Sunday, April 3, 2011

విశ్వ విజేత భారత్‌


జాతి తరించిపోయింది.... పులకించిపోయింది... ఉద్వేగంతో ఊగిపోయింది... పట్టరాని ఆనందంతో తన్మయత్వం చెందింది... మువ్వన్నెల జెండా గర్వంగా రెపరెపలాడింది... చరిత్ర పునరావృతమైంది. 1983 చరిత్రాత్మక ఘడియలను భారత్‌ మళ్లిd చవిచూసింది. శనివారం రాత్రి 10.47 గంటల వేళ... ప్రపంచంలోనే అతి పెద్ద సంచలనం భారత్‌ వాణిజ్య రాజధాని ముంబైలోని వాంఖేడ్‌ స్టేడియంలో జరిగింది. ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో భారత్‌ ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. 49వ ఓవర్‌... విజయానికి నాలుగు పరుగులు అవసరం. మొదటి బంతిని కులశేఖర సంధించాడు. యువీ సింగిల్‌ తీశాడు. రెండో బంతిని టీమిండియా సారథి ధోనీ సిక్సర్‌గా మలిచాడు. అంతే... స్టేడియం దద్దరిల్లింది. స్టేడియంలోని 36 వేల మందితో పాటు టీవీలకు అతుక్కుపోయిన జాతి జనుల కళ్లల్లో ఆనంద భాష్పాలు... ఉద్వేగంతో ఒకరికొకరు అభినందనలు... స్టేడియంలో నిరుత్తరులై లంకేయులు కుప్పకూలిపోగా, టీమిండియా ఆటగాళ్లందరూ కేరింతలతో ఆనంద భాష్పాలతో స్టేడియంలో కలియదిరిగారు. స్టేడియం గ్యాలరీలో నిండిపోయిన బాలీవుడ్‌ నటీనటులందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మురిసిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 181 దేశాల్లో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూసిన భారతీయులందరూ ధోనీ సాధించిన స్ట్రెయిట్‌ సిక్సర్‌ను మనసులో ముద్రించుకున్నారు. భారత్‌ గెలుపొందగానే పట్టరాని ఆనందంతో పెవిలియన్‌ నుంచి పరుగు పరుగున స్టేడియంలోకి వచ్చి సారథి ధోనీని భారత క్రికెట్‌ తాత సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌ గాఢంగా హత్తుకున్నాడు. తన జీవితేచ్ఛను సాధించిపెట్టిన ధోనీకి, సహచరులకు కృతజ్ఞతలు తెలిపాడు. టీమిండియా కప్‌ అందుకోగానే జాతి యావత్తూ వీధుల్లోకి వచ్చేసింది... సంబరాలు మొదలయ్యాయి... భూగోళంలోనే అతి పెద్ద పార్టీ మొదలైంది...
ముంబై: శతకోటి అభిమానుల కలలను సాకారం చేస్తూ టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. శనివారం ముంబైలోని వాంఖేడ్‌ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. మహేంద్ర సింగ్‌ ధోనీ, గౌతం గంభీర్‌ హీరోచిత బ్యాటింగ్‌తో జట్టును విశ్వవిజేతగా నిలిపారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మహేల జయవర్ధనే (103) అజేయ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 48.2 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడిన ధోనీ 79 బంతుల్లో 8ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 91 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు. మరోవైపు ఒత్తిడిలోనూ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన గంభీర్‌ (97) తనవంతు పాత్ర పోషించాడు. యువరాజ్‌ 24 బంతుల్లో 2ఫోర్లతో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ను జగజ్జేతగా నిలిపిన ధోనీకి మ్యాన్‌ ఆఫ్‌ది ఫైనల్‌ అవార్డు దక్కింది. ఇటు బంతితో, అటు బ్యాట్‌తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించిన యువరాజ్‌ సింగ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌ అవార్డు దక్కింది.
ప్రారంభంలోనే...
కష్టసాధ్యమైన లక్ష్యంతో బ్యాటింగ్‌ దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే కోలుకోలేని దెబ్బతగిలింది. మలింగ వేసిన ఇన్నింగ్స్‌ రెండో బంతికే సెహ్వాగ్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ ఖాతా తెరవకుండానే మొదటి వికెట్‌ కోల్పోయింది. ఆ వెంటనే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ (18) కూడా మలింగ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. దీంతో భారత్‌ 31 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకొంది. అయితే దశలో గంభీర్‌-కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించారు. ఇద్దరూ మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి (35) పరుగులు సాధించాడు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ ధోనీ కూడా కుదరుగా ఆడాడు. గంభీర్‌తో కలిసి జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 109 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు. అయితే 122 బంతుల్లో 9ఫోర్లతో 97 పరుగులు చేసిన గంభీర్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. గంభీర్‌ ఔటైనా యువీ అండతో ధోనీ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. చెలరేగి ఆడిన ధోనీ 79 బంతుల్లో 8ఫోర్లు, రెండు సిక్సర్లతో 91 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.
తడబడ్డారు...
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంకను జహీర్‌ హడలెత్తించాడు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెన్త్‌తో బౌలింగ్‌ చేసిన జహీర్‌ లంక ఓపెనర్లను కట్టడి చేశాడు. జహీర్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో తరంగ పూర్తిగా విఫలమయ్యాడు. జహీర్‌ వేసిన మూడు ఓవర్లలో ఒక పరుగు కూడా చేయని తరంగ (2) చివరికి అతని బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు. దీంతో లంక 17 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన సంగక్కర అండతో మరో ఓపెనర్‌ దిల్షాన్‌ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించాడు. ఇద్దరూ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే 49 బంతుల్లో 3ఫోర్లతో 33 పరుగులు చేసిన దిల్షాన్‌ను హర్భజన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో 43 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. సమన్వయంతో...
తర్వాత వచ్చిన మహేల జయవర్ధనేతో కలిసి సంగక్కర ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరూ సమన్వయంతో ఆడుతూ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ఫోర్లు కొడుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. దీంతో లంక స్కోరు 24 ఓవర్లలో 100 పరుగులకు చేరుకొంది. అయితే 67 బంతుల్లో 5ఫోర్లతో 48 పరుగులు చేసిన సంగక్కరను యువరాజ్‌ పెవిలియన్‌ పంపాడు. అప్పటికే అతను మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు.
మహేల జోరు...
మరోవైపు సంగక్కర ఔటైనా మహేల జయవర్ధనే జోరును కొనసాగించాడు. సమరవీర అండతో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వేగంగా ఆడిన మహేల 49 బంతుల్లో 6ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు సమన్వయంతో ఆడిన సమరవీర 34 బంతుల్లో 2ఫోర్లతో 21 పరుగులు చేసి యువీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 57 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామయానికి తెరపడింది. తర్వాత వచ్చిన కపుగెడర (1) వెంటనే ఔటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జయవర్ధనే వెనుకడుగు వేయలేదు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును ముందుకు నడిపించాడు. అతనికి కులశేఖర సహకారం అందించాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. సమన్వయంతో ఆడిన కులశేఖర 30 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌తో 32 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన జయవర్ధనే 84 బంతుల్లో 13ఫోర్లతో సెంచరీని పూర్తి చేశాడు. చివర్లో పెరీరా 9బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్స్‌తో చెలరేగడంతో లంక నిర్ణీత ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జహీర్‌, యువీ రెండేసి వికెట్లు పడగొట్టారు.

No comments:

Post a Comment