హైదరాబాద్ : కడప పార్లమెంట్ పులివెందుల అసెంబ్లిd నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలలో రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థుల పోటీ ఎలాగున్నా, ముఖ్యంగా ఈ ఉప ఎన్నికల ఫలితాలు వై.ఎస్ బంధుగణం తీసుకునే నిర్ణయం, మద్దతు ఇచ్చే అభ్యర్థిపై ఆధార పడబోతున్నాయి. అంతేకాక పులివెందుల నుంచి దివంగత రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ పోటీ చేయటం దాదాపు ఖాయం కావటంతో కాంగ్రెస్ తరఫున ఆమెతో తలపడటం వైఎస్సార్ సోదరుడు వివేకానందరెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని, అప్పుడు కూడా ఆ కుటుంబ సభ్యులు పార్టీకి ప్రాముఖ్యతనిస్తారా? వైఎస్సార్ కుటుంబానికి ప్రాధాన్యతనిస్తారా అని చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రచారంలో కూడా కడప పార్లమెంట్ నియోజకవర్గానికి పులివెందులే కేంద్ర బిందువు కానున్నది. వై.ఎస్ బంధుగణంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు కేవలం వివేకానందరెడ్డి, ఆయన అల్లుడు ఎన్.రాజశేఖరరెడ్డి పేర్లు మాత్రమే వినపడుతున్నాయి. అయితే వీరిలో ఎవరు పులివెందుల నుంచి పోటీ చేస్తారో, కడప నుంచి పోటీ చేస్తారో ఇదమిత్థంగా తేలలేదు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కడప నుంచి జగన్మోహన్‌రెడ్డి, పులివెందుల నుంచి విజయమ్మ పోటీ చేయనుండటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వై.ఎస్ బంధుగణం పార్టీకంటే కుటుంబానికే ప్రాధాన్యతనిచ్చే అవకాశం కనిపిస్తున్నదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందులలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో కేవలం ఒక పర్యాయం మినహా మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. కడప పార్లమెంట్ స్థానంలో కూడా రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి, వైఎస్సార్ తనయుడు జగన్మోహన్‌రెడ్డి ఆ నియోజకవర్గాన్ని హస్తగతం చేసుకుంటూ వస్తున్నారు.
పులివెందుల అయితే వై.ఎస్ సొంత నియోజకవర్గమైపోయింది. నాలుగు తరాలుగా జిల్లాలో సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు అన్నీ వై.ఎస్ బంధుగణం చేతుల్లోనే ఉంటున్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సైతం 1987 నుంచి 2006 వరకు జరిగిన మండల అధ్యక్షులు, జెడ్‌పిటిసి సభ్యుల ఎన్నికలలో కేవలం 1995 సంవత్సరంలో వేముల, వేంపల్లె మండలాలలో మాత్రం టిడిపి గెలుపొందింది. వేముల, వేంపల్లె, సింహాద్రిపురం, పులివెందుల, లింగాల, తొండూరు మండలాధ్యక్షులు, జెడ్‌పిటిసి సభ్యులు అందరూ కాంగ్రెస్ వారే కావటం, అందులోనూ 80 శాతంపైగా వై.ఎస్ బంధుగణం కావటం విశేషం. నాలుగు తరాలుగా ఆ వంశీకులు జిల్లా మొత్తం వ్యాపించటంతో వారి బలంపై రాజకీయాలు ఆధారపడి వస్తున్నాయి. నాలుగు తరాల కిందట పుల్లారెడ్డి వై.ఎస్ కుటుంబీకులకు ఆద్యుడిగా పేర్కొనవచ్చు. ఆయన కుమారుడు వెంకటరెడ్డి, వెంకటరెడ్డి కుమారుడు పెదకొండారెడ్డి, చినకొండారెడ్డి, ప్రభుదాస్‌రెడ్డి, రాజారెడ్డి, పురుషోత్తమ్‌రెడ్డి జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పుతూ వచ్చారు. పెదకొండారెడ్డి కర్నాటకలో స్థిరపడ్డప్పటికీ ముగ్గురు కుమారులు ప్రకాశ్‌రెడ్డి, రాజీవ్‌రెడ్డి (కంట్రిక్లబ్), చిరంజీవిరెడ్డి వ్యాపారాలతో పాటు రాజకీయాలను కూడా శాసిస్తూ వస్తున్నారు. ప్రభుదాస్‌రెడ్డి క్రైస్తవ మత ప్రచారకుడిగా జీవతంలో స్థిరపడగా, ఆయన ఆరుగురు కుమార్తెలు, వారి సంతానం వై.ఎస్ కుటుంబీకులతో సన్నిహితులుగా మెలుగుతున్నారు. ఇదే మాదిరి చినకొండారెడ్డి ఆరుగురు కుమారెలు, ఐదుగురు కుమార్తెలు వాణిజ్య, వ్యాపారాలు, ఉద్యోగాలతో కాలం వెళ్లబుచ్చుతున్నప్పటికీ ఏ ఎన్నిక వచ్చినా పులివెందుల, కడప స్థానాల విజయానికి దోహద పడుతూ వస్తున్నారు. ఇక రాజారెడ్డి సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన భార్య జయమ్మ కూడా సర్పంచ్‌గా పదేళ్లు కొనసాగారు.
రాజారెడ్డి కుమారులు జార్జ్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి, సుధీకర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కుమార్తె విమలమ్మ రాజకీయాలకు సన్నిహితంగా మెలుగుతూనే ఉన్నారు. రాజారెడ్డి సోదరుడు పురుషోత్తమ్‌రెడ్డి పులివెందుల నుంచి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఆయన నలుగురు కుమారుల్లో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఇంజనీర్లుగా జీవితాల్లో స్థిరపడి, అవసరం వచ్చినప్పుడు కడపలో తమ సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. వై.ఎస్ వివేకానందరెడ్డి కుమార్తెను రాజశేఖరరెడ్డి బావమరిది రవీంద్రనాథ్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. మొదటినుంచి ఆయన రాజశేఖరరెడ్డి అనుయాయుడిగా ఉన్నారు. వైఎస్ తోడల్లుడు వై.వి. సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి బావమరిది బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వై.ఎస్‌కు అత్యంత సన్నిహితులుగా ఉంటున్నారు. పులివెందుల గ్రామ పంచాయతీగా ఏర్పాటైన నుంచి నేటివరకు 11 మంది సర్పంచ్‌లుగా ఎన్నిక కాగా, వారిలో ముగ్గురు మినహా మిగిలిన వారందరూ వై.ఎస్ బంధువులే.
No comments:
Post a Comment