Saturday, April 16, 2011

కళ్లు తిరిగే సంపద!


  • జగన్‌ పేరిట ఆస్తులు రూ.365 కోట్లు
  • భార్య పేరిట మరో రూ. 41.33 కోట్లు
  • 2009లో ఆయన ఆస్తి రూ. 77 కోట్లు 
  • రెండేళ్లలో ఐదొందల శాతం పెరుగుదల
  • దేశంలోని టాప్‌టెన్‌ ఆస్తిపరులైన ఎంపిల్లో నలుగురు తెలుగువారే
హైదరాబాద్‌: ఒకప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా గుర్తింపులేని తెలుగోడంటే ఈనాడు ప్రపంచమే భయపడుతోంది. ఆర్థిక సంపదను వేగంగా సృష్టించడంలో తెలుగువారు ప్రపంచానికే సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు. కడప ఎమ్‌పి అభ్యర్ధిగా నామినేషన్‌ వేసిన జగన్‌ నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్‌కు తన సంపదల వివరాల్ని అందించారు. అధికారికంగా ఆయన ప్రకటించిన మేరకు ఆయన పేరిట 365కోట్ల సంపద ఉంటే ఆయన భార్య పేరిట 41.33కోట్ల ఆస్తులున్నాయి. జగన్‌కు వేలు, లక్షలకోట్ల సంపద ఉంటుందని ప్రజలంతా ఎప్పటి నుంచో ప్రగాడ విశ్వాసంతో ఉన్నారు. కానీ ఒక్కసారిగా కళ్ళుతిరిగిపోయే సంఖ్యను ఆయన తనంతతానుగా ప్రకటించడంతో ప్రజల కళ్ళుతిరిగాయి. 2009ఎన్నికల్లో ఆయన ప్రకటించిన సంపద మొత్తం 77కోట్లు కాగా ఇది రెండేళ్ళలోనే ఐదొందల శాతానికిపైగా పెరిగింది. గత ఏడాది ఆయన ఏకంగా 84కోట్ల అడ్వాన్స్‌టాక్స్‌ చెల్లించారు. జగనే కాదు. దేశంలోని ఎమ్‌పిల్లో అత్యధిక సంపదున్న పదిమందిలో నలుగురు తెలుగువారే. నామా నాగేశ్వరరావు 173కోట్ల ఆస్తులను ప్రకటిస్తే లగడపాటి రాజగోపాల్‌ వందకోట్లు, జి వివేక్‌ 73కోట్ల ఆస్తులున్నట్లు 2009
ఎన్నికల అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. ఎమ్‌పిల్లోనే కాదు. అంతర్జాతీయ మేగజైన్‌ ఫార్ట్యూన్‌ ప్రకటించే సంపన్నుల జాబితాలో కూడా ఎక్కువగా భారతీయులు, తెలుగువారే ఉంటున్నారు.
రాష్ట్రంలో రాజకీయ పారిశ్రామికవేత్తల ఆర్ధికాభివృద్ధి గత పదిపదిహేనేళ్ళలోనే వేగంగా సాగింది. ఇందుకు చంద్రబాబు ఆ తర్వాత వైఎస్‌ఆర్‌లు అనుసరించిన విధానాలే కారణం. కాకినాడ సీపోర్ట్స్‌ అధినేత కెవి రావు పదేళ్ళ క్రితం ఓ అతిసామాన్యుడు. ఆసియా బ్యాంక్‌ అప్పుతో నిర్మించిన పోర్టును చంద్రబాబు ఆయనకు గుత్తకిచ్చేయడంతో కెవి రావు నేడు ఆర్ధిక సంపన్నుడయ్యాడు. ముకేష్‌ అంబానీ, వారెన్‌ బఫెట్‌, బిల్‌గేట్స్‌, కార్లోస్‌ స్లిమ్‌లను దాటిపోతుంటే తెలుగు పారిశ్రామికవేత్తలు ముఖేష్‌ అంబానీని దాటిపోయే వేగంతో సంపదను వృద్ధి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలరంగంతోపాటు సెజ్‌లు, ఐటి, పోర్ట్‌లు సంపదను వేగంగా వృద్ధి చేసేందుకు మార్గాలుగాఉన్నాయి. ఒకప్పుడు పేదరికంతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌లో సంపద ఇంతవేగంగా పెరిగిపోవడం, దాన్ని కేవలం కొన్ని కుటుంబాలే సొంతం చేసుకోవడం ప్రజల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జగన్‌ ప్రకటించిన ఆస్తుల్ని సంప్రదాయకంగా ఎన్నికల కమిషన్‌ ఆమోదించినప్పటికీ వాస్తవ సంపద వివరాల్ని ఆదాయపన్నుశాఖ ప్రజలకు వివరించాల్సి ఉంది.

No comments:

Post a Comment