చెన్నై : డిఎంకె అధ్యక్షుడు కరుణానిధికి ఈసారి చెన్నైలో నూకలు చెల్లక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే... కోలీవుడ్ అంతా డిఎంకె పట్లు గుర్రుగా ఉంది. డిఎంకె కూడా వడివేలు వంటి కమెడియన్‌ను తనవైపు తిప్పుకున్నప్పటికీ డిఎంకె కుటుంబం నుంచి కోలీవుడ్‌ను రక్షించాలని సినీ ప్రపంచం కంకణం కట్టుకున్నట్లు తెలిసింది. కొడంబక్కం, వడపళని, టి నగర్, విరుగంబక్కం, వలసరవక్కం ప్రాంతాలలో డిఎంకెకు వ్యతిరేకంగా వర్డ్ ఆఫ్ మౌత్ ప్రచారం సాగుతోందని వినికిడి. 'డిఎంకె కబంధ హస్తాల నుంచి కోలీవుడ్‌ను కాపాడడానికి ఎఐఎడిఎంకెకు ప్రతిఒక్క వ్యక్తి తమ కుటుంబంలోని 10మంది సభ్యులు ఓటు వేసేలా చూడాలి' అని పేరు వెల్లడించడానికి నిరాకరించిన ఒక కెమేరామెన్ విజ్ఞప్తి చేస్తున్నారు. జీవితంలో డిఎంకెకు తప్ప మరెవరికీ ఓటు వేయని తంతై పరియార్‌కు తాను అనుచరుడనని, కానీ పరిస్థితులు ఇప్పుడు తనను ఎఐఎడిఎంకెకు ఓటు వేసేలా చేశాయని అతను పేర్కొన్నారు. డింఎంకె కుటుంబసభ్యులు కోలీవుడ్‌లోకి ప్రవేశించిన తరువాత, లో బడ్జెట్ సినిమాలు తీసేవారంతా మాయమైపోయారట. కోలీవుడ్ ఆగ్రహానికి అదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతేకాదు, తమిళనాడులోని మొత్తం 1300 సినిమా హాళ్ళలో చాలావరకు సినిమాహాళ్ళు, డిఎంకె సభ్యుల చేతిలోనే ఉన్నాయట. ఫలితంగా సినిమాల నిర్మాణాలనే చాలావరకు నిర్మాతలు వదులుకోవలసి వస్తున్నదట. దీనితో అనేకమంది జీవనోపాధి కోల్పోయారు. మరోపక్క షూటింగ్ సమయం తగ్గిపోవడం కూడా వారికి ఉపాధి కొరతకు దారితీస్తోంది. ఐదేళ్ళ క్రితం, ఏడాదికి కనీసం 250 రోజులపాటు షూటింగ్ జరిగేదని, కానీ ఇప్పుడు 100 రోజులకు మించి ఉండడం లేదని సినీ పరిశ్రమ ఉద్యోగి ఒకరు వాపోయారు. కొలీవుడ్‌కు భవిష్యత్తు కావాలంటే మాత్రం ఊకుమ్మడిగా ఎఐఎడిఎంకెకు ఓటు వేయవలసిందేనని నిర్మాత విజయ్ రాజ్ అంటున్నారు.
దక్షిణమే కీలకం!
