Friday, April 22, 2011

గేల్‌ విధ్వంసం... బెంగళూరు 'రాయల్‌' గెలుపు


కోల్‌కతా: వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. క్రిస్‌గేల్‌ (102 నాటౌట్‌) విధ్వంసక సెంచరీ సాధించడంతో 172 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు మరో 11 బంతులు మిగిలివుండగానే కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. యూసుఫ్‌ పఠాన్‌ (46), గంభీర్‌ (48), కలిస్‌ (40) పరుగులు సాధించి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించారు. కాగా, అజేయ సెంచరీతో బెంగళూరును గెలిపించిన గేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
గేల్‌ విశ్వరూపం...
భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌కు ఓపెనర్లు దిల్షాన్‌, గేల్‌ శుభారంభం అందించారు. ప్రారంభంలో దిల్షాన్‌ చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. మరోవైపు ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే గేల్‌ చెలరేగి పోయాడు. తొలి బంతి నుంచే కోల్‌కతా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. తన పాత ఫ్రాంచైజీ రైడర్స్‌ కసి తీర్చుకుంటున్నాడా అనే విధంగా గేల్‌ చెలరేగి పోయాడు. దీంతో ఈడెన్‌లో పరుగుల వరద పారింది. ఇద్దరూ పోటీపడి షాట్లు కొట్టడంతో బెంగళూరు స్కోరు 5.3 బంతుల్లోనే 50 దాటింది. తర్వాత గేల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి పోయాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడిన గేల్‌ 29 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఇదే క్రమంలో స్కోరును 100 పరుగులు దాటించాడు. మరోవైపు కుదురుగా ఆడిన దిల్షాన్‌ 31 బంతుల్లో 6ఫోర్లతో 38 పరుగులు చేసి బాలాజీ బౌలింగ్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 123 పరుగు తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన కోహ్లి అండతో గేల్‌ తన ప్రతాపాన్ని కొనసాగించాడు. ఇద్దరూ వేగంగా ఆడుతూ జట్టును లక్ష్యం వైపు తీసుకెళ్లారు. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన గేల్‌ 50 బంతుల్లోనే 10ఫోర్లు, 7సిక్సర్లతో సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు కోహ్లి కూడా చెలరేగి ఆడాడు. 23 బంతుల్లోనే 3ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. గేల్‌ (102) పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు అబేధ్యంగా 52 పరుగులు జోడించారు. దీంతో బెంగళూరుకు టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. కాగా, కోల్‌కతాకు ఇది వరుసగా రెండో ఓటమి. కొచ్చితో జరిగిన మ్యాచ్‌లోనూ గంభీర్‌ సేన ఓటమి పాలైన విషయం తెలిసిందే.
శుభారంభం...
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతాకు ఓపెనర్లు కలిస్‌, హడిన్‌ శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలోనే 44 పరుగులు జోడించారు. జహీర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే కలిస్‌ 3ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో జట్టుకు 19 పరుగులు లభించాయి. మరోవైపు చెలరేగి ఆడిన హడిన్‌ 11 బంతుల్లోనే 2ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. తర్వాత వచ్చిన గంభీర్‌ చెలరేగి ఆడాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడిన గంభీర్‌ 36 బంతుల్లోనే 6ఫోర్లతో 48 పరుగులు సాధించాడు. సమన్వయంతో ఆడిన కలిస్‌ 42 బంతుల్లో 4ఫోర్లతో 40 పరుగులు చేశాడు. చివర్లో యూసుఫ్‌ పఠాన్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. చెలరేగి ఆడిన పఠాన్‌ 24 బంతుల్లో 3సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 46 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించాడు.
స్కోరుబోర్డు
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌: కలిస్‌ (సి) క్రిస్‌ గేల్‌ (బి) వెటోరీ 40, బ్రాడ్‌ హాడిన్‌ (సి) కోహ్లి (బి) సయ్యద్‌ మహ్మద్‌ 18, గౌతమ్‌ గంభీర్‌ (సి) దిల్షాన్‌ (బి) అరవింద్‌ 48, యూసుఫ్‌ పఠాన్‌ (సి) కోహ్లి (బి) అరవింద్‌ 46, ఇయాన్‌ మోర్గన్‌ (రనౌట్‌) 6, సౌరబ్‌ తివారి (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 13, మొత్తం 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు.
వికెట్ల పతనం: 1-44, 2-102, 3-139, 4-169, 5-171.
బౌలింగ్‌: జహీర్‌ ఖాన్‌ 4-0-53-0, అరవింద్‌ 3-0-37-2, సయ్యద్‌ మహ్మద్‌ 4-0-20-1, దిల్షాన్‌ 2-0-15-0, విరాట్‌ కోహ్లి 1-0-9-0, డానియల్‌ వెటోరీ 4-0-28-1, క్రిస్‌ గేల్‌ 2-0-9-0.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: దిల్షాన్‌ (బి) లక్ష్మిపతి బాలాజీ 38, క్రిస్‌ గేల్‌ (నాటౌట్‌) 102, విరాట్‌ కోహ్లి (నాటౌట్‌) 30, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం 18.1 ఓవర్లలో 175/1.
వికెట్ల పతనం: 1-123.
బౌలింగ్‌: యూసుఫ్‌ పఠాన్‌ 3-0-25-0, లక్ష్మిపతి బాలాజీ 4-0-43-1, ఉనాద్కత్‌ 3-0-24-0, సాకిబ్‌ అల్‌ హసన్‌ 2.1-0-29-0, భాటియా 3-0-28-0, సౌరబ్‌ తివారి 1-0-14-0, ఇక్బాల్‌ అబ్దుల్లా 2-0-12-0.

No comments:

Post a Comment