నోయిడా : ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ బాహ్యప్రపంచంలో విహరించాలని అందరూ కోరుకున్నారు. విధి వక్రించింది. వారిలో ఒక యువతి వైద్యచికిత్సలు పొందుతూ మృతిచెందింది. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ ఘటన మానవతాహృదయుల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇది నోయిడాలో చోటుచేసుకున్న ఘటన. తల్లిదండ్రుల మృతితో మానసిక క్షోభకు గురై ఏడుమాసాలుగా అనూరాధ (40), సోనాలి(38) ఇద్దరూ తమ ఇంట్లోనే స్వీయనిర్బంధంలోనే వున్నారు. వీరిని పోలీసుల సహాయంతో మంగళవారంనాడు బాహ్యప్రపంచంలోకి తీసుకువచ్చారు. అయితే బాహ్యవాతావరణం పడక అనారోగ్యానికి గురయ్యారు. అనూరాధ బుధవారం 8 గంటల సమయంలో మృతిచెందింది. సోనాలి ఆరోగ్యపరిస్థితి కూడా క్లిష్టంగానే వుందని కైలాస్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమిత్ తెలిపారు. అనూరాధ మృతికి కారణాలేమిటో తామిప్పడే చెప్పలేమని, పోస్టుమార్టం అనంతరం నివేదికలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని కైలాస్ ఆస్పత్రి అధికార ప్రతినిధి వి.వి.జోషి తెలిపారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనలో న్యాయపరమైన అంశాలు ఉన్నందున కేసు దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు స్థానిక సిటీ మెజిస్ట్రేట్ నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా పోలీసులకు అందినట్లు అధికార వర్గాల సమాచారం. మహిళా కమిషన్ కూడా ఈ ఘటనపై విచారణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏడుమాసాలుగా స్వీయనిర్బంధంలో ఉండటం... తదనంతర పరిణామాలన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పోలీసులకు నోయిడా సిటీ మెజిస్ట్రేట్ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. మానసిక క్షోభకు గురై... ఏడుమాసాలుగా స్వీయనిర్బంధంలో వుంటూ శారీరకంగా కూడా కృంగిపోయిన వారికి సరైన వైద్యచికిత్సలు అందించలేకపోయారని... అలాగే ఆకలితో మాడిపోయి ఉన్న వారికి అందించాల్సిన వైద్యచికిత్సలు అందించడంలో విఫలమయ్యారని, దాంతోనే అనూరాధ మృతి చెంది ఉంటుందని పలువురు వైద్యనిపుణులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
No comments:
Post a Comment