Saturday, April 16, 2011

నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ వాట్సన్‌


దుబాయి: అంతర్జాతీయ క్రికెట్‌ (ఐసిసి) వన్డే ఆల్‌రౌండర్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్‌ సిరీస్‌లో మెరుగైన ప్రతిభను కనబరచడం ద్వారా వాట్సన్‌ నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. వాట్సన్‌ ఆల్‌రౌండర్స్‌ జాబితాలో నెంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకోవడం కెరీర్‌లో ఇదే ప్రథమం. మరోవైపు వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లోనూ వాట్సన్‌ తన స్థానాన్ని మెరుగు పరుచుకున్నాడు. ఏకంగా తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకొని 4వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్స్‌ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ సాకిబ్‌ అల్‌ హసన్‌ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్‌ వన్డే సారథి షాహిద్‌ అఫ్రిది మూడో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌లో అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రతిభను కనబరిచి భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌కు ఈ జాబితాలో నాలుగో స్థానం దక్కింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన యువీ భారత్‌కు ఒంటిచేత్తో కప్పును సాధించి పెట్టిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌కు ఐదో ర్యాంక్‌ లభించింది. గతంలో నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా కొనసాగిన కలిస్‌ కొంతకాలంగా గాయంతో సతమతమవుతున్నాడు. దీని ప్రభావం అతని ఆటపై పడింది. దీంతో అతను ఐదో ర్యాంక్‌తోనే సరిపెట్టుకోక తప్పదు. మరోవైపు వన్డే బ్యాటింగ్స్‌లో హాషిం ఆవ్లూ టాప్‌ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. డివిలియర్స్‌ రెండో, దిల్షాన్‌ మూడో ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్‌ విభాగంలో డానియల్‌ వెటోరీ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ప్రైస్‌ రెండో, స్వాన్‌ మూడో ర్యాంక్‌ను పొందారు.
ఆసీస్‌దే అగ్రస్థానం...
వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను కాపాడుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా ఆస్ట్రేలియా టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకొంది. ఇటీవల ప్రపంచకప్‌ గెలుచుకున్న టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. వరల్డ్‌కప్‌ గెలిచినా భారత్‌కు అగ్రస్థానం దక్కలేదు. బంగ్లాపై ఘన విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా 129 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. భారత్‌ 121 పాయింట్లతో రెండో, శ్రీలంక 118 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ జట్లు తర్వాత స్థానాలను దక్కించుకొన్నాయి. మరోవైపు టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను కాపాడుకొంది. 128 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా రెండో, ఇంగ్లండ్‌ మూడో స్థానంలో నిలిచాయి. శ్రీలంకకు నాలుగో ర్యాంక్‌ దక్కింది. ఆస్ట్రేలియా 107 పాయింట్లతో ఐదో స్థానంతో సంతృప్తి పడింది. బ్యాటింగ్‌లో సచిన్‌కు టాప్‌ ర్యాంక్‌ దక్కింది. బౌలింగ్‌లో స్టెయిన్‌ మొదటి ర్యాంక్‌లో నిలిచాడు.

No comments:

Post a Comment