- మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం
- వాస్తవాలు తెలుసుకునే బాధ్యత గీతారెడ్డికి అప్పగింత
- బాబా ఆరోగ్యంపై పెనుగొండ కోర్టులో పిటిషన్
- హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించిన దళిత జనసభ
హైదరాబాద్: పుట్టపర్తి సత్యసాయిబాబాకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాధికారులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై సమగ్ర సమాచారాన్ని తెలుసుకుని తమకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. రెవిన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రవిరాజ్, గాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, నిమ్స్ వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంలతో ముఖ్యమంత్రి శుక్రవారం సాయింత్రం సచివాలయంలో అరగంటసేపు సమావేశమయ్యారు. ప్రభుత్వపరంగా బాబాకు వైద్యసేవలు అందించే బాధ్యతను మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డికి అప్పగించారు. ఇప్పటి వరకు తనకు తెలిసిన మొత్తం సమాచారాన్ని మంత్రి గీతారెడ్డి ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి రఘువీరారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బాబా ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు.
కాలేయం పనితీరు మెరుగుపడిందని, మూత్రపిండాలకు డయాలసిస్ కొనసాగుతుందని, కృత్రిమ శ్వాస ఇస్తున్నారని తెలిపారు వైద్యపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ బాబా వయస్సు 85 సంవత్సరాలు దాటిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవల్సివుందన్నారు. ట్రస్టు వ్యవహారాలు పూర్తి పారదర్శకంగా మంత్రి తెలిపారు. ట్రస్టుకు సంబంధించి ఊహాగానాలు ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. సాయిబాబా ట్రస్టు కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం
ఏమాత్రం లేదన్నారు. భవిష్యత్‌లో ట్రస్టు ద్వారా నిర్విగ్నంగా కార్యక్రమాలు కొనసాగడానికి బాబా ఇప్పటికే పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.
బాబా ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్: సాయిబాబా ఆరోగ్యంపై వాస్తవాలు వెల్లడించాలంటూ అనంతపురం జిల్లా పెనుగొండలో భాస్కరరెడ్డి అనే న్యాయవాది శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు కేసు విచారణను శనివారం నాటికి వాయిదా వేసింది. మరోవైపు దళిత జనసభ బాబా ఆరోగ్య విషయంలో రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బాబా పరిస్థితిపై నిజాలు వెల్లడించాలని, ట్రస్టుబోర్టు, ఆసుపత్రి యాజమాన్యంపై అనుమానాలు ఉన్నాయని, బాబాను భక్తులకు చూపించాలని దళిత జనసభ అధ్యక్షుడు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలావుండగా, బాబాకు మందులు ఇవ్వడం కంటే ప్రజల్లోకి తీసుకువస్తే చాలా మంచిదని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కోరారు. బాబాకు ఇంత కష్టం రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment