ప్రపంచ కప్ క్రికెట్ సెమిఫైనల్స్ మ్యాచ్‌లో పాక్ జట్టుపై మన జట్టు ఘనవిజయం సాధించినా, క్రికెట్ దౌత్యం పేరిట ఇరుదేశాల ప్రధానులు జరిపిన చర్చలు షరా మామూలుగానే ముగిశాయి. అందుకే, ఈ చర్చలపై మన దేశం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాలకులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరని గడిచిన ఆరు దశాబ్దాలుగా రుజువు అవుతున్న సత్యం. అయినప్పటికీ, పొరుగుదేశంతో శాశ్వత శతృత్వం మంచిది కాదన్న ఉద్దేశ్యంతోనే విశ్వాస పరికల్పన చర్యలను ఎప్పటికప్పుడు మన దేశం తీసుకుంటూనే ఉంది. వీటిలో భాగంగానే మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన కొత్తలో ఉభయ కాశ్మీర్‌ల మధ్య వాస్తవాధీన రేఖ మీదుగా బస్సు సర్వీసును, సంర&°తా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను, వాఘా సరిహద్దు మీదుగా వాణిజ్యాన్ని ప్రారంభించడం జరిగింది. బస్సు సర్వీసును ప్రారంభించిన కొత్తలో దశాబ్దాల క్రితం వేరు పడిన కాశ్మీరీ కుటుంబాలు కలుసుకున్న ఉద్విఘ్న క్షణాల గురించిన మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెలువడిన కథనాలు అందరినీ కదిలించాయి. అలాగే,సంర&°తా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రవేశపెట్టినప్పుడు కూడా భావోద్వేగాలు పెల్లుబికాయి. వాఘా సరిహద్దు మీదుగా వాణిజ్యం విషయంలోనూ పంజాబీల మధ్య ప్రేమాభిమానాలు వెల్లివిరిసాయి. అలాగే, ఇరుదేశాల పార్లమెంటరీ బృందాలు అటువారు ఇటు, ఇటువారు అటు పర్యటనలు జరపడం వల్ల కొత్త ఆశలు మోసులెత్తాయి. ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియకు ఇక ఎటువంటి అవరోధాలూ లేవని అంతా ఆశించారు. అంచనా వేశారు. గతాన్ని పీడకలగా మరచిపోదామని నాయకుల దగ్గర నుంచి దౌత్యవేత్తల వరకూ అంతా ప్రకటనలు గుప్పించారు.
అయితే, 2008 నవంబర్ 26వ తేదీన ముంబై నగరంపై జరిగిన ఉగ్రవాదుల దాడులు ఇరుదేశాల మధ్య తిరిగి నెలకొంటున్న స్నేహపూర్వక వాతావరణాన్ని భగ్నం చేశాయి. లష్కర్ ఎ తోయిబా సంస్థకి చెందిన పది మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా కరాచీ నుంచి ముంబైకి చేరుకుని తాజ్‌హోటల్, నారిమన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ స్టేషన్లలో 72 గంటల సేపు స్వైర విహారం చేశారు. 166 మందిని నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారు. మరో 200 మందిని పైగా గాయపర్చారు. ఆనాటి గాయాలు ఇంకా మానకపోయినా, క్రికెట్ దౌత్యానికి మన ప్రధాని మన్మోహన్ సింగ్ అంగీకరించడం, పాక్ ప్రధాని యూసఫ్ గిలానీని ఆహ్వానించడం పెద్ద మనసుకు ప్రత్యక్ష నిదర్శనం. క్రికెట్ మ్యాచ్‌లకు పాక్ అధినేతలు రావడం ఇది మొదటి సారి కాదు. ఎన్‌డిఎ హయాంలో ఆనాటి సైనిక పాలకుడు జనరల్ ముషారఫ్ ఢిల్లీ వచ్చినప్పుడు ఈ మాదిరిగానే ఆశావహ కథనాలు మీడియాలో వెలువడ్డాయి. ముషార్రఫ్ సైనికాధికారి అయినా, రాజకీయ వేత్త కన్నా ఎక్కువ కలివిడిగా ఉండేవారు.ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో ఆగ్రాలో జరిపిన చర్చల పురోగతిపై ఆశావహ కథనాలూ, ఊహాగానాలూ వెలువడ్డాయి.