- చర్చల సరళి వీడియో చిత్రీకరణకు అన్నా డిమాండ్
- తిరస్కరించిన కాంగ్రెస్
- లోక్‌పాల్ బిల్లు పని ప్రారంభం కాకముందే లొల్లి
- సిబల్-హజారేల మధ్య వివాదం
న్యూఢిల్లీ: అవినీతి బెడదను రూపుమాపేందుకు పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును తయారు చేయడం కోసం ఏర్పాటైన సంయుక్త కమిటీ పనిని ప్రారంభించక ముందే వివాదాలలో చిక్కుకొంటోంది. వ్యవస్థలో సమూలమైన మార్పులు రాకుండా కేవలం లోక్‌పాల్ బిల్లుతోనే అవినీతి చీడను నిర్మూలించడం సాధ్యపడదన్న కేంద్ర మంత్రి కపిల్ సిబల్‌పై ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే తీవ్రపదజాలంతో విరుచుకుపడగా, పారదర్శకత కోసం సంయుక్త కమిటీ సమావేశాల చర్చల సరళిని పూర్తిగా వీడియో కెమేరాలతో చిత్రీకరించి ఎప్పటికప్పుడు విడుదల చేయాలన్న అన్నాహజారే తాజా డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా తిరస్కరించింది. అవినీతి జాడ్యాన్ని రూపుమాపడం కోసం పటిష్ఠమైన బిల్లును తయారు చేసే ప్రధాన లక్ష్యం కన్నా అన్నాహజారే బృందానికి సమావేశాల చర్చలను వీడియో తీయించి ప్రచారం చేసుకోవడంపైనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోందని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన ఒక పత్రికాగోష్టిలో దుయ్యబట్టారు.
అత్యంత ప్రాముఖ్యత కల్గిన లోక్‌పాల్ బిల్లులో పొందుపరచాల్సిన అంశాలపై క్షుణ్ణంగా, లోతైన చర్చ జరగాల్సిన సంయుక్త కమిటీ సమావేశాలను చిత్రీకరించి ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తే సమావేశాల్లో చర్చల సరళి కేవలం ప్రచార కండూతికే పరిమితమౌతుందని, అసలు లక్ష్యం దెబ్బతినే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఆమోదిస్తున్న వివిధ బిల్లులను క్లాజుల వారీగా లోతుగా అధ్యయనం చేస్తున్న వివిధ స్థాయీ సంఘాల సమావేశాలను కూడా టెలివిజన్ చానళ్లలో ప్రసారం చేయడం ప్రారంభిస్తే ఏ ఒక్క బిల్లు అయినా చట్టరూపం ధరించే అవకాశముంటుందా అని ఆయన ప్రశ్నించారు.
రాజ్యాంగం అనుమతించకపోయినా అవినితిని అరికట్టేందుకు సమర్థమంతమైన లోక్‌పాల్ బిల్లును రూపొందించాలనే చిత్తశుద్ధి ఉన్నందునే ప్రభుత్వం పౌరసమాజ ప్రతినిధులతో సంయుక్త కమిటీ ఏర్పాటు విషయాన్ని గెజిట్‌లో ప్రచురించిందని గుర్తు చేస్తూ ఇప్పటికీ ప్రభుత్వ ఉద్దేశాలపై లేనిపోని అనుమానాలు, సందేహాలను కల్గించే విధంగా అన్నాహజారే సంయుక్త కమిటీ చర్చలను బహిర్గత పరచాలని, వీడియో తీయాలనే కొత్త వివాదానికి తెరతీయడం దురదృష్టకరమని అభిషేక్ సింఘ్వీ అన్నారు. లోక్‌పాల్ బిల్లు రూపకల్పన ప్రక్రియ ప్రారంభమౌతున్న సమయంలో ఇలాంటి కొత్త వివాదాలను లేవనెత్తడం,
ఆరోపణలు, ప్రత్యారోపణలు అసలు లక్ష్యసాధనకు ప్రాధాన్యతను తగ్గించడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దశలో కమిటీ సభ్యులంతా పటిష్టమైన బిల్లు రూపొందేలా ఏకాభిప్రాయాన్ని సాధించే కృషిలో నిమగ్నం కావాలే తప్ప ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేలా, ప్రచార పటాటోపాలకు ప్రాధాన్యతనివ్వరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. సంయుక్త ముసాయిదా రూపకల్పన కమిటీ నియామకాన్ని ప్రకటిస్తూ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడానికి కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికంగా వ్యతిరేకమని ఆయన పునరుద్ఘాటించారు. అయినప్పటికీ, అత్యంత ప్రాధాన్యత కల్గిన లోక్‌పాల్ బిల్లు త్వరగా తయారై ఆమోదం పొందేలా చూడాలన్న ఏకైక లక్ష్యంతోనే నోటిఫికేషన్‌కు ప్రభుత్వం సిద్ధపడిందని ఆయన వివరించారు. అయితే, భవిష్యత్తులో మరే అంశంపైనా ఇలాంటి కమిటీలు ఏర్పడినా నోటిఫికేషన్లు జారీచేసేందుకు తాము అంగీకరించబోమని సింఘ్వీ స్పష్టం చేశారు.
