిగా వ్యాపార ధోరణులు ఈ రంగంలోనూ ప్రవేశించడం వల్ల చెడు వైపు యువతను ఆకర్షించేందుకు జరిగే యత్నాలను అరికట్టడం, సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించిన చట్టాలను కట్టుదిట్టంగా అమలు జేయడం ప్రభుత్వాల బాధ్యత. అభివృద్ది, అవాంఛనీయ ధోరణులు నాణానికి రెండు పార్శ్వాలుగా ఎప్పుడూ ఉంటాయి. మంచి వైపు మాత్రమే మన పిల్లలను నడిపించాలి. అందుకు తగిన విధంగా విద్యా, శిక్షణ విధానాలు ఉండాలి. సాంకేతికాభివృద్ధి సమాజకల్యాణానికి తోడ్పడినప్పుడే అది సార్థకమైనట్టు.

అక్షయ తృతీయ సందడి మొదలు


మే 6న ఆక్షయ తృతీయ. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందన్నది అనాదిగా వస్తున్న నమ్మకం. ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకుని అంతంతమాత్రంగా ఉన్న బంగారం అమ్మకాలను పెంచుకోవాలని ఆభరణాల తయారీదారులు, వ్యాపారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కస్టమర్లకు ఆకట్టుకునేందుకు పర్వదినానికి మూడు వారాల ముందు నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు.
ధరలు అధికమైనా సెంటిమెంట్‌పై వర్తకుల ఆశలు
రికార్డు స్థాయి అమ్మకాలు సాధ్యమేనంటున్న నిపుణులు
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు మంచి ఊపు మీద ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో 16,900 నుంచి 17,100 రూపాయల మధ్య ఉన్న 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 21 వేల రూపాయలను దాటి ఆల్‌ టైం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. భవిష్యత్‌లో బంగారం ధరలు మరింతగా పెరగనున్నాయని, అందువల్ల ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారు ఇప్పుడు కొనిపెట్టుకున్నా మంచిదని విశ్లేషకులు సూచిస్తుండడంతో ఈ ఏటి అక్షయ తృతీయ అమ్మకాలు రికార్డు స్థాయిలను దాటవచ్చని అంచనా. బంగారం కొనుగోలుకు అత్యంత శుభదినంగా పరిగణిస్తున్న ఈ పర్వదినం రోజున ప్రజలను జ్యువెలరీ దుకాణాలవైపు నడిపించేందుకు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రత్యేక ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించింది.
డాలర్‌తో రూపాయి మారకపు విలువ గణనీయంగా మారుతున్న కారణంగా బంగారం ధరలు 35 శాతం వరకూ పెరగవచ్చని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ గత సంవత్సరం వేసిన అంచనాలు నిజమయ్యాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 21,500 నుంచి 21,700 రూపాయల మధ్య ఉన్న 10 గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర వచ్చే సంవత్సరం ఆక్షయ తృతీయ నాటికి 25 వేల రూపాయలను అధిగమిస్తుందని డబ్ల్యుజిసి అంచనా వేసింది. ఒక్క వివాహాల సీజన్‌లో మినహా నిన్నమొన్నటి వరకూ స్తబ్దుగా వున్న బంగారం అమ్మకాలు మే 6 తరువాత ఊపందుకుంటాయని మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 1400 డాలర్లను దాటి పయనిస్తున్న ఔన్సు బంగారం ధర ఈ సంవత్సరమే 1500 డాలర్లకు చేరవచ్చని అంచనా. అదే జరిగితే మన దేశంలో డాలర్‌తో మారకపు విలువలో ఒడిదుడుకుల కారణంగా 10 గ్రాముల బంగారం ధర 24 వేల రూపాయల వరకూ చేరే అవకాశాలున్నాయి. దీనికితోడు భారతీయ గృహిణుల నుంచి బంగారం కొనుగోలుకు వస్తున్న డిమాండ్‌ మరింతగా పెరగవచ్చని డబ్ల్యుజిసి అభిప్రాయపడింది.
