- కొత్త చర్చకు దారితీస్తున్న ఐక్య ఫ్రంట్ ప్రతిపాదన
- జెఎసి, ప్రజాఫ్రంట్‌లనూ విలీనం చేస్తారనే అభిప్రాయాలు
- నాగం,కెకె, యాష్కీ, వివేకలే తీరుపై సొంత పార్టీల్లోనే అసంతృప్తి
- కొత్త ఫ్రంట్ నేతకు అందరి మద్దతు అనుమానమే
హైదరాబాద్ : తెలంగాణ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను సంఘటితం చేసే దిశగా ఐక్య ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదన కొత్త చర్చకు దారితీస్తోంది. రాజకీయ పార్టీల జెండాలు, అజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉద్యమంలో కలసి రావాలని తెలంగాణ వాదులు ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రజల్లో ప్రగాఢంగా ఉన్న ఆకాంక్షను నెరవేర్చడంలో రాజకీయ పార్టీలు ఇప్పటికే విఫలమయ్యాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నేతలతో ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఇటీవల కొత్తగా తెరపైకి వచ్చింది. ఇదే గనక కార్యరూపం దాలిస్తే ఇప్పటికే తెలంగాణ సాధన ధ్యేయంగా పని చేస్తున్న రాజకీయ జెఎసి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జెఎసి కూడా కొత్తగా ఏర్పాటు కానున్న ఐక్య ఫ్రంట్‌లో విలీనం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ఆమోదం అవసరమని చేసిన ప్రకటనతో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాజకీయ జెఎసి ఆవిర్భవించింది. జెఎసిలో అధికార కాంగ్రెస్‌తో పాటు తెరాస, తెదేపా, భాజపా భాగం కాగా, తెలంగాణ ఏర్పాటు కావాలంటే కేంద్రంపై
ఒత్తిడి తేవడానికి రాజీనామాలే ఏకైక మార్గమని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విభేదించిన కాంగ్రెస్, తెదేపాలు జెఎసి నుంచి వైదొలిగాయి. అప్పటి నుంచి జెఎసిలో కేవలం తెరాస మాత్రమే కీలక పాత్ర పోషిస్తోంది. ఒక దశలో జెఎసిని తెర వెనక నుంచి తెరాస ప్రభావితం చేస్తోందని తెదేపా, కాంగ్రెస్‌లు ఆరోపించాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం, తెరాస, భాజపా మినహా మిగతా అన్ని పార్టీలలోని తెలంగాణ కోరుకునే ప్రజా ప్రతినిధులు అనుకూలంగా, వ్యతిరేకించే వారు సమైక్యాంధ్రనే కావాలంటూ వినతిపత్రాలు సమర్పించారు. కమిటీ గడువు ముగిసి కేంద్రానికి నివేదిక సమర్పించడం, తెలంగాణ ఏర్పాటుపై కచ్చితంగా ప్రతిపాదించకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నివేదికలోని 8వ చాప్టర్‌ను కమిటీ రహస్యంగా ఉంచడంతో, దీనిని బహిర్గతం చేయాలని దాఖలైన పిటిషన్‌కు స్పందించిన హైకోర్టు దానిని బహిర్గతం చేయాలని ఆదేశించడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు తీసుకొచ్చింది. తెలంగాణ ఏర్పాటైతే హిందూ-ముస్లిం మత కల్లోలాలు పెరుగుతాయనీ, నక్సల్స్ సమస్య ఎక్కువవుతుందని ఇందులో ప్రధానంగా ఉన్నట్లు మీడియా ద్వారా వెల్లడైంది. తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమం ఉధృతం కాకుండా అణచి వేసేందుకు మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కమిటీ నివేదికలోని 8వ చాప్టర్‌లో పొందిపరచినట్లు సైతం జోరుగా ప్రచారం జరిగింది. ఈ దశలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయంతో కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ దశలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అన్ని రాజకీయ పార్టీలలోని తెలంగాణ ప్రజాప్రతినిధులతో పాటు ప్రజా సంఘాలను ఏకం చేసేందుకు నడుం బిగించింది. తాజాగా ఫోరం ఏర్పాటు చేసిన సమావేశంలో హాజరైన కాంగ్రెస్, తెదేపా, తెరాస ప్రజాప్రతినిధులు పార్టీల జెండాలు, అజెండాలకు అతీతంగా తెలంగాణ కోసం ఏకం కావాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఫ్రంట్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అవసరమైతే రాజీనామాలు చేయమని ఆదేశిస్తూ అందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. దీనికితోడు తాజాగా కాంగ్రెస్ ఎంపి మధుయాష్కీ కూడా మరికొద్ది రోజుల్లోనే మరోమారు సమావేశమై ఐక్య ఫ్రంట్ ఏర్పాటుకు తుది రూపు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో, తెలంగాణ కోసం మరో ఐక్య ఫ్రంట్ ఏర్పాటైతే ప్రస్తుతం అదే లక్ష్యంతో పని చేస్తున్న తెలంగాణ రాజకీయ జెఎసి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోపైపు రాజకీయ జెఎసి, తెలంగాణ ప్రజా ఫ్రంట్, విమలక్క ఆధ్వర్యంలోని టియుఎఫ్‌లను విలీనం చేసి ఐక్య ఫ్రంట్ ఆవిర్భవించే అవకాశముందని తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు.
