విద్యా వ్యవస్థ తీరుపై విరుచుకుపడిన ప్రధాని వైజ్ఞానిక సలహాదారు సిఎన్‌ఆర్ రావు
బెంగళూరు/ముంబై: నేటి విద్యావ్యవస్థ అంతా తలనొప్పి వ్యవహారంగా మారిపోయిందని తెగ చిరాకు పడిపోతున్నారు సి.ఎన్.ఆర్. రావు. ప్రధానమంత్రికి వైజ్ఞానిక సలహాదారుగా ఉన్న రావు, పరీక్షలు కుప్పలు తెప్పలుగా నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెనువెంటనే ఈ తలనొప్పి వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ఆయన సిఫార్సు చేస్తున్నారు. వైజ్ఞానిక సలహా మండలి (ఎస్‌ఎసిపిఎం)కి ఆయన సారథత్యం వహిస్తున్నారు. విద్యా వ్యవస్థలో అమెరికాను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అంటున్నారు. యూనివర్సిటీలో చేరేముందు ఒక జాతీయ పరీక్ష నిర్వహించడం అమెరికా పద్ధతని, అదే సరైనదని ఆయన అంటున్నారు. ఈ మేరకు ప్రధానికి ఆయన ఒక లేఖ రాశారు. 'మన దేశంలో పరీక్షా విధానమే తప్ప విద్యా విధానం లేదు. యువత పరీక్షలు ఆపేసి ఎప్పుడు విలువైన పని చేపడతారు?' అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్న వివిధ పరీక్షా విధానాలను ఆయన దుయ్యబట్టారు. 'సంవత్సరాంతం పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, అర్హత పరీక్షలు, ఎంపిక పరీక్షలు ఇలా రకరకాల పేర్లతో ఉన్న మొత్తం పరీక్షా విధానాన్ని పున:పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా, మెడికల్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల అర్హత పరీక్షలు కూడా పెట్టబోతున్నారట. కాస్త ఆలోచించాల్సిందే' అని ఆయనే అంటున్నారు. అనేక రకాల ప్రవేశ పరీక్షలతో సతమతమైపోతున్న విద్యార్థులకు ఈ సూచన ఆనందం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఐఐటి గురించి ఆయన ప్రస్తావిస్తూ, 'ఐఐటి ప్రవేశ పరీక్షకు మంచి ప్రజాదరణ ఉంది. అయితే అది చాలా కష్టతరమైనదే కాని,
ఎంతో ప్రయోజనం కలిగి ఉంది. అయినప్పటికీ యువతపై ఆ పరీక్ష చాలా వ్యతిరేక ప్రభావం చూపుతోంది. ఈ పరీక్షలో విజయం కోసం విద్యార్థులు నానావిధాలుగా ఒత్తిడికి గురై, అసలు విద్యలో ఉత్సాహం కోల్పోతున్నారు' అని ఆయన అన్నారు. ఐఐటిలో ప్రవేశానికి నోచుకోని లక్షలాది మంది తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఉత్తమ విద్యా సంస్థలతో సరిసమానమైన ఒక్క విద్యా సంస్థ కూడా నేడు మనదేశంలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం తపిస్తున్నవారి సంఖ్య నానాటి పెరిగిపోతున్న దృష్ట్యా కీలకమైన సమస్యలు, సవాళ్లకు సంబంధించిన పది అంశాల జాబితాను ఎస్‌ఎసిపిఎం విడుదల చేసింది. ఈ జాబితాకు సంబంధించి కార్యాచరణ ముసాయిదాను ఏడాదిలోగా సిద్ధం చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఆయన కోరారు. 'వచ్చే 20, 30 ఏళ్లలో మొత్తం ప్రపంచానికి మంచి శిక్షణ పొందిన మానవ శక్తిని అందించే దిశగా ఇండియాను తీర్చిదిద్దేందుకు అనుకూలమైన వాతావరణం సృష్టించే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇది సముచితమైన జాతీయ లక్ష్యం' అని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. రావు సూచించిన పది అంశాల జాబితాలో మూడు ముఖ్యమైనవి...
స్థాయి పెంపు: అభివృద్ధి చెందిన దేశాలలో ఉత్తమ విద్యా సంస్థలకు దీటుగా మనదేశంలో 10 విద్యాసంస్థలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి.
ముందుచూపు: చాలా దేశాలలో నిపుణుల సమతుల్యత దెబ్బ తింటూ ఉంటుంది. అంటే, కొన్ని సబ్జెక్టులలో అవసరానికి మించిన నిపుణులు ఉండగా, మరికొన్ని సబ్జెక్టులలో నిపుణుల కొరత ఎదుర్కొనవలసి వస్తోంది. అలా జరగకుండా ఉండేందుకు, 20 ఏళ్లలో అవసరాలు ఎలా ఉంటాయో ముందుగానే అంచనా వేసి అందుకు తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేయాలి.
అందుబాటు పరిధి పెంపు: గ్రామాలలో హయ్యర్ సెకండరీ స్థాయి వరకు పూర్తి స్థాయిలో రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్యను పెంచాలి.
No comments:
Post a Comment