Thursday, April 7, 2011

అక్రమ నిర్బంధం కేసులో రాహుల్‌కు సుప్రీం నోటీసు


న్యూఢిల్లీ,: ఒక బాలికనూ, ఆమె తల్లితండ్రులను అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంథీపై సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిషోర్‌ స్మితే పెట్టిన కేసును అలహాబాద్‌ హైకోర్టు కొట్టి వేయడమే కాక, ఆ పిటిషనర్‌కి రూ.50 లక్షల జరిమానా విధించగా, ఆ తీర్పుపై ఆ మాజీ ఎమ్మెల్యే దాఖలు చేసిన అప్పీలును పురస్కరించుకుని సుప్రీంకోర్టు బుధవారంనాడు రాహుల్‌కీ,ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికీ నోటీసులు జారీచేసింది.
జస్టిస్‌ విఎస్‌ సిర్‌పుర్కార్‌,జస్టిస్‌ టిఎస్‌ టాకూర్‌లతో కూడిన బెంచ్‌ అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చింది. సమాజ్‌ వాదీ పార్టీ మాజీ లెజిస్లేటర్‌పై దర్యాప్తు జరపాలని సిబిఐని సుప్రీంకోర్టు బెంచ్‌ ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వు చట్ట వ్యతిరేకమే కాక, ఏకపక్షంగా ఉందని పిటిషనర్‌ అయిన మధ్యప్రదేశ్‌కి చెందిన సమాజ్‌వాదీ మాజీ ఎమ్మెల్యే కిషోర్‌ సమృతే ఆరోపించారు.అయితే, రాహుల్‌ గాంధీ కానీ, ఆయన అనుచరులు కానీ, తననూ, తన తల్లి తండ్రులను నిర్బంధించలేదని ఆ బాలిక కోర్టులో వాంగ్మూలం ఇవ్వడం వల్లనే ఈ కేసును హైకోర్టు కొట్టి వేసింది. అంతేకాక, రాహుల్‌పై కేసుపెట్టిన మధ్యప్రదేశ్‌ సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యేకు రూ.50 లక్షల జరిమానాను విధించింది. దానిని ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

No comments:

Post a Comment