గత కొన్ని సంవత్సరాలుగా బంగారంపై పెట్టే పెట్టుబడులు కూడా సంవత్సరానికి కనీసం 20 నుంచి 25 శాతం వరకూ రాబడులను ఇస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో సగటున సంవత్సరానికి 26 శాతం ధరలు పెరిగాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న 2008లో కూడా గోల్డ్‌ రేట్‌ 17 శాతం పెరిగింది. 2009లో సైతం బంగారం ధరలు పెరుగుతూనే వచ్చాయి. ఒక దశలో 18 వేల రూపాయల రికార్డు స్థాయిని దాటిన బంగారం ధర కెరెక్షన్‌ దిశగా పయనించినప్పటికీ, మరోసారి అదే స్థాయికి చేరింది. గ్రీకు మాంద్యం ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తడి కొనసాగుతుండడంతో ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా బులియన్‌ అందరి కళ్ళనూ ఆకర్షిస్తోంది.
ఇదిలావుండగా, ఆక్షయ తృతీయ రోజున అమ్మకాలను పెంచుకునేందుకు ప్రముఖ రిటైల్‌ కంపెనీలు, ఆభరణాల తయారీ దారులు పెద్దఎత్తున డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారు. పర్వదినం రోజున రద్దీని తట్టుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముందుగానే ఆభరణాలు ఎంచుకుని డబ్బు చెల్లించి 6న వచ్చి డెలివరీ తీసుకోవాలని సూచిస్తున్నారు. తమ షోరూంల నుంచి కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 25 శాతం వరకూ మేకింగ్‌ చార్జీలను తగ్గిస్తున్నామని, వజ్రాభరణాలపై 10 శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఆక్షయ తృతీయ కస్టమర్ల కోసం ఎన్నో డిజైన్లను సిద్ధం చేశామని కొన్ని సంస్థలు, చెన్నై కేంద్రంగా హైదరాబాద్‌లో దుకాణాలు నిర్వహిస్తున్న సంస్థలు మార్కెట్‌ రేటు కన్నా గ్రాముకు 100 రూపాయల వరకూ తక్కువ ధరకు ఆభరణాలు విక్రయిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ముందుగా బుక్‌ చేసుకుంటే ఆక్షయ తృతీయ రోజున మేళతాళాలతో ఇంటికి వచ్చి మరీ బంగారాన్ని డెలివరీ చేస్తామని ప్రకటించాయి. ఏదిఏమైనా బంగారానికి డిమాండ్‌ ఎల్లప్పుడూ ఉండే భారత్‌లో ఆభరణాల తయారీ సంస్థలు ఆక్షయ తృతీయను ఎంతమేరకు ఉపయోగించుకుని లబ్ది పొందుతాయన్నది మరో మూడు వారాల్లో తెలుస్తుంది.
- శ్రీనివాసకుమార్‌ మామిళ్ళపల్లి


పెరిగినా, తగ్గినా లాభం మీకే..!
పర్వదినం రోజున ఆఖరి సమయంలో రద్దీలో ఇబ్బందులు పడే వారికి ఆకర్షణీయమైన పథకాలు జ్యూయెలర్స్‌ ప్రకటించాయి. బుక్‌ చేసుకున్న రోజున ఉన్న బంగారం ధరకన్నా అక్షయ తృతీయ రోజు ధర తగ్గితే ఆ తేడా మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తామని ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో ధరలు పెరిగితే అదనపు సొమ్ము చెల్లించనక్కర్లేదని తెలియజేస్తున్నాయి. ఇదేదో బాగుంది కదూ..!

మోడీ 'మతోన్మాదానికి'మరో రుజువు!


