బెంగళూరు: ఐపిఎల్-4లో ముంబై ఇండియన్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 9వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. కెప్టెన్ సచిన్ టెండూల్కర్ (55), అంబటి రాయుడు (63) అజేయ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో 141 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో 9 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన ముంబై కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకొంది. సునాయాస లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఓపెనర్లు సచిన్, జాకబ్స్‌లు తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన డేవి జాకబ్స్ 16 బంతుల్లోనే 2ఫోర్లు, రెండు సిక్సర్లతో 222 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే తర్వాత వచ్చిన అంబటి రాయుడుతో కలిసి సచిన్ మరో వికెట్ కోల్పోకుండానే జట్టును విజయతీరానికి చేర్చాడు. ప్రారంభంలో జాగ్రత్తగా ఆడిన వీరిద్దరూ తర్వాత జోరును పెంచారు. పోటీపడి షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. రాయుడు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు వేగాన్ని పెంచాడు. ధాటికి ఆడి 41 బంతుల్లోనే 8ఫోర్లతో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సచిన్ 42 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 110 పరుగులు జోడించి జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. సచిన్‌కు మ్యాచ్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆదుకున్న దిల్షాన్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును తిలకరత్నే దిల్షాన్ ఆదుకున్నాడు. ఓపెనర్ అగర్వాల్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే మలింగ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన కోహ్లి (12) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. అయితే తర్వాత వచ్చిన డివిలియర్స్ (38) అండతో దిల్షాన్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. సమన్వయంతో ఆడిన దిల్షాన్ 52 బంతుల్లో 4ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
No comments:
Post a Comment