Tuesday, April 12, 2011

ఖరీదైన ఉప ఎన్నికలు


  • కడప జిల్లాల్లో ధన ప్రవాహం 
  • పోలీసు తనిఖీలో చిక్కుతున్న లక్షల కట్టలు 
  • పోలింగ్‌ నాటికి 'శతకోట్ల' ప్రవాహం ఖాయం 
  • డేగకన్నుతో వీక్షిస్తున్న ఇసి
హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజేశేఖరరెడ్డి సొంత జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికలు ఖరీదైన వ్యవహరంగా మారనున్నాయి. ఇంకా నామినేషన్ల ప్రక్రియకు కూడా నోచుకోని ఈ ఉప ఎన్నికల తతంగం కోట్లాది రూపాయలు 'చేతు'ల మార్పిడికి వేదికగా నిలుస్తున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఎన్నికల ప్రచారం ముగిసి పోలింగ్‌ మొదలయ్యే సమయానికి ఈ రెండు నియోజక వర్గాలలో 'శత కోట్ల' పంపిణీ ఖాయమని విశ్వసనీయంగా తెలిసింది. ఎట్టి పరిస్థితులలోనూ ఉప ఎన్నికలలో గెలవాలనే కాంక్షతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహరచన చేసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఆరాధ్యదైవంగా ఆరాధించిన వైఎస్సార్‌ ఆలోచనలకు భిన్నంగా ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ అదే అధిష్టానాన్ని ధిక్కరించి తన ఎంపి పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా తండ్రి మరణానంతరం
జిల్లాలోని కడప లోక్‌సభ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లిd నియోజకవర్గానికి వెనువెంటనే వచ్చిన ఈ ఉప ఎన్నికలు ముక్కోణపు పోటీకి తెరతీసాయి. గతంలో ఏ ఉప ఎన్నికలలో లేని స్థాయిలో ఈ ఉప ఎన్నికల హోరు మొదలైంది. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరిట ఏర్పాటైన కొత్త పార్టీ ఈ ఎన్నికలలో సత్తా చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతుండగా, అధికార కాంగ్రెస్‌ పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సవాలుగా స్వీకరించాయి. ఇందులో భాగంగానే ఈ మూడు పార్టీలు ఆయా నియోజక వర్గాలలో నువ్వా నేనా అన్న రీతిలో వ్యూహాత్మక ప్రచారం చేస్తూ అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను వినియోగించుకుంటున్నాయి. ఎన్నికల బరిలో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఒకరిని మించి మరొకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రకరకాల జిమ్మిక్కులకు పాల్పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హాయాంలో కాంగ్రెస్‌ స్థానాలుగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాల ప్రస్తుత ఫలితాలు ఆయా రాజకీయ పార్టీలతో పాటు కొంతమంది వ్యక్తిగత ప్రతిష్టతో ముడిపడి ఉండటంతో ధన ప్రవాహం ఏరులై పారుతున్నట్టు నిన్న మొన్నటి సంఘటనలు నిలువెత్తు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలలో కచ్చితంగా డబ్బు పంపిణీ జరుగుతుందని ముందే భావించిన ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ పోలీసులను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేసింది.
పోలీసుల తనిఖీలలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే సుమారు రూ.90 లక్షలు చిక్కాయి. బద్వేలు సమీపంలోని టిపికుంట చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఓ కారును తనిఖీ చేసిన పోలీసులకు రూ.55 లక్షలు, రెడ్డివారిపల్లె వద్ద చెక్‌పోస్టులో రూ.9 లక్షలు పోలీసులకు పట్టుబడ్డాయి. సోమవారం కూడా టిపి చెక్‌పోస్టు వద్ద రూ.27 లక్షలు చిక్కాయి. తనిఖీలలో లభించిన సొమ్ముకు లెక్కలు లేకపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న ఈ ప్రాంతంలో భారీ ఎత్తున డబ్బు పట్టుబడుతుండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాహనాలలో డబ్బు తరలిస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్‌ దాఖలు పూర్తయిన తర్వాత ఈ ధన ప్రవాహం మరింత వేగంగా ఉండే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం చెక్‌పోస్టులను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు అనుమానితులను ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలలో కచ్చితంగా గెలిచితీరాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌, తెదేపా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌ స్థానాలుగా ఉన్న ఈ రెండు నియోజక వర్గాలను తిరిగి సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్‌, తమ వల్లనే ఈ సీట్లు కాంగ్రెస్‌కు దక్కాయని, ఇకపై తమ పార్టీ ఖాతాలోనే ఈ స్థానాలు ఉండాలనే పట్టుదలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఈ రెండు పార్టీలు అవినీతికి దత్త పుత్రికలంటూ ప్రచారంలో ఓటర్లను పలకరిస్తూ దూసుకుపోతున్న తెదేపా ఎత్తుకు పైఎత్తు వేసుకుంటూనే తమకు అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను సిద్ధం చేసుకుంటున్నాయి.

No comments:

Post a Comment