గాంధీ పుట్టిన గుజరాత్‌లో మత ఘర్షణలు చోటు చేసుకుని తొమ్మిదేళ్ళు దాటినా అవి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పీడకలల్లా వెంటాడుతున్నాయి. కేంద్రాన్నీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలనూ కుదిపేస్తున్న అవినీతిని అదుపు చేయగలిగిన పాలకునిగా, గుజరాత్‌ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న మోడీని ఆనాటి ఘర్షణలు ఇప్పటికీ వెంటాడటం దురదృష్టకరమే. గుజరాత్‌ అల్లర్లలో మోడీకి ప్రమేయం ఉందని గతంలో శ్రీకుమార్‌ వంటి పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారాన్ని తలదన్నే రీతిలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సంజీవ భట్‌ శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ని దాఖలు చేశారు. ఆనాటి అల్లర్ల వెనుక మోడీకి ప్రమేయం ఉందని ఆ అఫిడవిట్‌లో సంజీవ భట్‌ పేర్కొన్నారు. ఆనాటి అల్లర్లపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మీద నమ్మకం లేనందున వాస్తవాలను తెలియజేసేందుకు ఆయన ఈనెల 14వ తేదీన ఈ అఫిడవిట్‌ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఇప్పటికీ ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతున్న తాను ఇలాంటి సున్నితమైన అంశాలను బహిరంగంగా మాట్లాడటం సబబు కానందున అఫిడవిట్‌ దాఖలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీల దగ్ధం సంఘటనకు ప్రతీకారంగా గుజరాత్‌ అంతటా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది ప్రజలు ఊచకోతకు గురి అయ్యారు. ఆనాటి సంఘటనలు తలుచుకుంటేనే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచే అంత తీవ్రమైనవని, తాను ప్రభుత్వ సర్వీసులో ఉన్నందున ఆనాటి సంఘటనల గురించి సుప్రీంకోర్టుకు తెలియజేసానని ఆయన చెప్పారు. 2002 ఫిబ్రవరి 27వ తేదీన మోడీ నిర్వహించిన ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సమావేశానికి సంజయ్‌ భట్‌ హాజరయ్యారు. గోద్రా సంఘటనపై చెలరేగిన ప్రతీకార జ్వాలలను చల్లార్చవలసిన బాధ్యత ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోడీపై ఉంది. అయితే, ఆనాటి సమావేశంలో మోడీ చేసిన ప్రసంగం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని భట్‌ పేర్కొన్నారు. ఆగ్రహంతో ఉన్న హిందువులను అడ్డుకోవద్దనీ, ముస్లింలకు తగిన గుణపాఠం చెప్పనివ్వండి అని మోడీ పోలీసు అధికారులను ఆదేశించినట్టు భట్‌ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. మోడీ మీద మచ్చ పడేట్టు చేసింది ఇదే. మోడీ బిజెపి నాయకుడైనప్పటికీ, ఆయనపై ఆనాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆగ్రహం వ్యక్తం చేసి తన నిష్పాక్షికతను రుజువు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా మోడీ రాజధర్మాన్ని పాటించలేదంటూ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్య అప్పట్లో అధికార బిజెపిలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. అదే వ్యాఖ్య మరొకరెవరో చేసి ఉంటే ఎవరూ పట్టించుకుని ఉండేవారు కారు. వాజ్‌పేయి బిజెపిలో తిరుగు లేని నాయకుడుగా ఉన్నందున ఆయనకు ఎవరూ ఎదురు చెప్పలేదు కానీ,పార్టీలో మాత్రం కలకలం రేపింది. ఆ తరువాత పార్టీ వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వాజ్‌పేయి అంతటి నాయకుడు మోడీని ప్రశంసించవలసి వచ్చింది. మోడీ మీద వెల్లువెత్తిన ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం అదే వాజ్‌పేయి చేత కమలనాథులు బలవంతంగా ఆ ప్రకటన చేయించారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి వివిధ కేసుల దర్యాప్తును తూతూ మంత్రంగా జరిపించి నిందితులను వదిలేశారన్న ఆరోపణ కూడ మోడీ మీద వచ్చాయి. ఇప్పుడు సంజీవ భట్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నవి కొత్త విషయాలు కాకపోయినా, పాత గాయాన్ని మరోసారి రేపేరీతిలో ఉంది ఆ అఫిడవిట్‌. ఈ సంఘటనలు జరిగిన తరువాత గుజరాత్‌లో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి, రెండు సార్లూ కూడా మోడీ నేతృత్వంలోని బిజెపియే తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే, మోడీలోని మత చాందసుణ్ణి వామపక్షాల వారూ, లౌకిక ప్రజాస్వామ్య వాదులు ఇప్పటికీ చూస్తుండగా, రాష్ట్ర ప్రజలు మాత్రం ఆయన పాలనా దక్షతనూ, రాష్టాభివృద్ధికి ఆయన సేవలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకే, ఆయన నాయకత్వం పట్ల పదే పదే తమ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.'వైబ్రంట్‌ గుజరాత్‌' పేరిట మోడీ ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సులో రెండు లక్షల కోట్ల రూపాయిల మేరకు పెట్టుబడులను రాష్ట్రానికి సంపాదించగలిగారు. ఇది సామాన్యమైన విషయం కాదు.
