Sunday, April 3, 2011

బంగారానికి పెరగనున్న డిమాండ్‌


  • 2020 నాటికి 1,200 టన్నుల వాడకం

న్యూఢిల్లి: వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌ బంగారానికి డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అభిప్రాయపడింది. 2020 నాటికి సాలీనా 1,200 టన్నుల బంగారానికి డిమాండ్‌ ఉంటుందని, ప్రస్తుత ధరల ప్రకారం 2.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని డబ్ల్యుజిసి విడుదల చేసిన తాజా రీసెర్చ్‌ వెల్లడించింది. 2011లో మొత్తం 980 టన్నుల బంగారం దిగుమతి అయిందని, 2020లో దీనికి 33 శాతం అదనంగా ఇంపోర్ట్‌ అవుతుందని భావిస్తున్నామని డబ్ల్యుజిసి మిడిల్‌ ఈస్ట్‌, ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ మిత్రా వ్యాఖ్యానించారు. భారత్‌లో జిడిపి వృద్ధికి సమాంతరంగా బంగారానికి డిమాండ్‌ పెరుగుతుందని ఆయన అన్నారు. తలసరి ఆదాయం పెరగడం, పట్టణీకరణ, వినియోగదారుల్లో సేవింగ్స్‌ పెరుగుతుండడం వంటి కారణాలతో ప్రజలు స్వర్ణాభరణాల కొనుగోలుకు మద్దతు పలుకుతున్నారని ఆయన అన్నారు.
2010లో 963 టన్నుల బంగారం వినియోగం కాగా, 2011లో అది 980 టన్నులకు పెరిగిన సంగతి తెలిసింద. దేశంలో వాడుతున్న బంగారంలో 75 శాతం ఆభరణాల రూపంలోకి మారుతోంది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో బంగారానికి మంచి డిమాండ్‌ ఉండగా, 40 శాతం ఆభరణాల అమ్మకాలు నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి జరుగుతున్నాయి. భారత్‌లోని జనాభాలో 25 సంవత్సరాలలోపు వయస్సున్న వారు సగం మంది వరకూ ఉన్నారని, వచ్చే దశాబ్ద కాలంలో 15 కోట్ల పెళ్ళిళ్ళు జరుగుతాయని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పెళ్ళిళ్ళలో కనీసం 500 టన్నుల బంగారానికి డిమాండ్‌ ఉంటుందని అన్నారు. దీనికి అదనంగా మరో 500 టన్నుల బంగారం ఒక కుటుంబం నుంచి మరో కుటుంబానికి బహుమతి రూపంలో వెడుతుందని భావిస్తున్నట్టు వివరించారు. 

No comments:

Post a Comment