మొహాలీ: ఐపిఎల్-4లో కింగ్స్ లెవన్ పంజాబ్ శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకొంది. ఓపెనర్ పాల్ వల్తాటీ విధ్వంసక సెంచరీతో పంజాబ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్‌కు ఓపెనర్లు గిల్‌క్రిస్ట్, వల్తాటీ శుభారంభం అందించారు. ఇద్దరూ తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ధాటిగా ఆడిన గిల్‌క్రిస్ట్ 15 బంతుల్లో 2ఫోర్లతో 19 పరుగులు చేసి మోర్కెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 61 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన షాన్ మార్ష్ (12) పరుగులు మాత్రమే చేసి పెవిలిన్ చేరాడు. మరోవైపు వల్తాటీ తన జోరును కొనసాగించాడు. చెన్నై బౌలర్లను హడలెత్తిస్తూ పరుగుల వరద పారించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వల్తాటీ 52 బంతుల్లోనే 16ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీని పూర్తి చేశాడు. ఐపిఎల్-4లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. శతకం తర్వాత కూడా వల్తాటీ హవా సాగింది. 63 బంతుల్లో 19ఫోర్లు, రెండు సిక్స్‌లతో అజేయంగా 120 పరుగులు సాధించి పంజాబ్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకి ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అనిరుధ (0), సురేశ్ రైనా (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ప్రవీణ్‌కుమార్ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి పంజాబ్‌కు పైచేయి అందించాడు. అయితే మురళీ విజయ్ 43 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లతో 74, బద్రినాథ్ 56 బంతుల్లో 8ఫోర్లతో 66(నాటౌట్), ధోనీ 20 బంతుల్లో 4ఫోర్లు, రెండు సిక్సర్లతో (43) పరుగులు రాణించడంతో చెన్నై 188 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
No comments:
Post a Comment