Monday, April 11, 2011

రాష్ట్రంలో ఉద్యమాల హైజాకర్స్‌

అన్నా ఆందోళన క్రెడిట్‌ సొంత ఖాతాలో జమకు యమ తిప్పలు



హైదరాబాద్‌: ప్రజాఉద్యమాల్ని హైజాక్‌ చేసేందుకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. అవినీతి నిర్మూలన కోసం అన్నాహజారే చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యపర్చగా రాష్ట్రస్థాయిలో ఈ ఉద్యమ ఫలితాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలకు అన్ని రాజకీయ పార్టీలు తెరతీశాయి. ఈ పరిస్థితి దేశంలో లేదా మరే రాష్ట్రంలోని రాజకీయపార్టీల్లో కనిపించదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాంగ్రెస్‌, తెలుగుదేశం, బిజెపి, టిఆర్‌ఎస్‌, లోక్‌సత్తా, వామపక్షాలు ఇలా భేదభావాల్లేకుండా రాజకీయ పార్టీలన్నీ ఈ ఒక్క విషయంలో ఏకపంథాను అనుసరిస్తున్నాయి. తీవ్రఅవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన ఈ రాజకీయ పార్టీలన్నీ అన్నా పోరాటంలో తామూ భాగస్వాములమేనంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నాయి.
ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలు, నిరసనలు, నిరాహార దీక్షలు నిర్వహించాయి. అసలు హజారే చేస్తున్న ఉద్యమమే రాజకీయ అవినీతిపై కాగా జనలోక్‌పాల్‌ ముసాయిదా బిల్లు రూపకల్పన కమిటీలో పార్టీల ప్రతినిధులకు అవకాశం కల్పించాలంటూ ఇవి డిమాండ్‌ మొదలుపెట్టాయి. దీంతో ఉద్యమ స్వరూపమే మారిపోయే ప్రమాదం ఏర్పడింది. ఉద్యమ లక్ష్యాలు దెబ్బతింటాయన్న భయం సామాజికవేత్తలకు పట్టుకుంది. ఒక స్పష్టమైన లక్ష్యంతో హజారే నిర్వహిస్తున్న ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు చొరబడితే ఉద్యమం పట్ల ప్రజల్లో కూడా విశ్వాసం సన్నగిల్లుతుంది. ఈజిప్ట్‌ ఉద్యమం రాజకీయ పార్టీలు, నాయకులు, అధికార పిపాసుల్ని దూరంగా పెట్టింది. పూర్తిగా ప్రజాసహకారంతోనే సాగింది. అందుకే దీనిపట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లడైంది. ఉద్యమం పట్ల విశ్వాసం పెరిగి సానుకూల ఫలితాలు లభించాయి.
హజారే ఉద్యమానికి మద్దతంటూ అవినీతిరహిత సమాజం కోసం పోరాడతామని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రారంభించిన వేదికలు ప్రజలకు వెగటు పుట్టిస్తున్నాయి. గతంలో అవినీతి చరిత్ర ఉన్న విశ్రాంత అధికారులు, సామాజిక స్పృహలేని డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్స్‌, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలే ఈ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. వీరంతా రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా ప్రదర్శనలకు దిగితే మరోవైపు అతిపెద్ద అవినీతిపరులుగా ఆరోపణలెదుర్కొంటున్న జగన్‌, గాలి జనార్దనరెడ్డిలు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మరోవైపు చంద్రబాబు పాదయాత్రలు నిర్వహించారు.తాను కూడా పోరాటానికి ఉరుకుతున్నానంటూ హరికృష్ణ ప్రకటించారు. సిపిఐ నారాయణ మరో అడుగు ముందుకేశారు. అవినీతికి వ్యతిరేకంగా 48 గంటల నిరాహారదీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ పార్టీలకిది కొత్తేంకాదు. గత ఐదు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రజా ఉద్యమాల్ని ఇవిలాగే హైజాక్‌ చేశాయి. తాజాగా తెలంగాణ ఉద్యమ పరిస్థితి కూడా అంతే. ఎందరో చారిత్రక, సామాజిక ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఐదు దశాబ్దాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజల్ని చైతన్యవంతం చేశారు. ఉద్యమం ఉధృత స్థాయికెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా అన్ని రాజకీయ పార్టీలు ఇందులో ప్రవేశించాయి. సిద్ధాంతాల్ని కూడా పక్కనపెట్టేశాయి. అలాగని సీమాంధ్రలో మొదలైన సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ వదిలిపెట్టలేదు. ఒకే రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకేపార్టీ పరస్పర విరుద్ధ సిద్ధాంతాల్ని అమల్లో పెట్టాయి. ఇప్పుడు హజారే ఉద్యమంలో కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నాయి. మేధావులు,
సంఘ సంస్కర్తలు, సేవాతత్పరులు, అవినీతి రహిత భారత నిర్మాణానికి హజారే సారథిగా సాగిస్తున్న ఉద్యమానికి కరుణానిధి, జగన్‌, యడ్యూరప్ప, దేవగౌడ, గాలి జనార్దన్‌రెడ్డివంటి అవినీతిపరులు కూడా మద్దతు పలుకుతూ ఉద్యమ స్ఫూర్తిని, ప్రతిష్టను దిగజార్చేస్తున్నారు. వీరంతా హజారే ఉద్యమానికి ఎంత దూరంగా ఉంటే ఉద్యమం పట్ల విశ్వాసం అంతగా ఇనుమడిస్తుంది. ఇదే విషయాన్ని హజారే కూడా గుర్తించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చేది లేదంటూ ప్రకటించారు. తాను ఓట్ల రాజకీయాల్లోకి వస్తే డిపాజిట్లు కూడా దక్కించుకోలేనంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment