నాగచైతన్య, తమన్నా నాయకానాయికలుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '100 %లవ్'. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మాత బన్నివాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్, హైటెక్ సిటీ వద్ద వున్న రాక్ గార్డెన్స్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన నాగార్జున అక్కినేని ఆడియో సీడీని విడుదల చేసి, తొలి సీడీని హీరో రామ్ చేతులమీదుగా మరో హీరో అల్లు అర్జున్‌కు అందించారు. దేవిశ్రీప్రసాద్ నేతృత్వంలో కార్యక్రమం ఆద్యంతం అందరినీ అలరింపజేసేంది. నాగచైతన్య బ్యాంకాక్‌లో షూటింగ్‌లో ఉన్నందువల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. ఆయన మాట్లాడిన క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. చిత్రరంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, 'నాగచైతన్యకు మూడవ చిత్రానికే గీతా ఆర్ట్స్ లాంటి బేనర్‌లో అవకాశం రావడం, సుకుమార్ దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది. పాటలు విన్నాను. చాలా బావున్నాయి. అల్లు అరవింద్ మొదటి భాగం చూసి, ఎంతో బావుందన్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం ఉర్రూతలూపుతోంది. ఈ సినిమాలో ఓ సన్నివేశం చూసి తనకు కళ్ళలో నీళ్లు తిరిగాయని దేవీ చెప్పారు. ఆడియోతో పాటు సినిమా కూడా వంద శాతం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు.
డి.రామానాయుడు మాట్లాడుతూ, 'సినిమా చేస్తున్నప్పుడు నాగచైతన్య కూడా ఇది చాలా మంచి సినిమా అవుతుందని చెప్పాడు. అల్లు అరవింద్ ఏది పట్టినా బంగారమే. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను' అని చెప్పగా, 'ఈ చిత్రంలోని పాటలు స్టూడెంట్స్ పరంగాను, యూత్‌పుల్‌గాను ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే...ఆర్య చిత్రం పాటలకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి' అని సమర్పకుడు అల్లు అరవింద్ అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, 'దేవిశ్రీప్రసాద్, నా కాంబినేషన్‌లో సినిమా అంటే దేవిశ్రీప్రసాద్‌ది 99 శాతం అయితే నాది ఒక్క శాతం ప్రమేయం మాత్రమే ఉంటుంది. దేవీ సంగీత భూతం. మంచి సంగీతం కోసం అంతగా పరితపిస్తాడు. ఏకంగా అతను 52 గంటలు కూడా పనిచేస్తాడు. బన్నీ (అల్లు అర్జున్)లో కూడా అలా కష్టపడే తత్త్వం ఉంది. ఇక సినిమాలో అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం సహజంగా జరిగే పరిణామం. అయితే ఈ చిత్రం బాగా రావాలని నేను వారిద్దరి పాత్రలను ప్రేమించాను' అని అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'మూడుతరాల అక్కినేని నట కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక గీతా ఆర్ట్స్‌లో ఈ సినిమా చేస్తున్న వారంతా నాకు కావలసినవాళ్లే. ఈ చిత్రంలో ఓ కొత్త నాగచైతన్యను చూస్తారు. తమన్నా కెరీర్‌లో ఇదో మంచి సినిమా అవు
తుంది' అని చెప్పారు.
హీరో రామ్ మాట్లాడుతూ, 'జగడం చిత్రానికి సుకుమార్‌తో కలసి నేను పనిచేశాను. అతనిలో మంచి టాలెంట్ వుంది. ఈ బేనర్‌లో చేయాలని ఎవరైనా కలలు కంటారు. ఆ అవకాశం నాగచైతన్యకు రావడం సంతోషంగా ఉంది' అని అన్నారు.
తమన్నా మాట్లాడుతూ, 'దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలోని ప్రేమ సన్నివేశాలను మలచిన తీరు అద్భుతం. ఇంతవరకు నిజజీవితంలో నేను ప్రేమలో పడకపోయినప్పటికీ, నా ప్రేమకథ కూడా ఈ చిత్రంలోని సన్నివేశాల మాదిరిగా ఉండాలని అనుకున్నాను. అంతగా నన్ను ఈ చిత్రం ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్‌లో ఒకేసారి రెండు సినిమాలు చేయడం ఎనలేని ఆనందంగా ఉంది' అని అన్నారు.
No comments:
Post a Comment