Friday, April 22, 2011

ప్ర'శాంతి'నిలయంలో కొనసాగుతున్న భజనలు


పుట్టపర్తి: అది పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం. పేరుకు తగినట్లే ప్రపంచ శాంతికి అంకితమైన భగవాన్‌ సత్యసాయిబాబా మనోన్మందిరం. గత నాలుగైదు దశాబ్దాలుగా నిత్యం భజనలు, పూజలతో సత్యసాయి భక్తులతో కళకళలాడుతోంది. బాబా పుట్టపర్తిలో ఉన్నా, పర్యటనలకు వెళ్లినా అక్కడి కార్యక్రమాల్లో ఏ మాత్రం తేడా ఉండదు. ప్రస్తుతం బాబా ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ప్రశాంతి నిలయంలోగానీ, బాబా ఆధ్యర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థలు, వైద్యసేవలకుగాని ఎలాంటి విఘాతం కలుగలేదు. బాబా ఆరోగ్యవంతుడై తిరిగివస్తారన్న ప్రగాఢ నమ్మకంతో అక్కడి సిబ్బంది, భక్తులు, సేవాదళ్‌ కార్యకర్తలు తమ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. అనుదినం బాబా భక్తులకు దర్శనమిచ్చే సాయి కుల్వంత్‌ హాలులో ఉదయం, సాయంత్రం భజన కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ప్రశాంతి నిలయంలోని లైబ్రరీ, షాపింగ్‌ కాంప్లెక్స్‌, క్యాంటీన్లు ఎప్పటిలాగే పనిచేస్తున్నాయి. ప్రశాంతి నిలయానికి భక్తుల రాకపోకలు కూడా అధికంగానే ఉన్నాయి. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో అక్కడ సందడి కనిపించడం లేదు. చైతన్య జ్యోతి మ్యూజియం, నక్షత్రశాల, ఇండోర్‌ స్టేడియంలలో శుక్రవారం సందర్శకులను అనుమతించలేదు.
గత రెండు మూడు రోజులుగా పుట్టపర్తిలో పోలీసుల ఆంక్షలు అధికం కావడంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. పట్టణంలో వ్యాపార సంస్థలు, లాడ్జిలు, హోటళ్లు పోలీసుల ఆంక్షలతో మూతపడడంతో భక్తులతోపాటు స్థానికులు ఇబ్బందుల పాలయ్యారు. పుట్టపర్తికి వచ్చే బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పలుచబడింది. ఆర్‌టిసి డిపో కలెక్షన్‌లు పడిపోయాయి. రోజుకు రూ.5 లక్షల కలెక్షన్లు వస్తుండగా బాబా అనారోగ్యానికి గురైన నాటి నుండి రాబడి తగ్గిందని, ప్రస్తుతం రోజుకు సుమారు రూ.4లక్షలు కలెక్షన్‌ వస్తోందని ఆర్టీసి అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment