Tuesday, April 5, 2011

సమాజంలో మార్పు తెచ్చే 'దుశ్శాసన'


సమాజం బాగుపడాలంటే ఏ సిస్టమ్‌లో వెళ్ళాలనే అంశాన్ని విశ్లేషిస్తూ, 'దుశ్శాసన' చిత్రాన్ని మలుస్తున్నామని దర్శకుడు పోసాని కృష్ణమురళి తెలిపారు. టైటిల్‌ పాత్రను శ్రీకాంత్‌ పోషించగా, పోసాని దర్శకత్వంలో లాఫింగ్‌లార్డ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యన్‌.మురళీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సంజన, తషుకౌశిక్‌ నాయికలు. కాగా షూటింగ్‌ పార్ట్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనుల్లోవుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పోసాని మాట్లాడుతూ, 'ఇదే నెలలో సినిమాను విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తున్నాం. ఇది పూర్తి క్లీన్‌ చిత్రం. ఎలాంటి అభ్యంతకర సన్నివేశాలు ఇందులో ఉండవు. రూల్స్‌ను అతిక్రమించకుండా నడుచుకుంటే సమాజం ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు సమాజం బాగుపడటానికి ఏంచేశారన్నది చెప్పడంకంటే చిత్రం చూసి తెలుసుకుంటే బాగుంటుంది. కొన్ని వెబ్‌సైట్‌లలో రాసినట్లు ఒక ప్రముఖ నటుడ్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ సినిమాను రూపొందించలేదు' అని చెప్పారు.
కథానాయకుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ, 'పోసాని దర్శకత్వంలో 'ఆపరేషన్‌ దుర్యోధన' చిత్రం చేసిన నేను ఆయన దర్శకత్వంలో ఆ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇలాంటి చక్కటి సామాజిక ఇతివృత్తం కలిగిన చిత్రాలు చేస్తున్నందుకు ఓ నటుడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రంలోని పాత్రకు కూడా నాకెంతో పేరు వస్తుందన్న నమ్మకముంది' అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, చలపతిరావు, బ్రహ్మానందం, కృష్ణభగవాన్‌, కొండవలస తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎ.రాజా, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, నిర్మాణ నిర్వహణ: రామసత్యనారాయణ, నిర్మాత: మురళీకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పోసాని కృష్ణమురళి.

No comments:

Post a Comment