Friday, April 1, 2011

ఎన్నికలకు సెంటిమెంట్ లేదు

వేంపల్లె, కెఎన్‌ఎన్‌: రాజకీయాల్లో ఎన్నికలకు, సెంటిమెంట్‌కు సంబంధం లేదని పార్టీ నిర్ణయాల మేరకు పోటీలు వుంటాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా వేంప్లలెలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పులివెందుల నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయదంటూ వార్తలు వెలువడ్డాయని, వాటిని పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, పార్టీ తరఫున పోటీ చేయడానికి తాను సిద్ధంగా వున్నానని పేర్కొన్నారు. తన అన్నగారైన స్వర్గీయ వైఎస్‌ సతీమణి విజయమ్మపై పోటీకి, బంధుత్వానికి సంబంధం లేదన్నారు. వైఎస్‌ ఆశయసాధన కోసమే కాంగ్రెస్‌ పార్టీలో వుంటున్నానని, ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలే శిరోధార్యమని పేర్కొన్నారు. తమ మధ్య రాజీ జరుగుతున్నట్లు వచ్చిన ప్రకటనలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, ధనప్రవాహానికి అడ్డువేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో పార్టీకి వ్యక్తిత్వానికి మధ్య పోటీ అని, మహాసముద్రం లాంటి కాంగ్రెస్‌లోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారని వారిని గురించి ఆలోచించాల్సిన అవసరంలేదని చెప్పారు. సెంటిమెంట్‌ కారణమైతే కడప ఎంపీ స్థానానికి తన భార్యను పోటీకి నిలిపితే జగన్‌ ఉపసంహరించుకుంటారా అని ప్రశ్నించారు. కేవలం వైఎస్‌ కుటుంబ పేరు చెప్పి లబ్ధి పొందాలని కొందరు నేతలు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు తీవ్రంగా అన్ని వర్గాలు కృషి చేస్తాయని, పులివెందులలో తన గెలుపు ఖాయమన్నారు.

No comments:

Post a Comment