సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన నిరశన ప్రకంపనలను సృష్టిస్తోంది. యుపిఎ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అన్నా దీక్షకు వెల్లువెత్తుతున్న మద్దతు ప్రభుత్వ వర్గాలనే నివ్వెరపరుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వయంగా రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రి సిబల్‌ను చర్చలకు పంపారు. లోక్‌పాల్ బిల్లు రూపకల్పన కమిటీలో సగం మందిని పౌర సమాజం నుంచి తీసుకునేందుకు అంగీకరించారు. అన్నాను కమిటీ చైర్మన్‌ను చేయలేమని చేతులెత్తేశారు. దీక్ష విరమించమని సోనియా విజ్ఞప్తి చేసినా, చావోరేవో తేల్చుకుంటానని హజారే హెచ్చరించారు. బిల్లు రూపకల్పన కమిటీ నుంచి కేంద్ర మంత్రి శరద్‌పవార్ ఇప్పటికే తప్పుకోగా, మొత్తం అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులు అందరూ రాజీనామా చేయాలని అన్నా పట్టుబడుతున్నారు. అటు దేశ విదేశాల్లో హజారేకు భారీగా మద్దతు పోటెత్తుతుండగా, ఇటు సామాజిక వెబ్‌సైట్లు సెకన్‌కు రెండు సంక్షిప్త సందేశాలతో కిక్కిరిసిపోతన్నాయి...
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: అవినితికి వ్యతిరేకంగా ప్రముఖ గాంధేయవాది, సంఘ సంస్కర్త అన్నా హజారే ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్షతో ప్రభుత్వం దిగివచ్చింది. ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకుల, అధికారుల అవినితికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ బిల్లును వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విధిగా ప్రతిపాదించేందుకు అంగీకరించడంతో పాటు అన్నా హజారే డిమాండ్ చేస్తున్న విధంగా ఈ బిల్లు రూపకల్పనలో పౌరసమాజానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించింది. అయితే, ఈ కమిటీకి చట్టబద్ధత కల్పిస్తూ లాంఛనప్రాయమైన నోటిఫికేషన్ జారీచేసే విషయంలో, కమిటీకి అధ్యక్షునిగా ఎవరు వ్యవహరించాలన్న అంశాలలో మాత్రం ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.
అన్నా హజారే దీక్షకు దేశవ్యాప్తంగా ప్రజాసంఘాలు, ప్రజల నుండి వ్యక్తమౌతున్న సంఘీభావంతో ఒక మెట్టు దిగిన ప్రభుత్వం అన్నా హజారే ప్రతినిధులతో బుధవారంనాడు రెండు దఫాలుగా చర్చలు జరిపింది. ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరని అంశాలపై గురువారంనాడు తిరిగి చర్చలు కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ప్రభుత్వం తరఫున కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ ఈ చర్చలు సాగించగా అన్నాహజారే ప్రతినిధులుగా స్వామి అగ్నివేశ్, ఆనంద్ కేజ్రివాల్ హాజరయ్యారు.
వర్షాకాల సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు, అలాగే, మరింత
పకడ్బందీగా బిల్లును తయారు చేయడం కోసం ప్రభుత్వ ప్రతినిధులతో సమాన సంఖ్యలో పౌరసమాజ ప్రతినిధులను కూడా సభ్యులుగా ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిన తర్వాత అవినీతిపై పోరులో ఎలాంటి రాజీ సమస్యే లేదని, దేశాన్ని పట్టిపీడిస్తున్న ఈ చీడను పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేయాలన్న అంశంపై తామెవరికీ రెండవ అభిప్రాయం లేదంటూ యుపిఎ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరాహారదీక్షను విరమించుకోవాల్సిందిగా అన్నాహజారేకు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద సేవాసంస్థల ప్రతినిధులు, సంఘ సంస్కర్తలు, మేధావులను కూడా పార్లమెంట్ ఆమోదానికి ప్రతిపాదించనున్న లోక్‌పాల్ బిల్లు రూపకల్పనలో భాగస్వాములను చేసేందుకు అంగీకరించినప్పటికీ, ఈ కమిటీకి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన ప్రతిపత్తిని కల్పిస్తూ లాంఛనంగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మాత్రం ఇష్టపడ లేదు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కపిల్ సిబల్‌తో రెండవ దఫా చర్చల అనంతరం స్వామి అగ్నివేశ్, అరవింద్ కేజ్రివాల్ ప్రకటించడంతో నిరాహారదీక్ష శిబిరం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. దానితో, పౌర సమాజ డిమాండ్లకు ప్రభుత్వం పూర్తిగా తలొగ్గేంతవరకూ తాను దీక్ష విరమించబోనని అన్నాహజారే స్పష్టం చేశారు.
అవినీతిని అంతం చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలని, ఇప్పటికే రూపొందించిన లోక్‌పాల్ బిల్లు స్థానంలో మరింత సమర్థమంతమైన, కట్టుదిట్టమైన ఏర్పాట్లతో జన లోక్‌పాల్ బిల్లును సిద్ధం చేసి ఆమోదించేంత వరకూ తన ఉద్యమం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. నోటిఫికేషన్ జారీచేసే అంశంతో పాటు బిల్లును రూపొందించే అధికారుల, అనధికారుల సంయుక్త కమిటీకి ఎవరు అధ్యక్షునిగా ఉండాలన్న అంశంపై కూడా ఇరుపక్షాల మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలు వ్యక్తమయ్యాయి. అన్నాహజారే అధ్యక్షునిగానే ఈ సంయుక్త కమిటీ ఏర్పాటు కావాలని ఆయయన ప్రతినిధులు పట్టుబట్టగా బిల్లును రూపొందించడంతో పాటు పార్లమెంట్‌లో దానిని ప్రతిపాదించి ఆమోదింపజేయాల్సిన బాధ్యత రీత్యా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సీనియర్ మంత్రి ఒకరు కమిటీకి అధ్యక్షునిగా ఉండడం అవసరమని ప్రభుత్వం వాదిస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే, సాయంత్రం దీక్షా శిబిరం వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన అన్నాహజారే మాత్రం కమిటీ అధ్యక్షునిగా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా లేనని ప్రకటించారు.
తన జీవితంలో ఎన్నడూ ఎలాంటి సంస్థకూ కనీసం ఆఫీస్‌బేరర్‌గా కూడా వ్యవహరించలేదని, ఇప్పుడు ఈ కమిటీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తే దాని కోసమే తాను నిరాహారదీక్ష చేపట్టాననే అపవాదును ఎదుర్కొవాల్సి వస్తుందని అంటూ లోక్‌పాల్ బిల్లులో పొందుపరచాల్సిన అంశాలపై ప్రభుత్వంపై తగిన ఒత్తిడి తేవడం కోసం తాను కమిటీలో సాధారణ సభ్యునిగా లేదా ప్రభుత్వం కోరుకొంటే దానికి సలహాదారుగా ఉంటానని అన్నాహజారే చెప్పారు. దీనితో, అన్నాహజారే కానిపక్షంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షునిగా కమిటీని నియమించాలని కోరుతామని, తమ ఇతర డిమాండ్లపై కూడా మరోసారి మంత్రి కపిల్‌సిబల్‌తో లోతుగా చర్చలు జరుపనున్నామని స్వామి అగ్నివేశ్ ప్రకటించారు.
No comments:
Post a Comment