పెట్టుబడిదారీ దేశాలు తమ దేశాల్లో వ్యర్దంగా ఉన్న వస్తువులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు అంటగడతాయని కమ్యూనిస్టులు గతంలో తరచు విమర్శిస్తూ ఉండేవారు. అలాగే, తమ దేశంలో మూలపడి ఉన్న తుప్పు పట్టిన ఆయుధాలను అమ్ముకునేందుకు ఇరుగుపొరుగు దేశాలకు ఎక్కువ ధరకు విక్రయిస్తాయని కూడా ఎద్దేవా చేస్తూ ఉండేవారు. పెట్టుబడీదారీ దేశాల్లో అమెరికాయే కమ్యూనిస్టులకు ప్రధాన శత్రువు కనుక, వారు అమెరికాని దృష్టిలో ఉంచుకునే ఈ విమర్శలు చేసేవారని విడమరచి వేరే చెప్పనవసరం లేదు. సోవియట్ యూనియన్ కుప్ప కూలక ముందు అగ్ర రాజ్యాలైన అమెరికా, సోవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్చన్న యుద్దం కొనసాగినంత కాలం మన దేశంలో కమ్యూనిస్టులు తమ విమర్శనాస్త్రాలన్నీ అమెరికాపైనే ఎక్కు పెట్టేవారు. సోవియట్ యూనియన్ కుప్పకూలడం, ప్రపంచీకరణ అనివార్యం కావడం, అన్ని దేశాల్లోనూ సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి రావడం వల్ల కమ్యూనిస్టు దేశాల్లో కూడా వాణిజ్య దృక్పథం పెచ్చు పెరుగుతోంది. ఆర్థిక సరళీకృత విధానాల వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన దేశంగా చైనాని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, చైనాతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి మన దేశంతో సహా అన్ని దేశాలూ తహతహ లాడుతున్నాయి. ఈ నేపధ్యంలో బ్రిక్ కూటమి దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్లిన ప్రధాని మన్మోహన్‌సింగ్ చైనా అధ్యక్షుడు హ్యూ జింటావోతో జరిపిన చర్చల్లో సహజంగానే వాణిజ్యం ప్రధాన చర్చనీయాంశం అయింది.
చైనా మన దేశానికి దిగుమతులు పెరుగుతున్నాయి తప్ప, అదే దామాషాలో మన దేశం నుంచి ఎగుమతులు పెరగడం లేదు. చైనా ఈశాన్య ప్రాంతంలోని సాన్యా నగరంలో ఏర్పాటైన “బ్రిక్’ కూటమి దేశాల శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు బీజింగ్ వెళ్ళిన ప్రధాని మన్మోహన్‌సింగ్ చైనా అధ్యక్షుడు హ్యూ జింటావోతో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెంపొందాల్సిన అవసరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనా నుంచి మన దేశానికి రెడీమేడ్ దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర నిత్యావసరాలు లెక్కకు మిక్కిలిగా దిగుమతి అవుతున్నాయి. అయితే, మన దేశం నుంచి సమాచార సాంకేతిక విప్లవానికి (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) సంబంధించిన సేవలను చైనా అదే స్థాయిలో పొందడం లేదు. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధం పటిష్ఠం కావలసిన అవసరం గురించి చైనీస్ నాయకులకు ప్రధాని స్పష్టం చేశారు. ఇరుగుపొరుగు దేశాలతో సరిహద్దు సమస్యలు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నప్పటికీ, సాధారణ సంబంధాలకు ఇవి అడ్డు రాకూడదన్న సదుద్దేశ్యంతో మన దేశం చైనా, పాక్‌లకు స్నేహ హస్తాన్ని అందిస్తోంది. ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు పాక్ ప్రధాని యూసఫ్ రజా గిల్‌ని ఢిల్లీకి ఆహ్వానించిన ప్రధాని మన్మోహన్‌సింగ్ ద్వైపాక్షిక సంబంధాల వృద్దికి తీసుకునే చర్యల గురించి చర్చించారు. అయితే, సమాన గౌరవం ప్రాతిపదికగా చర్చల ప్రక్రియ కొనసాగాలని మన దేశం పట్టుపడుతున్నది. ముంబై దాడుల సూత్రధారులను మన దేశానికి అప్పగించకపోయినా, పాక్ చట్టాల ప్రకారం వారిపై విచారణ జరిపి వారికి తగిన శిక్షలు పడేట్టు చూడాలని మన దేశం కోరుతున్నది. ప్రధాన సూత్రధారులైన హఫీజ్ మహ్మద్ సయీద్‌కీ, జియావూర్ రెహమాన్ లఖ్వీ వంటి సూత్ర ధారులకు పాక్ రహస్య గూఢచార సంస్థ ఐఎస్‌ఐ అండదండలు ఉండటం వల్ల వారు ఏదో ఒక సాకు చూపి తప్పించుకోగలుగుతున్నారు. అలాగే, చైనా కూడా మన దేశంతో మైత్రిని కొనసాగించాలన్నదే తమ లక్ష్యమని పదే పదే ప్రకటనలు చేస్తూ, మరో వంక పాకిస్థాన్‌కి చైనా విషయంలోనూ అంతే. అయితే,ఈ రెండు పొరుగుదేశాలూ భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల వృద్ధే తమ లక్ష్యమని పైకి చెబుతూ లోలోన కుట్రలూ, కుహకాలకు పాల్పడుతున్నట్టు తరచు వార్తలు వస్తున్నాయి. అదే నిజం కాకపోతే, జమ్ముకాశ్మీర్ పౌరులకు తాత్కాలిక వీసాలను చైనీస్ ప్రభుత్వం జారీ చేసి ఉండేది కాదు. అలాగే, ఆక్రమిత కాశ్మీర్‌లో విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సాయం అందించి ఉండేది కాదు. కాశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ వివాదాస్పద ప్రాంతమేనని అంతర్జాతీయ వేదికలపై సమయం వచ్చినప్పుడల్లా దండోరా మాదిరిగా బల్లగుద్ది మరీ వాదిస్తున్న పాక్ నాయకులకు వెన్నుదన్ను ఇవ్వడం కోసమే కాశ్మీరీ ప్రజలకు చైనా తాత్కాలిక వీసాలను జారీ చేస్తోంది.
అలాగే, ఆక్రమిత కాశ్మీర్‌లో విద్యుత్ కేంద్రాలకు సాయం అందించడం మనకు వ్యతిరేకంగా పాక్‌కి మద్దతు ఇవ్వడంగానే పరిగణించవలసి ఉంటుంది. పాకిస్థాన్‌తో అటు అమెరికా, ఇటు చైనా వ్యూహాత్మకంగా సంబంధాలు ఏర్పరుచుకున్నాయి. అయితే, ఈ సంబంధాలు భారత్‌కి వ్యతిరేకంగా ఏర్పరుచుకున్న సంబంధాలు కావని అవి స్పష్టం చేస్తున్నప్పటికీ, చేతలు అందుకు భిన్నంగా ఉండడం వల్ల మన దేశంలో అనుమానాలు వ్యక్తం కావడం అసహజం కాదు. చైనాతో మరో నాల్గేళ్ళలో వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకు పెరగాలన్న ఆకాంక్షను చైనా అధ్యక్షుడు జింటావోతో చర్చల సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యక్తం చేశారు.గతంలో ఆనాటి ప్రధాని వాజ్‌పేయి ఆయన ఆ పదవిలో కొనసాగినంత కాలం ద్వైపాక్షిక వాణిజ్యం పెంపు గురించి తరచు స్పష్టం చేస్తూ ఉండేవారు. మన్మోహన్‌సింగ్ గడిచిన ఏడేళ్ల నుంచి చేస్తున్నది కూడా అదే . అయితే, పాక్‌తో వాణిజ్యం పెంపుదల విషయంలో చూపిన చొరవ,ఆసక్తిని చైనీస్ నాయకులు మన దేశం విషయంలో ప్రదర్శించడం లేదు. అలాగే, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తావాంగ్ ప్రాంతం తమ అంతర్భాగమంటూ చైనీస్ నాయకులు తరచు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉంటారు. అలాగే, గత సంవత్సరం నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన పౌర హక్కుల నాయకుడు జియాబొని నార్వేకి వెళ్ళనివ్వకుండా నిర్బంధించిన చైనీస్ నాయకులు సమానహక్కులు, సమసమాజం గురించి ఉద్బోధ చేస్తూ ఉంటారు. పెట్టుబడీదారీ దేశంగా కమ్యూనిస్టు చైనా రూపాంతరం చెందుతోందనడానికి ఇవే నిదర్శనాలు.
No comments:
Post a Comment