అంతేకాక, గుజరాత్‌లో అవినీతి అసలు లేదనడం అసత్యమవుతుంది కానీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల మాట అటుంచి బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటి కన్నా గుజరాత్‌లో తక్కువ అవినీతి ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.కృష్ణా గోదావరి బేసిన్‌లో చమురు అన్వేషణకు గుజరాత్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చొరవ తీసుకుని వచ్చి అంచనాలకు మించిన లాభాలను మూటగట్టుకుని వెళ్ళడానికి మోడీ చూపిన చొరవే ప్రధాన కారణం. అందుకే, మోడీని దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి అంటూ బిజెపి అగ్రనాయకుడు అద్వానీ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశంసిస్తూ ఉంటారు. అలాగే, సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ విషయంలో కూడా మోడీ మీద మచ్చ పడింది. మోడీని లౌకిక వాద పార్టీలు, వామపక్షాలే కాక, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు కూడా దూరంగా ఉంచుతున్నాయి. గత సంవత్సరం జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీని తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా జనతాదళ్‌(యు) నాయకుడు, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బిజెపి కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇప్పుడు సంజీవ భట్‌ వెల్లడించిన అంశాలు మోడీని మరింత వివాదాస్పదుణ్ణి చేస్తాయి. ఒక వంక పాలనా దక్షునిగా, మరో వంక మత చాందసునిగా మోడీ ఇప్పటికే పేరొందారు, అయితే, ఆయన ఇలాంటి విమర్శలూ, ఆరోపణలనూ ఖాతరు చేయకుండా తన మార్గాన తాను పని చేసుకుని పోతున్నారు. నవ గుజరాత్‌ నిర్మాతగా ఆయన ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపధ్యంలో సంజీవ భట్‌ చేసిన ఆరోపణల ప్రభావం ఏమేరకు ఉంటుందనేది వేచి చూడవలసిందే.

గేల్‌ విధ్వంసం... బెంగళూరు 'రాయల్‌' గెలుపు


కోల్‌కతా: వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. క్రిస్‌గేల్‌ (102 నాటౌట్‌) విధ్వంసక సెంచరీ సాధించడంతో 172 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు మరో 11 బంతులు మిగిలివుండగానే కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. యూసుఫ్‌ పఠాన్‌ (46), గంభీర్‌ (48), కలిస్‌ (40) పరుగులు సాధించి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించారు. కాగా, అజేయ సెంచరీతో బెంగళూరును గెలిపించిన గేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
గేల్‌ విశ్వరూపం...
భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌కు ఓపెనర్లు దిల్షాన్‌, గేల్‌ శుభారంభం అందించారు. ప్రారంభంలో దిల్షాన్‌ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. మరోవైపు ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే గేల్‌ చెలరేగి పోయాడు. తొలి బంతి నుంచే కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన పాత ఫ్రాంచైజీ రైడర్స్‌ కసి తీర్చుకుంటున్నాడా అనే విధంగా గేల్‌ చెలరేగి పోయాడు. దీంతో ఈడెన్‌లో పరుగుల వరద పారింది. ఇద్దరూ పోటీపడి షాట్లు కొట్టడంతో బెంగళూరు స్కోరు 5.3 బంతుల్లోనే 50 దాటింది. తర్వాత గేల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి పోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడిన గేల్‌ 29 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఇదే క్రమంలో స్కోరును 100 పరుగులు దాటించాడు. మరోవైపు కుదురుగా ఆడిన దిల్షాన్‌ 31 బంతుల్లో 6ఫోర్లతో 38 పరుగులు చేసి బాలాజీ బౌలింగ్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 123 పరుగు తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కోహ్లి అండతో గేల్‌ తన ప్రతాపాన్ని కొనసాగించాడు. ఇద్దరూ వేగంగా ఆడుతూ జట్టును లక్ష్యం వైపు తీసుకెళ్లారు. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన గేల్‌ 50 బంతుల్లోనే 10ఫోర్లు, 7సిక్సర్లతో సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు కోహ్లి కూడా చెలరేగి ఆడాడు. 23 బంతుల్లోనే 3ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. గేల్‌ (102) పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు అబేధ్యంగా 52 పరుగులు జోడించారు. దీంతో బెంగళూరుకు టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. కాగా, కోల్‌కతాకు ఇది వరుసగా రెండో ఓటమి. కొచ్చితో జరిగిన మ్యాచ్‌లోనూ గంభీర్‌ సేన ఓటమి పాలైన విషయం తెలిసిందే.
శుభారంభం...
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతాకు ఓపెనర్లు కలిస్‌, హడిన్‌ శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 44 పరుగులు జోడించారు. జహీర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే కలిస్‌ 3ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో జట్టుకు 19 పరుగులు లభించాయి. మరోవైపు చెలరేగి ఆడిన హడిన్‌ 11 బంతుల్లోనే 2ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. తర్వాత వచ్చిన గంభీర్‌ చెలరేగి ఆడాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడిన గంభీర్‌ 36 బంతుల్లోనే 6ఫోర్లతో 48 పరుగులు సాధించాడు. సమన్వయంతో ఆడిన కలిస్‌ 42 బంతుల్లో 4ఫోర్లతో 40 పరుగులు చేశాడు. చివర్లో యూసుఫ్‌ పఠాన్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. చెలరేగి ఆడిన పఠాన్‌ 24 బంతుల్లో 3సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 46 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించాడు.
స్కోరుబోర్డు
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌: కలిస్‌ (సి) క్రిస్‌ గేల్‌ (బి) వెటోరీ 40, బ్రాడ్‌ హాడిన్‌ (సి) కోహ్లి (బి) సయ్యద్‌ మహ్మద్‌ 18, గౌతమ్‌ గంభీర్‌ (సి) దిల్షాన్‌ (బి) అరవింద్‌ 48, యూసుఫ్‌ పఠాన్‌ (సి) కోహ్లి (బి) అరవింద్‌ 46, ఇయాన్‌ మోర్గన్‌ (రనౌట్‌) 6, సౌరబ్‌ తివారి (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 13, మొత్తం 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు.
వికెట్ల పతనం: 1-44, 2-102, 3-139, 4-169, 5-171.
బౌలింగ్‌: జహీర్‌ ఖాన్‌ 4-0-53-0, అరవింద్‌ 3-0-37-2, సయ్యద్‌ మహ్మద్‌ 4-0-20-1, దిల్షాన్‌ 2-0-15-0, విరాట్‌ కోహ్లి 1-0-9-0, డానియల్‌ వెటోరీ 4-0-28-1, క్రిస్‌ గేల్‌ 2-0-9-0.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దిల్షాన్‌ (బి) లక్ష్మిపతి బాలాజీ 38, క్రిస్‌ గేల్‌ (నాటౌట్‌) 102, విరాట్‌ కోహ్లి (నాటౌట్‌) 30, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం 18.1 ఓవర్లలో 175/1.
