Thursday, April 7, 2011

ఉపఖండం జట్లదే హవా!


ప్రపంచ క్రికెట్‌లో ఉపఖండం జట్ల హవా కొనసాగుతుందని చెప్పాలి. సుదీర్ఘ ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌, శ్రీలంక, పాకిస్తాన్‌ జట్లు నిలకడైన ఆటతో తమ ఆధిక్యాన్ని చాటుకుంటున్నాయి. ఇప్పటివరకు మొత్తం 10సార్లు వరల్డ్‌కప్‌ టోర్నీలో జరిగాయి. వీటిలో మూడు సార్లు మినహా మిగతా అన్నిసార్లు ఉపఖండానికి చెందిన ఏదో ఒక జట్టు ఫైనల్‌కు చేరుకోవడం అనవాయితీగా వస్తోంది. అంతేగాక నాలుగుసార్లు ఉపఖండం జట్లే విశ్వవిజేతగా నిలిచాయి. తొలి రెండు వరల్డ్‌కప్‌లలో మాత్రమే ఉపఖండం జట్లు విఫలమయ్యాయి. ఇక తర్వాతి టోర్నీల నుంచి ఉపఖండానికి చెందిన ఏదో ఒక జట్టు ఆధిక్యం ప్రదర్శించడం సంప్రదాయంగా వస్తోంది. 1983లో భారత్‌ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 1987లో భారత్‌, పాక్‌ జట్లు సెమీస్‌ వరకు దూసుకొచ్చాయి.
1992 నుంచి...
ఇక, 1992 వరల్డ్‌కప్‌ నుంచి ఉపఖండం జట్ల హఅవా మొదలైందని చెప్పాలి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ గడ్డపై 92లో జరిగిన విశ్వకప్‌లో పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది. 1996లో ఉపఖండం ఆతిథ్యం ఇచ్చిన ప్రపంచకప్‌లో శ్రీలంక కప్పును గెలుచుకొంది. 1999లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన టోర్నీలో పాకిస్తాన్‌ రన్నరప్‌గా నిలిచింది. 2003లో సఫారీ గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. తర్వాత 2007లో కరేబియన్‌ దీవులు ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్‌కప్‌లో ఉపఖండానికే చెందిన శ్రీలంక తుదిపోరుకు చేరుకొంది. అయితే మూడోసారి కూడా ఆసియా జట్లు రన్నరప్‌గానే సంతృప్తి పడ్డాయి. ఈ మూడుసార్లు కూడా ఆస్ట్రేలియానే విశ్వవిజేతగా నిలువడం విశేషం. అయితే ఉపఖండం వేదికగా జరిగిన వేదికలో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి పూర్తిగా తెరపడింది. నాలుగుసార్లు విజేత కంగారులు క్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఉపఖండానికి చెందిన భారత్‌, శ్రీలంకలు ఫైనల్‌కు చేరుకున్నాయి. ముంబైలో జరిగిన ఫైనల్లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో లంకను ఓడించి విశ్వవిజేతగా అవతరించింది. అంతేగాక ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ తర్వాత రెండు సార్లు వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టుగా భారత్‌ రికార్డు నెలకొల్పింది.

No comments:

Post a Comment