Friday, April 22, 2011

ప్రకృతీ విలపిస్తోంది బాబా..క్షణమొక యుగంగా..


  • మరింత బలహీనమైన హృదయ స్పందన 
  • పూర్తిగా క్షీణించిన కిడ్నీల పనితీరు 
  • ట్రస్ట్‌ కీలక సమావేశం 
  • ప్రశాంతి నిలయం పరిసరాల్లో రెడ్‌ అలర్ట్‌ 
  • అశేషంగా తరలివస్తున్న భక్తజనం
శ్లోకంలో శోకం... వేదంలో ఖేదం
ఏమిటీ పరీక్ష... ఎవరికీ విషమ పరీక్ష?
బాబా భౌతిక దేహానికా, ఆధ్యాత్మిక మనుగడకా?
సర్వం సాయిమయమని విశ్వసించిన
భక్తజన కోటి మూగగా రోదిస్తోంది...
దీనికి ప్రకృతి కూడా అకాల వర్షాలతో జత కలుస్తోంది..
గంటగంటకూ విడుదలవుతున్న హెల్త్‌ బులెటిన్లు
భక్తుల గుండెల్లో పిడుగులు రాలుస్తున్నాయి
అటు ఆకాశంలో ఉరుములు, మెరుపులతో వడగళ్లు కురుస్తున్నాయి
ఇంతటి విషాదం మధ్య దైవత్వాన్నే ప్రశ్నిస్తూ
తీతువు పిట్టలు కూస్తున్నాయి-
నిషాదోన్మాద శక్తులు ధర్మసూక్ష్మాన్ని అవహేళన చేస్తున్నాయి!
ఆ దేహం నీది కాదని వారికెలా చెప్పేది?
ఈ సందేహం నుంచి భక్తులనెలా ఒప్పించేది??
పుట్టపర్తి, కెఎన్‌ఎన్‌ ప్రతినిధి: సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి 'అత్యంత విషమం'గానే ఉంది. గత 26 రోజులుగా వివిధ అవయవాల అస్వస్థతతో ఇక్కడి సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబా మందులు, వైద్య పరికరాల సహాయంతోనే ప్రాణాన్ని కాపాడుకుంటున్నట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న వైద్యులు స్పష్టం చేశారు. ఆయన కాలేయం, కిడ్నీల పనితీరు పూర్తిగా క్షీణించింది. సిఆర్‌టిఆర్‌ (హీమో డయాలిసిస్‌) ద్వారా చికిత్సనందిస్తున్నారు. హృదయానికి పేస్‌మేకర్‌ అమర్చినప్పటికీ బ్లడ్‌ప్రెషర్‌ లెవల్‌ 60కి పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వెంటిలేటర్‌ సహాయంతో శ్వాస అందిస్తున్నారు. ఇక ఐవి ప్లూయిడ్‌ ద్వారా జీవరక్షక మందులను, ఇన్‌ఫెక్షన్లు సోకకుండా యాంటీ బయోటిక్స్‌ను నిరంతరం బాబా దేహానికి సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ చికిత్సకు బాబా స్పందించడంలేదు. ఇది వైద్యులను కలవరపాటుకు గురిచేస్తోంది.
దీంతో భగవాన్‌ సత్యసాయిబాబా ఆరోగ్య పరిస్థితి దినమొక యుగంగా గడుస్తోంది. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని బాబా భక్తకోటి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పుట్టపర్తిలో పరిస్థితి అత్యంత ఉద్విగ్నభరితంగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్తగా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. సత్యసాయి ఆస్పత్రి వద్ద, ప్రశాంతి నిలయంలో, పట్టణవ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయలసీమ ఐజి సంతోష్‌ మెహ్రా, డిఐజి చారుసిన్హా, అనంతపురం జిల్లా ఎస్‌పి షానవాజ్‌ ఖాసింల నేతృత్వంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
కీలక సమావేశం
మంత్రి గీతారెడ్డి సత్యసాయి ఆస్పత్రి భవనంలో ప్రభుత్వ అధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ సభ్యులతో శుక్రవారం మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించారు. బాబా ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండడంతో తాజా పరిస్థితిపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అనుకోనిది ఏదైనా జరిగితే తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత తదితర అంశాలపైన చర్చించి ముఖ్యమంత్రికి నివేదిక పంపినట్లు సమాచారం. మరోవైపు మీడియాలో వస్తున్న పలురకాల విమర్శనాత్మక కథనాలపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బాబా భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, బాబా ఆరోగ్యవంతునిగా తిరిగిరావాలని ఆ భగవంతుని ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. సమాజానికి బాబాచేసిన మేలు గురించి ప్రపంచానికి చాటిచెప్పాలని అంతే తప్ప బాబా గురించి గాని, ఆయన ట్రస్ట్‌ మీదగాని అభాండాలు వేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
రెడ్‌ అలర్ట్‌...
బాబా ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో పుట్టపర్తిలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. శుక్రవారం కూడా నిషేధాజ్ఞలు కొనసాగాయి. సత్యసాయి ఆస్పత్రి, ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు విద్యుత్‌ అంతరాయం తలెత్తకుండా ఉండేందుకు రెండు హై పవర్‌ జనరేటర్లను రప్పించారు. విపత్కర పరిస్థితి ఏర్పడితే ఆస్పత్రి లోపలి దృశ్యాలను బయట ప్రపంచానికి తెలియజేసేందుకు డిస్‌ప్లే స్క్రీన్‌లను తెప్పించి కొత్తచెరువు మండల కార్యాలయం వద్ద ఉంచారు. మరోవైపు పుట్టపర్తికి విఐపిల తాకిడి అధికంకావడంతో ప్రోటోకాల్‌కోసం జిల్లాలోని పలువురు మండల తహశీల్దార్‌, డిప్యూటీ తహశీల్దార్‌లను రప్పించారు. ఎటువంటి పరిస్థితినైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విఐపిల కాన్వాయ్‌కు వాహనాలను సిద్ధంగా ఉంచారు. జిల్లా కలెక్టర్‌ జనార్దరెడ్డి పుట్టపర్తిలోనే మకాంవేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తరలివస్తున్న భక్తజనం
సత్యసాయిబాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందన్న వార్తల నేపథ్యంలో పుట్టపర్తికి భక్తులు ప్రవాహంలా తరలివస్తున్నారు. అనంతపురం జిల్లా నుండేకాక, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ తదితర పలు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు బస్సులు, రైళ్లు, స్వంతవాహనాల్లో ఇక్కడికి చేరుకుంటున్నారు. దీంతో పుట్టపర్తిలోని లాడ్జీలన్నీ నిండిపోయాయి. ప్రశాంతి నిలయంలోని వసతి గృహాలు కూడా భక్తులతో నిండి ఉన్నాయి. చాలా మందికి బసచేయడానికి అవకాశం లభించక తిరిగవెళుతున్నారు. బాబా సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగివస్తారని, తమకు ఆయన దర్శన భాగ్యం లభిస్తుందన్నది వారి ప్రగాఢ నమ్మకం. బాబా ఆరోగ్యం కోసం పుట్టపర్తి అంతటా పూజలు, ప్రార్థనలు, భజనలు చేస్తున్నారు.

No comments:

Post a Comment