వికెట్ల పతనం: 1-123.
బౌలింగ్‌: యూసుఫ్‌ పఠాన్‌ 3-0-25-0, లక్ష్మిపతి బాలాజీ 4-0-43-1, ఉనాద్కత్‌ 3-0-24-0, సాకిబ్‌ అల్‌ హసన్‌ 2.1-0-29-0, భాటియా 3-0-28-0, సౌరబ్‌ తివారి 1-0-14-0, ఇక్బాల్‌ అబ్దుల్లా 2-0-12-0.

ఒబామా, మెస్సీలకంటే పలుకుబడి గల ధోనీ


న్యూయార్క్‌ : టైమ్‌ మాగజైన్‌ 2010 సంవత్సరానికి రూపొందించిన ప్రపంచంలో అత్యంత పలుకుబడి గల 100 మంది ప్రముఖుల జాబితాలో భారత క్రికెట్‌ కెప్టన్‌ మహేంద్ర సింగ్‌ దోనీ 52వ స్థానంలో నిలిచి అమెరికా అధ్యక్షుడు బారక్‌ ఒబామా, ప్రపంచ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు లియొనెల్‌ మెస్సీ కంటేకూడా ముందున్నారు. ఒబామా 86వ స్థానంలోనూ, మెస్సీ 87వ స్థానంలోను నిలిచారు. జాబితాలో ప్రథమ స్థానాన్ని గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ వేల్‌ ఘోనిమ్‌ ఆక్రమించారు. ఈ జిప్టు విప్లవంలో ఘోనిమ్‌ అధికార ప్రతినిధిగా ఉన్నారు. జాబితాలో క్రీడారంగానికి చెందిన ఏకైక భారతీయుడు ధోనీకాగా, ఇతర రంగాలకు చెందిన నలుగురు భారతీయులకు కూడా జాబితాలో స్థానం లభించింది. ''టైటాన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ'' గా ముఖేష్‌ అంబానీకి జాబితాలో 61వ స్థానం, 'బ్రెయిన్‌ మేపర్‌' గా వి.ఎస్‌.రామచంద్రన్‌కు 79వ స్థానం, 'ఫిలాంత్రఫిస్ట్‌' గా అజీమ్‌ ప్రేమ్‌జీకి 88వ స్థానం, 'ఛేంజ్‌ ఏజెంట్‌' గా అరుణా రాయ్‌కి జాబితాలో 89వ స్థానం లభించాయి. ధోనీని ''కెప్టెన్‌ ఆఫ్‌ ఫాంటాస్టిక్‌'' గా టైమ్‌ మాగజైన్‌ అభివర్ణించింది. టెండూల్కర్‌ తరువాత టైమ్‌ మాగజైన్‌ 100 మంది ప్రపంచ పలుకుబడిగల వ్యక్తుల జాబితాలో మంచి ర్యాంకు పొందిన క్రీడాకారులలో ధోనీ రెండవవారు.
