గాంధీ పుట్టిన గుజరాత్‌లో మత ఘర్షణలు చోటు చేసుకుని తొమ్మిదేళ్ళు దాటినా అవి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పీడకలల్లా వెంటాడుతున్నాయి. కేంద్రాన్నీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలనూ కుదిపేస్తున్న అవినీతిని అదుపు చేయగలిగిన పాలకునిగా, గుజరాత్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న మోడీని ఆనాటి ఘర్షణలు ఇప్పటికీ వెంటాడటం దురదృష్టకరమే. గుజరాత్ అల్లర్లలో మోడీకి ప్రమేయం ఉందని గతంలో శ్రీకుమార్ వంటి పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారాన్ని తలదన్నే రీతిలో సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ భట్ శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ని దాఖలు చేశారు. ఆనాటి అల్లర్ల వెనుక మోడీకి ప్రమేయం ఉందని ఆ అఫిడవిట్‌లో సంజీవ భట్ పేర్కొన్నారు. ఆనాటి అల్లర్లపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మీద నమ్మకం లేనందున వాస్తవాలను తెలియజేసేందుకు ఆయన ఈనెల 14వ తేదీన ఈ అఫిడవిట్‌ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఇప్పటికీ ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతున్న తాను ఇలాంటి సున్నితమైన అంశాలను బహిరంగంగా మాట్లాడటం సబబు కానందున అఫిడవిట్ దాఖలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల దగ్ధం సంఘటనకు ప్రతీకారంగా గుజరాత్ అంతటా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. వందలాది మంది ప్రజలు ఊచకోతకు గురి అయ్యారు. ఆనాటి సంఘటనలు తలుచుకుంటేనే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడిచే అంత తీవ్రమైనవని, తాను ప్రభుత్వ సర్వీసులో ఉన్నందున ఆనాటి సంఘటనల గురించి సుప్రీంకోర్టుకు తెలియజేసానని ఆయన చెప్పారు. 2002 ఫిబ్రవరి 27వ తేదీన మోడీ నిర్వహించిన ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సమావేశానికి సంజయ్ భట్ హాజరయ్యారు. గోద్రా సంఘటనపై చెలరేగిన ప్రతీకార జ్వాలలను చల్లార్చవలసిన బాధ్యత ప్రభుత్వాధినేతగా నరేంద్ర మోడీపై ఉంది. అయితే, ఆనాటి సమావేశంలో మోడీ చేసిన ప్రసంగం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని భట్ పేర్కొన్నారు. ఆగ్రహంతో ఉన్న హిందువులను అడ్డుకోవద్దనీ, ముస్లింలకు తగిన గుణపాఠం చెప్పనివ్వండి అని మోడీ పోలీసు అధికారులను ఆదేశించినట్టు భట్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. మోడీ మీద మచ్చ పడేట్టు చేసింది ఇదే. మోడీ బిజెపి నాయకుడైనప్పటికీ, ఆయనపై ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆగ్రహం వ్యక్తం చేసి తన నిష్పాక్షికతను రుజువు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా మోడీ రాజధర్మాన్ని పాటించలేదంటూ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్య అప్పట్లో అధికార బిజెపిలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. అదే వ్యాఖ్య మరొకరెవరో చేసి ఉంటే ఎవరూ పట్టించుకుని ఉండేవారు కారు. వాజ్‌పేయి బిజెపిలో తిరుగు లేని నాయకుడుగా ఉన్నందున ఆయనకు ఎవరూ ఎదురు చెప్పలేదు కానీ,పార్టీలో మాత్రం కలకలం రేపింది. ఆ తరువాత పార్టీ వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వాజ్‌పేయి అంతటి నాయకుడు మోడీని ప్రశంసించవలసి వచ్చింది. మోడీ మీద వెల్లువెత్తిన ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం అదే వాజ్‌పేయి చేత కమలనాథులు బలవంతంగా ఆ ప్రకటన చేయించారన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. గుజరాత్ అల్లర్లకు సంబంధించి వివిధ కేసుల దర్యాప్తును తూతూ మంత్రంగా జరిపించి నిందితులను వదిలేశారన్న ఆరోపణ కూడ మోడీ మీద వచ్చాయి. ఇప్పుడు సంజీవ భట్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నవి కొత్త విషయాలు కాకపోయినా, పాత గాయాన్ని మరోసారి రేపేరీతిలో ఉంది ఆ అఫిడవిట్. ఈ సంఘటనలు జరిగిన తరువాత గుజరాత్‌లో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి, రెండు సార్లూ కూడా మోడీ నేతృత్వంలోని బిజెపియే తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే, మోడీలోని మత చాందసుణ్ణి వామపక్షాల వారూ, లౌకిక ప్రజాస్వామ్య వాదులు ఇప్పటికీ చూస్తుండగా, రాష్ట్ర ప్రజలు మాత్రం ఆయన పాలనా దక్షతనూ, రాష్టాభివృద్ధికి ఆయన సేవలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకే, ఆయన నాయకత్వం పట్ల పదే పదే తమ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు.'వైబ్రంట్ గుజరాత్' పేరిట మోడీ ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన పారిశ్రామిక వేత్తల సదస్సులో రెండు లక్షల కోట్ల రూపాయిల మేరకు పెట్టుబడులను రాష్ట్రానికి సంపాదించగలిగారు. ఇది సామాన్యమైన విషయం కాదు.
అంతేకాక, గుజరాత్‌లో అవినీతి అసలు లేదనడం అసత్యమవుతుంది కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాట అటుంచి బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటి కన్నా గుజరాత్‌లో తక్కువ అవినీతి ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.కృష్ణా గోదావరి బేసిన్‌లో చమురు అన్వేషణకు గుజరాత్ ఆయిల్ కార్పొరేషన్ చొరవ తీసుకుని వచ్చి అంచనాలకు మించిన లాభాలను మూటగట్టుకుని వెళ్ళడానికి మోడీ చూపిన చొరవే ప్రధాన కారణం. అందుకే, మోడీని దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి అంటూ బిజెపి అగ్రనాయకుడు అద్వానీ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశంసిస్తూ ఉంటారు. అలాగే, సొహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ విషయంలో కూడా మోడీ మీద మచ్చ పడింది. మోడీని లౌకిక వాద పార్టీలు, వామపక్షాలే కాక, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు కూడా దూరంగా ఉంచుతున్నాయి. గత సంవత్సరం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోడీని తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకుండా జనతాదళ్(యు) నాయకుడు, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బిజెపి కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇప్పుడు సంజీవ భట్ వెల్లడించిన అంశాలు మోడీని మరింత వివాదాస్పదుణ్ణి చేస్తాయి. ఒక వంక పాలనా దక్షునిగా, మరో వంక మత చాందసునిగా మోడీ ఇప్పటికే పేరొందారు, అయితే, ఆయన ఇలాంటి విమర్శలూ, ఆరోపణలనూ ఖాతరు చేయకుండా తన మార్గాన తాను పని చేసుకుని పోతున్నారు. నవ గుజరాత్ నిర్మాతగా ఆయన ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపధ్యంలో సంజీవ భట్ చేసిన ఆరోపణల ప్రభావం ఏమేరకు ఉంటుందనేది వేచి చూడవలసిందే.
No comments:
Post a Comment