మదురై : తమిళనాడు భవిష్యత్తును తేల్చి చెప్పేది తొమ్మిది జిల్లాలలోని 58 నియోజకవర్గాలే... దక్షిణ తమిళనాడులోని ఈ ప్రాంతాలు 2006 ఎన్నికలలో కూడా కీలకంగా నిలిచాయి. ఇప్పుడు, డిఎంకె, ఎఐఎడిఎంకె అభ్యుర్థుల భవితవ్యం ఈ ప్రాంతాల ఓటర్ల చేతుల్లో ఉందని చెప్పవచ్చు. కేంద్రమంత్రి, డిఎంకె దిగ్గజం ఎంకె అళగిరి ఒకపక్క ఈ ప్రాంతంలో మెజారిటీ సీట్లను సంపాదించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుండగా, ప్రతిపక్షం కూడా అంతే స్థాయిలో గెలుపునకు పావులు కదుపుతోంది. కాగా, ఈ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంత్రుల భవిష్యత్తు బుధవారం తేలనుంది. ఎం.జి. రామచంద్రన్ రాజకీయాలలోకి వచ్చినప్పటినుంచి మదురై, శివగంగ, థేని, దిండిగల్, రామనాథపురం, విరుధునగర్, ట్యుటికారిన్, తిరునల్వేలి, కన్యాకుమారి ప్రాంతాలు ఎఐఎడిఎంకెతోనే ఉండేవి. అయితే, అళగిరి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. 2006 ఎన్నికలే అందుకు నిదర్శనం. ఆ ఎన్నికలలో డిఎంకె-కాంగ్రెస్ కూటమి మొత్తం 63 స్థానాలకు 41 స్థానాలను గెలుచుకుంది. ఎఐఎడిఎంకె-ఎండిఎంకె కలపి 22 స్థానాలు గెలుచుకున్నప్పటికీ రామనాథపురం, కన్యాకుమారి జిల్లాలలో డిపాజిట్లు సైతం కోల్పోయాయి. లోక్‌సభ ఎన్నికలలో సైతం ఈ కూటమికి పరాభవం ఎదురైంది. మొత్తం పది స్థానాలకు ఒక స్థానం మాత్రమే ఈ కూటమి దక్కించుకోగలిగింది. ప్రస్తుతం ఈ 9 జిల్లాలలో34 నియోజకవర్గాలలో డిఎంకె, 17 స్థానాలలో కాంగ్రెస్, మిగతా ఏడు స్థానాలలో పిఎంకె, ఇతర చిన్న పార్టీలు పాటీ చేస్తున్నాయి. 24 నియోజకవర్గాలలో ఎఐఎడిఎంకె, డిఎంకె పోటాపోటీగా రంగంలో ఉన్నాయి. డిఎంకె నుంచి ఎలాగైనా తన అధీనంలోకి ఆయా ప్రాంతాలను తిరిగి తీసుకోవడానికి ఎఐఎడిఎంకె విశ్వ ప్రయత్నం చేస్తోంది. అళగిరి, ఆయన మద్దతుదారుల రౌడీయిజంతో మదురై ప్రజలు విసిగిపోయారని, ప్రజలు మార్పు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని ఎఐఎడిఎంకె మదురై జిల్లా కార్యదర్శి సెల్లూర్ కె. రాజు అంటున్నారు. మరోపక్క, అళగిరి కృషికి ఈ అసెంబ్లిd ఫలితాలు తప్పకుండా ప్రతిరూపంగా ఉంటాయని డిఎంకె మదురై జిల్లా కార్యదర్శి తలపతి అంటున్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం పట్టణ ఓటర్లపైనే కాని, గ్రామీణ ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడంలేదు. కాగా, కులం ఓటు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగానే ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. దళితులు, నదర్ ఓట్లు కీలకం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది ఇలా ఉండగా బిజెపి తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది.
'ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలి'
చెన్నై : తమిళనాడులో ఎన్నికలు సజావుగా, శాంతియుతంగా జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్‌కు ఎఐఎడిఎంకె అధ్యక్షురాలు జయలలిత మంగళవారం విజ్ఞప్తి చేశారు. బుధవారం పోలింగ్ సందర్భంగా డిఎంకె అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని ఆమె అనుమానంవ్యక్తం చేశారు. ఓటర్లకు డబ్బు పంపిణీని అడ్డుకున్నందుకు ఎఐఎడిఎంకె కార్యకర్తలపై డిఎంకె జరిపిన దాడిలో మదతుకులం నియోజకవర్గం అభ్యర్థి షన్మగవేలు, ఇతరులు గాయపడిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు, డిఎంకె చేతిలో పెన్నగరం వద్ద డిఎండికె కార్యకర్త అశోకన్ హత్యకు గురైన విషయాన్ని ఆమె ఈసందర్భంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని కేంద్ర బలగాలను మోహరించాలని ఆమె ఎన్నికల కమిషన్‌కు, ఛీఫ్ ఎలక్టొరల్ అధికారికి, డిజిపికి విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment