Monday, April 11, 2011

హింసకు గురవుతున్న 150 కోట్ల మంది'

వాషింగ్టన్‌ : ప్రపంచ జనాభాలో ఐదో వంతుకు పైగా సుమారు 150 కోట్ల మంది హింసకు గురవుతున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. వీరంతా పదేపదే హింస కొనసాగుతున్న దేశాల్లోని జనాభాయేనని, ఇతర దేశాలతో పోల్చితే ఈ దేశాల్లో 20శాతానికి పైగా పేదరికం ఉందని నివేదిక తెలిపింది. 'ప్రపంచ అభివృద్ధి నివేదిక 2011: ఘర్షణ, భద్రత, అభివృద్ధి' నివేదికను సోమవారం ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఆర్థిక, రాజకీయ, భద్రతా సమస్యలు ఈ దేశాలకు అభివృద్ధి నిరోధకాలుగా మారాయని, ఈ దేశాలు జాతీయ సంస్థలను బలోపేతం చేసి, పౌరులకు భద్రత, న్యాయం, ఉపాధిని కల్పించి పాలనను మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక తెలిపింది. ఘర్షణలు, హింస ఆర్థికాభివృద్ధిపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయాన్ని నివేదిక పరిశీలించి.. ఇతర దేశాల విజయాల నుంచి పాఠాలు నేర్చుకుని, సవాళ్లను అదిగమించాలని సూచించింది. పేద దేశాల హింసకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు భద్రతను మెరుగుపరచడంపై అభివృద్ధి సంస్థలు దృష్టిపెట్టాలని ప్రపంచ బ్యాంకు పిలుపునిచ్చింది. పదేపదే హింస, అస్థిరతకు అడ్డుకట్ట వేస్తే భవిష్యత్‌లో ఈ దేశాలు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతాయని, పౌరులకు రక్షణ, న్యాయం, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని.. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్‌ బి.జోయెల్లిక్‌ తెలిపారు. హింసాయుత దేశాల్లో పిల్లలకు పౌష్టికాహారం కొరత, పాఠశాలల కొరత ఉందని నివేదిక పేర్కొంది. ఒక ప్రాంతంలో హింస, అస్థిరతల ప్రభావం పొరుగు దేశాలకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోందని, దీనివల్ల ఇతర దేశాల అభివృద్ధికి హాని ఏర్పడుతోందని, మొత్తంగా ఆర్థిక అంశాల అభివృద్ధి వాయిదాపడుతోందని ఆయన చెప్పారు. ఈ దేశాల్లో మళ్లిమళ్లి రాజకీయ, నేర హింస ప్రభావం ఉండడం వల్ల ఇతర దేశాలతో పోల్చితే పేదరికం రేటు 20శాతం పాయింట్లు అత్యధికంగా ఉందని నివేదిక వివరించింది. భద్రత, అభివృద్ధి వల్ల 100 కోట్లకు పైగా ప్రజల హింసకు అడ్డుకట్ట వేయవచ్చని రాబర్ట్‌ తెలిపారు. 21శతాబ్దంలో హింస, దేశీయంగా, అంతర్జాతీయ వత్తిళ్లతో యువతలో నిరుద్యోగం, ఆదాయ సమస్యలు, వత్తిళ్లు ఏర్పడ్డాయని నివేదిక తెలిపింది.

No comments:

Post a Comment