ఏకాభిప్రాయంతోనే నిర్ణయం: బిల్లు తయారీకి ఏర్పాటైన సంయుక్త సంఘంలో సభ్యుడైన కేంద్ర జలవనరులు, మైనారిటీ వ్యవహారాల శాఖల మంత్రి సల్మాన్ కుర్షీద్ కూడా అన్నాహజారే తాజా డిమాండ్‌పై పెదవి విరిచారు. కమిటీ విధి, విధానాలను కమిటీయే రూపొందించుకొంటుందని ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ కమిటీ సమావేశాల వీడియో చిత్రీకరణపై కూడా కమిటీ సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. వీడియో తీయించడం, దానిని విడుదల చేయడం వంటి సున్నితమైన అంశాలపై సంయుక్త కమిటీ సభ్యులెవరూ వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరైంది కాదంటూ ఆయన అన్నాహజారే వైఖరిని తప్పుబట్టారు. సంయుక్త కమిటీ తొలి సమావేశం ఈ నెల 16 వ తేదీన జరుగనున్నదని, ఆ సమావేశంలో కమిటీ పని పద్ధతులను ఏకాభిప్రాయంతో నిర్ణయించుకుని ముందుకు సాగుతామని మంత్రి తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌సిబల్ ఆదివారంనాడిక్కడ ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లుతో పేదలు, బడుగు వర్గాల సమస్యలన్నీ పరిష్కారమౌతాయనుకోవడంలో అర్థం లేదనడాన్ని తప్పుబట్టిన అన్నాహజారే లోక్‌పాల్ వ్యవస్థతో ఎలాంటి ప్రయోజనం లేదనుకొంటే మంత్రి బిల్లు ముసాయిదా రూపకల్పన కమిటీ నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు. అయితే, తన వ్యాఖ్యలపై ఆ తర్వాత వివరణ ఇచ్చిన కపిల్ సిబల్ తాను లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు.
సమాజం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలను రూపుమాపడానికి వ్యవస్థలో సమూలమైన మార్పులు అవసరమన్నదే తన అభిప్రాయమని వివరణ ఇచ్చారు. 'లోక్‌పాల్ బిల్లుతో అన్ని సమస్యలు మాయమైపోతాయనుకోవడం సరైంది కాదు, పేద విద్యార్థి విద్యాభ్యాసానికి అవకాశాలు లేకపోతే లోక్‌పాల్ బిల్లు వారికి ఎలా సహాయపడగలుగుతుంది, పేదలెవరైనా అనారోగ్యానికి గురై మెరుగైన చికిత్స కావాలనుకొన్నప్పుడు తనకు అందుబాటులో ఉండే రాజకీయ నాయకుని సహాయం అర్థిస్తాడు, అప్పుడ లోక్‌పాల్ బిల్లు అతనికి ఏమైనా ఉపయోగపడుతుందా?' అని కపిల్ సిబల్ ప్రశ్నించినట్లుగా వార్తలు వచ్చిన విషయం విదితమే.
యుపిఎ చిత్తశుద్ధిని శంకించిన బిజెపి: మంత్రులు కపిల్‌సిబల్, సల్మాన్ కుర్షీద్‌ల ప్రకటనలు చూస్తుంటే అవినీతిని అరికట్టేందుకు తోడ్పడే లోక్‌పాల్ బిల్లుపై యుపిఎ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిపై సందేహాలు కలుగుతున్నాయని బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ విమర్శించారు. బిల్లు ముసాయిదా రూపకల్పన కమిటీ తన పనిని ప్రారంభించకముందే లోక్‌పాల్ బిల్లు విషయంలో మంత్రులిద్దరు చేసిన ప్రకటనలు ప్రభుత్వ ఉద్దేశాలను ప్రతిబింబిస్తున్నట్లుగా ఉన్నాయన్న అనుమానాన్ని ఆమె సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన పత్రికా గోష్టిలో వ్యక్తం చేశారు. సంయుక్త కమిటీలో ఏకాభిప్రాయాన్ని సాధించి ఉత్తమమైన బిల్లును రూపొందించాలన్న ఆసక్తి ప్రభుత్వానికి ఉన్నట్లుగా లేదని ఆమె దుయ్యబట్టారు. కమిటీ మొదటి సమావేశం కూడా జరుగకముందే కమిటీ సభ్యులైన మంత్రులు చేస్తున్న వివాదాస్పద ప్రకటనలు కమిటీలో సభ్యులైన పౌరసమాజ ప్రతినిధులతో సంఘర్షణను కోరుకొంటున్నట్లుగా కనిపిస్తున్నాయని విమర్శించారు.
స్పెక్ట్రమ్ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు ప్రభుత్వానికేమీ ఆదాయ నష్టం జరుగలేదని, స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అసలు అవకతవకలు, అక్రమాలే జరుగలేదని వాదించిన కపిల్ సిబల్‌కు ముందు ఒకటి చెప్పడం, ఆ తర్వాత మాట మార్చడం అలవాటేనని నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు. మంత్రులు చేస్తున్న ఇలాంటి ప్రకటనలు ప్రజల్లో పటిష్టమైన బిల్లు తయారౌతుందన్న విశ్వాసాన్ని కల్గించలేవని చెప్పారు. ప్రముఖ గాంధేయవాది అన్నాహజారే దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా పెల్లుబికిన ప్రజావెల్లువకు భయపడే ప్రభుత్వం సంయుక్త కమిటీ ఏర్పాటుకు అంగీకరించిందనడంలో ఎలాంటి సందేహం లేదన్న ఆమె అవినితిని సమర్థమంతంగా అంతమొందించగల లోక్‌పాల్ చట్టం చేస్తామన్న వాగ్దానాన్ని యుపిఎ నిలబెట్టుకోలేకపోతే ప్రజలే దానికి తగిన బుద్ధి చెబుతాని హెచ్చరించారు.
No comments:
Post a Comment