Friday, April 15, 2011

ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ, క్రిమినల్‌ శక్తులు:హజారే


అహమ్మద్‌నగర్‌: సమగ్ర లోక్‌పాల్‌ బిల్లు కోసం సాగుతున్న ఉద్యమాన్ని విమర్శించడం ద్వారా, ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేసే యత్నాలతో ''రాజకీయ క్రిమినల్‌ శక్తులు'' అవినీతికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తం గా జరుగు తున్న ఉద్యమాన్ని నీరుగార్చే యత్నాలు చేస్తున్నాయని అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అన్నా హజారే ఆరోపించారు. ''జన్‌ లోక్‌పాల్‌ బిల్లుకు సంబంధించి సామాన్య ప్రజలలో ఇటీవల పెల్లుబికిన జాగృతి, మద్దతు చూసి కొన్ని రాజకీయ నేర శక్తులు భయపడుతున్నాయి. అవినీతిని అణిచివేసేందుకు, ప్రజల నుంచి ఉప్పొంగుతున్న ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అయోమయాన్ని సృస్టించే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు''అని ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలోని హజారే స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో గురువారం అన్నా హజారే మాట్లాడారు. రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడంపై వచ్చిన విమర్శలను విలేకరులు హజారే దృష్టికి తీసుకువెళ్లగా దేశంలోని రాజకీయ నాయకులందరూ అవినీతిపరులని తాను ఎప్పుడూ అనలేదని బదులిచ్చారు. ''అన్ని స్థాయిలలోనూ మినహాయింపులు ఉంటాయ్‌. ఐతే అలాంటి ప్రత్యేకత కలిగివున్నవారు తమ ఎరికలో చోటు చేసుకునే అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పితేనే గౌరవ పాత్రులవుతారు. అవినీతికి సంబంధచిన విషయాలను పట్టించుకోకుండా మౌనం పాటించడం కూడా అవినీతిని సమర్థించడం కిందే లెక్క. అలాంటి తరగతి నాయకులు వాస్తవానికి ఏమాత్రం దేశానికి ఉపయోగపడరు'' అని హజారే అన్నారు. ఓటర్లను అవినీతిపరులు, నిజాయితీ లేనివారు అనడంపై కాంగ్రెస్‌, ఎన్‌సిపిల నుంచి హజారే విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ విమర్శలకు ఆయన సమాధానం ఇస్తూ దేశంలో ఓటర్ల శీలాన్ని మలినం చేస్తున్నది రాజకీయ పార్టీలూ, నాయకులేనన్నారు. నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీ మొత్తంలో నల్లధనం కూడబెట్టి అందులో స్వల్ప మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచిపెట్టడం ద్వారా తమ అవినీతి కార్యకలాపాలకు సానుభూతి సంపాదిస్తున్నారు అని హజారే వ్యాఖ్యానించారు. ''భారీ మొత్తంలో నల్ల ధనం లేకుండా ప్రస్తుతం ఎన్నికలలో ప్రతిభ ఆధారంగానో, నీతి, నిజాయితీల ఆధారంగానో విజయం సాధించడం సాధ్యమా? అని ప్రశ్నించారు.
గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌లను మెచ్చుకున్నందుకు పలు దిక్కుల నుంచి దాడిని ఎదుర్కోవలసి రావడాన్ని ప్రస్తావించగా అభివృద్ధి సాధన కోసం వారు చేసిన కృషిని మాత్రమే ప్రశంసించడం జరిగిందితప్ప 1984 సంఘటనతో సహా అన్ని మత ఘర్షణలనూ తాను ఖండించినట్టు హజారే చెప్పారు. ఈ నెల 16న జరిగే జన్‌ లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా రూపకల్పన కమిటీ తొలి సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారంనాడు హజరే ఢిల్లిd బయలుదేరి వెళతారు.

No comments:

Post a Comment