జాబితాలో స్థానం దక్కిన ఇతర ప్రముఖులలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ (43వ స్థానం దక్కించుకుని ఒబామాకంటేకూడా ముందున్నారు), ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకెర్‌బర్గ్‌, (6వ స్థానం), వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అస్సాంజె(9వ స్థానం) ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా గుడ్‌ఫ్రెడే ప్రార్ధనలు


న్యూఢిల్లి : జీసెక్రీస్ట్‌ ను శిలువ వేయడాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలూ, ఊరేగింపులూ, ఐహిక సుఖాలను త్యజించడానికి చిహ్నంగా ఉపవాసాలతో ఘనంగా గుడ్‌ ఫ్రైడే వేడుకలు జరిగాయి. కొవ్వొత్తులను చేతితో పట్టుకిని, వందలూ, వేలాది మంది క్రిస్టియన్‌లు వివిధ ప్రాంతాలలో చెక్క క్రాస్‌లను ధరించి భక్తి శ్రద్ధలతో ఊరేగింపులు జరిపారు. జెరూసలేం పాత నగరంలో వేల సంఖ్యలో క్రిష్టియన్లు ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇక్కడే రోమన్లు క్రీస్త్‌కు శిలువ వేశారు. లాటిన్‌ పాట్రియార్క్‌ ఫౌద్‌ తవల్‌ నాయకత్వంలో కాథలిక్‌ చర్చిల ప్రతినిధులు జరూసలేంలో ఉదయపు ఊరేగింపు నిర్వహించారు. భారత దేశంలోకూడా దేశ వ్యాప్తంగా ఘనంగా గుడ్‌ ఫ్రైడే వూరేగింపులూ ప్రత్యేక ప్రార్థనలూ జరిగాయి. కేరళ క్రిస్టియన్లు రోజంతా ప్రార్థనలు జరిపారు. పట్టణాలూ, పల్లెలలో సైతం ఊరేగింపులు సాగాయి. నాగాలాండ్‌లోకూడా కేథలిక్కులు పెద్ద ఎత్తున కోహిమాలో గుడ్‌ ఫ్రైడే వేడుకలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో “గుడ్‌ఫ్రైడే‘
హైదరాబాద్‌,ఆంధ్రప్రభ ప్రతినిధి : క్రైస్తవుల ఆరాధ్యదైవమైన యేసుక్రీస్తు (జీసస్‌ క్రైస్ట్‌) చనిపోయిన రోజైన “గుడ్‌ఫ్రైడే‘ను శుక్రవారం క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా యేసుక్రీస్తు సిలువపై పలికిన యేడు మాటలను ధ్యానించారు. కేథలిక్‌ చర్చ్‌లలో యేసుక్రీస్తు సిలువ మరణాన్ని నాటకాలుగా ప్రదర్శించారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలోని కేథలిక్‌, బాప్టిస్ట్‌, మెథడిస్ట్‌, మెన్నోనైట్‌, సిఎస్‌ఐ తదితర చర్చిలలో ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. మెదక్‌లోని సిఎస్‌ఐ చర్చితో పాటు విజయవాడ, విశాఖపట్టణం, వరంగల్‌, కర్నూలు నగరాలలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. లోకంలోని పాపాలను కడిగి వేసేందుకే జీసస్‌ క్రైస్ట్‌ సిలువపై చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్లారని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం. ఆయన మరణంతోనే పాపక్షమాపణ, ప్రాయశ్చిత్తం అనేవి మానవ జీవితాలకు ఉన్నాయని అంటారు. 2 వేల సంవత్సరాల క్రితం రోమన్‌ సామ్రాజ్యంలో పేదలు, అణచివేయబడిన ప్రజల పక్షాన తన గొంతును విప్పి, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు యేసుక్రీస్తు ప్రయత్నించారు. ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి విస్తుపోయిన రోమన్‌ పాలకులు, ఆయన అలాగే ప్రజల్లో తిరిగితే తమ ప్రభుత్వాలు కూలిపోతాయనే భయంతో అంతం చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో చిత్రహింసలు పెట్టి సిలువ వేసి చంపేస్తారు. శుక్రవారం నాడు ఆయన చనిపోయి తిరిగి ఆదివారం పరలోకం వెళతారు. ఆయన చనిపోయి పునరుత్థానుడవటంతో తమ పాపాలకు ప్రాయశ్చిత్తం లభించిందని క్రైస్తవులు నమ్ముతారు. అందువల్ల ఆయన చనిపోయిన దినాన్ని “గుడ్‌ఫ్రైడే‘గా ఆచరిస్తారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నెల మూడవ శుక్రవారాన్ని క్రైస్తవులు, యూదులు “గుడ్‌ఫ్రైడే‘గా ఆచరిస్తారు.