అంతా బాగానే ఉన్నా చివరి క్షణంలో తలెత్తిన విభేదాల కారణంగా చర్చలు విఫలమయ్యాయి. ఇందుకు ఆనాటి ఉప ప్రధాని అద్వానీయే కారణమని ఆ తరువాత ముషార్రఫ్ ఆరోపించారు. అలాగే, 2004 జనవరిలో లష్కర్ ఎ తోయిబా,జైష్ ఎ మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటన నేటికీ అమలుకు నోచుకోలేదు. మన్మోహన్‌సింగ్ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ముషార్రఫ్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వచ్చారు. అప్పుడు కూడా మళ్ళీ ఇదే మాదిరి ఆశావహ కథనాలు వెలువడ్డాయి. కాని షరా మామూలు అన్నట్టు పాక్ ధోరణిలో ఏమాత్రం మార్పు లేకపోవడాన్ని చూస్తూనే ఉన్నాం. అంతర్గత సమస్యలతో నిరంతరం సంక్షుభిత వాతావరణం నెలకొనడం వల్ల పాక్‌లో ఏ ప్రభుత్వమూ సుస్థిరంగా మనుగడ సాగించలేదు. సైనిక పాలకులైతే ఉక్కు పాదాలతో ఉద్యమాలను అణచి వేసి కనీసం కొంత కాలమైనా తమ అధికారాన్ని నిలబెట్టుకున్న దృష్టాంతాలు ఉన్నాయి కానీ, ప్రజాస్వామిక ప్రభుత్వాలు మాత్రం దినదిన గండంగానే అధికారంలో కొనసాగడం అక్కడి ఆనవాయితీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న పీపుల్స్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఓటు పడవలానే సాగుతోంది. దేశాధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్దారీ అధికారాలను కత్తిరించి ప్రధాని గిలానీ కథ నడిపిస్తున్నారు. వారి మధ్య అంతర్గత సమస్యలు ఎన్ని ఉన్నా, మన విషయానికి వచ్చే సరికి ఒకే తాటి మీద నిలబడతారు. ముఖ్యంగా, ముంబై దాడుల సూత్ర ధారులైన జాకీ వూర్ రెహమాన్ లఖ్వీ, జరార్ షా,హఫీజ్ మహ్మద్ సయీద్ వంటి వారిని అప్పగించకపోయినా, కనీసం తమ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం వారిపై విచారణ జరిపించాలన్న మన ప్రభుత్వ అభ్యర్ధనను పట్టించుకోకుండా గడిచిన మూడేళ్ళుగా గడుపుతున్నారు.గిలానీ రాకకు రెండు రోజుల ముందు జరిగిన ఇరుదేశాల హోం శాఖ కార్యదర్శుల సమావేశంలో ఈ విషయమై కొంత పురోగతి కనిపించినా,అది అమలులోకి వస్తుందన్న ఆశ లేదు. ముఖ్యంగా, ఈ సూత్ర ధారుల స్వరాల నమూనాలను పంపేందుకు పాక్ హోం శాఖ కార్యదర్శి అంగీకరించినప్పటికీ, ఐఎస్‌ఐ నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా జర్దారీ ప్రభుత్వం ఆచరణలో పెట్టలేకపోవచ్చు.
బుధవారంనాడు క్రికెట్ మ్యాచ్ అనంతరం పాక్ ప్రధాని గిలానీతో జరిపిన చర్చల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్ దీర్ఘ కాలిక శత్రుత్వాలను పక్కన పెట్టి హింసారహిత వాతావరణం నెలకొనేందుకు ఇరుదేశాలూ కృషి చేయాలనీ, సమానత్వం, సగౌరవం ప్రాతిపదికగా ఇరు దేశాలూ చర్చలు సాగించాలని సూచించారు. అలాగే, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూడా ఆయన గిలానీకి చురక అంటించారు. ముంబై దాడుల సూత్రధారులపై చర్యల గురించి మరోసారి గుర్తు చేయడమే ఆయన ఉద్దేశ్యమని వేరే చెప్పనవసరం లేదు.ఆనాటి ముంబై పేలుళ్ళ నిందితుడు దావూద్ ఇబ్రహీంతో సహా 20 మంది నేరస్థులను అప్పగించాలన్న డిమాండ్‌ని తుంగలోకి తొక్కినట్టే, ఇప్పుడు ఈ సూత్ర ధారులపై చర్య విషయంలో మొండి చెయ్యి చూపినా పొరుగుదేశంతో శాశ్వత శత్రుత్వం పనికి రాదు కనుక, క్రికెట్ దౌత్యాలూ, ద్వైపాక్షిక చర్చలను కొనసాగించక తప్పదు. ఏం చేస్తాం అది మన సంప్రదాయం.
No comments:
Post a Comment