కాగా, కొత్తగా ఏర్పాటు కానున్న ఫ్రంట్‌లో భాగస్వాములు కావాలని ఉవ్విళ్లూరుతున్న తెదేపా నేత నాగం, కాంగ్రెస్ నేతలు కెకె, మధుయాష్కీ, వివేక్‌ల వ్యవహార శైలిపై వారి సొంత పార్టీల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నాగం అసలు ఎవరిని సంప్రదించి కొత్త ఫ్రంట్‌లో భాగస్వామి కావాలని చూస్తున్నారనీ, పిఎసి పదవిని సైతం కోల్పోవడంతో సొంత మనుగడ కోసమే ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన మోత్కుపల్లి, రేవంత్‌రెడ్డి, వెంకటవీరయ్య వంటి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవల కాంగ్రెస్‌లో పార్టీపరంగా చోటు చేసుకున్న సంస్థాగత మార్పుల్లో సిడబ్ల్యుసి సభ్యత్వాన్ని కోల్పోయిన కెకె, విదేశాలకు అక్రమంగా వెళ్లారని అమెరికాతో పాటు స్వదేశంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటూ చట్టపరంగా రేపోమాపో అవి రుజువయ్యే అవకాశముందని భావిస్తున్న మధుయాష్కీ తమ సమస్యల నుంచి గట్టెక్కేందుకే తెలంగానం అందుకుంటున్నారన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం పొలిటికల్ జెఎసి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం ఒకవేళ కొత్త ఫ్రంట్‌కు చైర్మన్‌గా ఎంపికయ్యే పక్షంలో పూటకొకటిగా విస్తరిస్తున్న విద్యార్థుల జెఎసిలు ఆయనను విమర్శించే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని జెఎసి నేతగా ఎదిగిన ఆయనపై ఒయు విద్యార్థులలో కొందరిని కోటరీగా ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతుండటం, మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల విధ్వంసం ఆయన కారణంగానే జరిగిందన్న ఆరోపణలకు ఇంకా సమాధానం లభించలేదు. ఇక కొత్త ఫ్రంట్‌లో చేరిక విషయంపై భాజపాలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన విద్యాసాగరరావు మాత్రమే ప్రస్తుతం కొంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. టాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల కూల్చివేత ఇప్పటికే మాయని మచ్చగా మిగిలిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో బద్ధ శత్రువుగా భావించే కాంగ్రెస్ పార్టీతో ఎలా కలసి పని చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ సాధన దిశగా ఒకవేళ కొత్తగా ఐక్య ప్రంట్ ఏర్పాటు జరిగినప్పటికీ దానికి నేతృత్వం వహించేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి లభించడం కష్టమేనన్నది పలువురి అభిప్రాయంగా ఉంది. మొత్తం ఏ రకంగా చూసినా ఐక్య ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదన్న సందేహం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
నేడు తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ భేటీ
భవిష్యత్తు కార్యాచరణ ఖరారు కోసం తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఇటీవల జెఎసి ప్రకటించిన కార్యక్రమాలు 14తో పూర్తవుతున్న నేపథ్యంలో ఆ తరువాత ఎలాంటి కార్యాచరణ ప్రకటించాలనే విషయంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఢిల్లిdలో తెలంగాణ జెఎసి శాఖ ఏర్పాటు, భాజపా అగ్ర నేతలను కలిసే విషయంపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని తెలిసింది.
No comments:
Post a Comment