Thursday, April 14, 2011

అవినీతి నిర్మూలనకు పంచసూత్రాలు : బాబా రామ్‌దేవ్‌

బెంగళూరు : దేశంలో అవినీతి నిర్మూలనకు పంచసూత్రాలను యోగాగురు బాబా రామ్‌దేవ్‌ ప్రతిపాదించారు. అవినీతిపై పోరాటానికి దేశవ్యాప్త భారత స్వాభిమాన్‌ ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. కోటిమంది ప్రజల సంతకాలను సేకరించి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి అందజేస్తానన్నారు. బుధవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొని బాబా రామ్‌దేవ్‌ మాట్లాడారు. అవినీతి నిర్మూలనకు ప్రపంచంలోని 140దేశాల్లో దాచిన భారత సంపదను వెనక్కు తీసుకురావాలన్నారు. ప్రస్తుతం చెలామణిలోనున్న 1000, 500 ముఖవిలువ కలిగిన కరెన్సీని రద్దుచేయాలన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు అధిక విలువగల నోట్లు కారణమని పేర్కొన్నారు. బ్లాక్‌మనీని దాచేందుకు స్విట్జర్లాండ్‌ తదితర దేశాల్లోఉన్న బ్యాంకులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని తప్పనిసరిగా వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించాలని, లేని పక్షంలో వారి ఆస్తిని స్వాధీనం చేసుకోవాలన్నారు. డబ్బును విదేశీ బ్యాంకులలో పెట్టేవారికి అనుకూలంగా ఆయాదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని రాజకీయపార్టీలలోనూ అవినీతిపరుల సంఖ్య ఎక్కువగా ఉంది. అవినీతి నిర్మూలనకు జనలోక్‌పాల్‌ బిల్లు కొంతమేరకు ఉపయోగపడగలదని అభిప్రాయ పడ్డారు. అయితే ప్రధానితోసహా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులను లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావాలని అన్నారు. అవినీతిపరులను ఉరితీయాలి. అవినీతి పరుల ఆస్తులను స్వాధీనంచేసుకునే అధికారాన్ని లోక్‌పాల్‌కు ఇవ్వాలి తెలిపారు. అన్నాహజారేతో తనకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, అందరం కలిసికట్టుగా అవినీతిపై పోరాడుతామని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment