ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఇఎస్‌పిఎన్ స్టార్ స్పోర్ట్స్ (ఇఎస్‌ఎస్)పై వ్యాపార ప్రకటనల రూపంలో డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడింది. క్రికెట్‌ను ఎంతో అభిమానించే భారత్ ఫైనల్‌కు చేరడంతో శనివారం నాడు జరిగిన మ్యాచ్‌లో 10 సెకన్ల ప్రకటనకు 23 నుంచి 24 లక్షల రూపాయల వరకూ కూడా ఇఎస్‌ఎస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు ప్రకటనల స్లాట్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిందని సమాచారం. దీంతో పాకిస్తాన్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో స్లాట్‌కు 18 లక్షల వరకూ తీసుకున్న ఇఎస్‌ఎస్ ఫైనల్లో దాన్ని మరో 40 శాతానికి పైగా పెంచింది. ఈ వరల్డ్ కప్‌లో సుమారు 80 ఎడ్వర్టయిజర్ల నుంచి ఇఎస్‌ఎస్ 1000 కోట్ల రూపాయల వరకూ యాడ్స్ వేసినందుకుగాను వసూలు చేసి వుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. భారత్ ఫైనల్లో అడుగు పెట్టగానే రికార్డు స్థాయికి యాడ్ రేటు పెరిగిపోయిందని లింటాస్ మీడియా గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధా నటరాజన్ వ్యాఖ్యానించారు.
ఈ పోటీలు ప్రసారం చేస్తున్న చానళ్ళకు భారీగా ఆదాయం రానుందని తెలిపారు. ఈ సంవత్సరం వరల్డ్ కప్‌లో భారీగా పెట్టుబడి పెట్టిన లింటాస్ సోనీ, మారుతి సుజుకి, యూనియన్ బ్యాంక్, బిపిసిఎల్, రెలిగేర్, ఓల్టాస్ వంటి కంపెనీల తరఫున ప్రకటనల స్లాట్లను కొనుగోలు చేసింది. ఏ వ్యాపార ప్రకటనలకైనా వరల్డ్ కప్ ఫైనల్‌ను మించిన అవకాశం మరొకటి ఉండదని జనిత్ ఓప్టిమీడియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నెవిన్ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. భారత్ ఫైనల్‌కు వెడుతుందన్న నమ్మకంతో తాము కొంత మొత్తం ఇందుకోసం ముందే కేటాయించామని వివరించారు.
కాగా, మ్యాచ్‌కు ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు 200 సెకన్ల ప్రకటనల సమయాన్ని ఇఎస్‌ఎస్ విక్రయించినట్టు తెలిసింది. ఇదే విషయమై సంస్థ ప్రతినిధిని వివరణ కోరగా, స్పాన్సర్లు, భాగస్వామ్యులు, వివిధ ప్రొడక్టులను మార్కెటింగ్ చేస్తున్న కంపెనీల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ప్రతి ఒక్కరి అంచనాలకూ అనుగుణంగా భారత్ సాగడంతో తాము కూడా లాభపడ్డామని తెలిపారు.
అయితే, స్లాట్ రేటు గరిష్ఠంగా ఎంత వరకూ వెళ్ళిందన్న విషయం వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. 2007 నుంచి 2015 వరకూ జరిగే అన్ని ఐసిసి మ్యాచ్‌లనూ ప్రసారం చేసేందుకుగాను 1.1 బిలియన్ డాలర్లు (సుమారు 5 వేల కోట్ల రూపాయలు) చెల్లించి హక్కులను ఇఎస్‌పిఎస్ స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment