Friday, April 22, 2011

అక్షయ తృతీయ సందడి మొదలు


మే 6న ఆక్షయ తృతీయ. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందన్నది అనాదిగా వస్తున్న నమ్మకం. ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకుని అంతంతమాత్రంగా ఉన్న బంగారం అమ్మకాలను పెంచుకోవాలని ఆభరణాల తయారీదారులు, వ్యాపారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కస్టమర్లకు ఆకట్టుకునేందుకు పర్వదినానికి మూడు వారాల ముందు నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు.
ధరలు అధికమైనా సెంటిమెంట్‌పై వర్తకుల ఆశలు
రికార్డు స్థాయి అమ్మకాలు సాధ్యమేనంటున్న నిపుణులు
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు మంచి ఊపు మీద ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో 16,900 నుంచి 17,100 రూపాయల మధ్య ఉన్న 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 21 వేల రూపాయలను దాటి ఆల్‌ టైం రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. భవిష్యత్‌లో బంగారం ధరలు మరింతగా పెరగనున్నాయని, అందువల్ల ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారు ఇప్పుడు కొనిపెట్టుకున్నా మంచిదని విశ్లేషకులు సూచిస్తుండడంతో ఈ ఏటి అక్షయ తృతీయ అమ్మకాలు రికార్డు స్థాయిలను దాటవచ్చని అంచనా. బంగారం కొనుగోలుకు అత్యంత శుభదినంగా పరిగణిస్తున్న ఈ పర్వదినం రోజున ప్రజలను జ్యువెలరీ దుకాణాలవైపు నడిపించేందుకు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రత్యేక ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించింది.
డాలర్‌తో రూపాయి మారకపు విలువ గణనీయంగా మారుతున్న కారణంగా బంగారం ధరలు 35 శాతం వరకూ పెరగవచ్చని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ గత సంవత్సరం వేసిన అంచనాలు నిజమయ్యాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 21,500 నుంచి 21,700 రూపాయల మధ్య ఉన్న 10 గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర వచ్చే సంవత్సరం ఆక్షయ తృతీయ నాటికి 25 వేల రూపాయలను అధిగమిస్తుందని డబ్ల్యుజిసి అంచనా వేసింది. ఒక్క వివాహాల సీజన్‌లో మినహా నిన్నమొన్నటి వరకూ స్తబ్దుగా వున్న బంగారం అమ్మకాలు మే 6 తరువాత ఊపందుకుంటాయని మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 1400 డాలర్లను దాటి పయనిస్తున్న ఔన్సు బంగారం ధర ఈ సంవత్సరమే 1500 డాలర్లకు చేరవచ్చని అంచనా. అదే జరిగితే మన దేశంలో డాలర్‌తో మారకపు విలువలో ఒడిదుడుకుల కారణంగా 10 గ్రాముల బంగారం ధర 24 వేల రూపాయల వరకూ చేరే అవకాశాలున్నాయి. దీనికితోడు భారతీయ గృహిణుల నుంచి బంగారం కొనుగోలుకు వస్తున్న డిమాండ్‌ మరింతగా పెరగవచ్చని డబ్ల్యుజిసి అభిప్రాయపడింది.
గత కొన్ని సంవత్సరాలుగా బంగారంపై పెట్టే పెట్టుబడులు కూడా సంవత్సరానికి కనీసం 20 నుంచి 25 శాతం వరకూ రాబడులను ఇస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో సగటున సంవత్సరానికి 26 శాతం ధరలు పెరిగాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న 2008లో కూడా గోల్డ్‌ రేట్‌ 17 శాతం పెరిగింది. 2009లో సైతం బంగారం ధరలు పెరుగుతూనే వచ్చాయి. ఒక దశలో 18 వేల రూపాయల రికార్డు స్థాయిని దాటిన బంగారం ధర కెరెక్షన్‌ దిశగా పయనించినప్పటికీ, మరోసారి అదే స్థాయికి చేరింది. గ్రీకు మాంద్యం ప్రభావంతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తడి కొనసాగుతుండడంతో ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా బులియన్‌ అందరి కళ్ళనూ ఆకర్షిస్తోంది.
ఇదిలావుండగా, ఆక్షయ తృతీయ రోజున అమ్మకాలను పెంచుకునేందుకు ప్రముఖ రిటైల్‌ కంపెనీలు, ఆభరణాల తయారీ దారులు పెద్దఎత్తున డిస్కౌంట్లను ప్రకటిస్తున్నారు. పర్వదినం రోజున రద్దీని తట్టుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముందుగానే ఆభరణాలు ఎంచుకుని డబ్బు చెల్లించి 6న వచ్చి డెలివరీ తీసుకోవాలని సూచిస్తున్నారు. తమ షోరూంల నుంచి కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 25 శాతం వరకూ మేకింగ్‌ చార్జీలను తగ్గిస్తున్నామని, వజ్రాభరణాలపై 10 శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఆక్షయ తృతీయ కస్టమర్ల కోసం ఎన్నో డిజైన్లను సిద్ధం చేశామని కొన్ని సంస్థలు, చెన్నై కేంద్రంగా హైదరాబాద్‌లో దుకాణాలు నిర్వహిస్తున్న సంస్థలు మార్కెట్‌ రేటు కన్నా గ్రాముకు 100 రూపాయల వరకూ తక్కువ ధరకు ఆభరణాలు విక్రయిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ముందుగా బుక్‌ చేసుకుంటే ఆక్షయ తృతీయ రోజున మేళతాళాలతో ఇంటికి వచ్చి మరీ బంగారాన్ని డెలివరీ చేస్తామని ప్రకటించాయి. ఏదిఏమైనా బంగారానికి డిమాండ్‌ ఎల్లప్పుడూ ఉండే భారత్‌లో ఆభరణాల తయారీ సంస్థలు ఆక్షయ తృతీయను ఎంతమేరకు ఉపయోగించుకుని లబ్ది పొందుతాయన్నది మరో మూడు వారాల్లో తెలుస్తుంది.
- శ్రీనివాసకుమార్‌ మామిళ్ళపల్లి


పెరిగినా, తగ్గినా లాభం మీకే..!
పర్వదినం రోజున ఆఖరి సమయంలో రద్దీలో ఇబ్బందులు పడే వారికి ఆకర్షణీయమైన పథకాలు జ్యూయెలర్స్‌ ప్రకటించాయి. బుక్‌ చేసుకున్న రోజున ఉన్న బంగారం ధరకన్నా అక్షయ తృతీయ రోజు ధర తగ్గితే ఆ తేడా మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తామని ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో ధరలు పెరిగితే అదనపు సొమ్ము చెల్లించనక్కర్లేదని తెలియజేస్తున్నాయి. ఇదేదో బాగుంది కదూ..!

No comments:

Post a Comment