ఇంతవరకు శ్రీకాంత్ చేసిన చిత్రాలకు, పాత్రలకు భిన్నంగా కొత్తకోణంలో 'విరోధి' చిత్రం ఉంటుందని దర్శకుడు నీలకంఠ తెలిపారు. ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రాలను అధికంగా చేసిన శ్రీకాంత్ కొంతకాలంగా మాస్ చిత్రాల్లో కూడా నటిస్తున్న విషయం తెలియందికాదు. శతాధిక చిత్రాల హీరోగా తన చిత్రగమనాన్ని కొనసాగిస్తున్న ఆయన తాజాగా నటిస్తున్న చిత్రమిది. ఇంతవరకు సున్నితమైన కథాంశాలను ఎంపికచేసుకుని సినిమాలను చేసిన నీలకంఠకు కూడా ఇది విభిన్నమైన కథాచిత్రం. ఇందులో శ్రీకాంత్ సరసన కమలనీముఖర్జీ కథానాయికగా నటించింది. నక్సలిజం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ తమ్ముడు అనిల్ మేక నిర్మాత. మేక మీడియా పతాకంపై తయారవుతున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చకాచకా సాగుతున్నాయి. శ్రీకాంత్ స్పందిస్తూ, 'ఇందులో తెలివైన జర్నలిస్టు పాత్రలో నటించాను. తమ్ముడు అనిల్‌కు నిర్మాతగా ఇది తొలి చిత్రం. మా ఇద్దరికే కాకుండా యూనిట్ అంతటికీ ఇదో మంచి చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు.
కాగా నేటి పరిస్థితులలో ఈ కథ అవసరం అనిపించి చేస్తున్న చిత్రమిదని దర్శకుడు నీలకంఠ చెప్పగా, 'సినిమాను ఎక్కువగా అవుట్‌డోర్‌లో చేశాం. సినిమాను వేసవిలో విడుదల చేస్తాం' అని నిర్మాత అనిల్ మేక అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో అజయ్, శివాజీరాజా, కమల్‌కామరాజు, ఆహుతిప్రసాద్, రవివర్మ, శ్రీ, నాగినీడు, రాంజగన్, కిరణ్ వారణాసి, గోపీకృష్ణ, అల్తాఫ్, రూపాలి తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: ఆర్.పి.పట్నాయక్, ఛాయాగ్రహణం: హెచ్.ఎం.రామచంద్ర, ఎడిటింగ్: శంకర్, ఫైట్స్: రవివర్మ, కొరియోగ్రఫీ: సుచిత్ర చంద్రబోస్, నిర్మాత: అనిల్ మేక, రచన, దర్శకత్వం: నీలకంఠ.
No comments:
Post a Comment