Sunday, April 10, 2011

వాహన రంగంలో...తగ్గిన దిగ్గజాల వాటా

లాభపడిన ఫోర్డ్‌ ఇండియా, వోక్స్‌వాగన్‌

న్యూఢిల్లి: గడచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న టాప్‌ 3 కంపెనీల మార్కెట్‌ వాటా తగ్గింది. మారుతి సుజుకి, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ వంటి కంపెనీలు అమ్మకాల వృద్ధిని నమోదు చేసినప్పటికీ, మార్కెట్‌ వాటాను పెంచుకోవడంలో వెనుకబడ్డాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటొమొబైల్‌ అసోసియేషన్‌ (సియామ్‌) తాజా గణాంకాల మేరకు ఈ కంపెనీలు కోల్పోయిన వాటా ఫోర్డ్‌ ఇండియా, వోక్స్‌ వాగన్‌ వంటి కంపెనీలు ఎగరేసుకుపోయాయి. 2009-10లో 50.09 శాతంగా వున్న మారుతి సుజుకి మార్కెట్‌ వాటా ఈ సంవత్సరం 48.74 శాతానికి పడిపోయింది. అమ్మకాలు మాత్రం 7,65,533 యూనిట్ల నుంచి 9,66,447 యూనిట్లకు పెరిగాయి. మొత్తం మీద 2011 ఆర్థిక సంవత్సరంలో కార్ల అమ్మకాలు 29.73 శాతం పెరిగి 15,28,337 యూనిట్ల నుంచి 19,82,702 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా వాటా 09-10లో 20.61 శాతం ఉండగా, మార్చి నాటికి అది 18.1 శాతానికి పడిపోయింది. అదే విధంగా టాటా మోటార్స్‌ వాటా 13.18 నుంచి 12.92 శాతానికి తగ్గింది. ఈ సంస్థ 2,56,202 యూనిట్లను విక్రయించింది. జనరల్‌ మోటార్స్‌ ఇండియా, హోండా సియాల్‌ కార్స్‌ ఇండియా సంస్థలు సైతం తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయాయి. జిఎం ఇండియా వాటా 4.62 నుంచి 4.4 శాతానికి, హోండా సియాల్‌ వాటా 4.01 నుంచి 2.97 శాతానికి తగ్గింది. కాగా, గత సంవత్సరం ఫిగో, పోలో వంటి చిన్న కార్లను విడుదల చేసి విజయవంతమైన ఫోర్డ్‌, వోక్స్‌ వాగన్‌లు తమ అమ్మకాలను గణనీయంగా పెంచుకున్నాయి. 09-10లో 34,324 యూనిట్లను విక్రయించిన ఫోర్డ్‌ తదుపరి సంవత్సరం 95,395 వాహనాలను అమ్మింది. దీంతో మార్కెట్‌ వాటా 2.25 నుంచి 4.81 శాతానికి పెరిగింది. వోక్స్‌ వాగన్‌ సంస్థ 09-10లో కేవలం 4,094 యూనిట్లకే పరిమితమై, మార్చి నాటికి 51,608 యూనిట్లను విక్రయించింది. ఈ సంస్థ వాటా 0.27 నుంచి ఏకంగా 2.6 శాతానికి పెరిగింది. గత సంవత్సరం 24 కొత్త ఆవిష్కరణలు జరిగాయని, 40 వర్షన్లు కొత్త హంగులను సంతరించుకుని కస్టమర్ల ముందుకు వచ్చాయని సియామ్‌ అధ్యక్షుడు పవన్‌ గోయంకా వివరించారు.

No comments:

Post a Comment