- అబ్కారీ శాఖపై మద్యం వ్యాపారుల కన్నెర్ర
- పార్టీలకు, ప్రభుత్వానికి కోట్లు ఇస్తుంటే వ్యాపారానికి తూట్లు పొడుస్తారా అంటూ ఆగ్రహం
- మద్యం సిండికేట్లలో అత్యధిక శాతం రాజకీయ నేతలే
- ప్రభుత్వంపై ఒత్తిడికి సంప్రతింపులు
హైదరాబాద్: అటు ప్రభుత్వానికి, ఇటు వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్న మద్యం వ్యాపారానికి సంబంధించి ఆయా బ్రాండ్ల ప్రచారంపై ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించడం మద్యం సిండికేట్లకు నచ్చడం లేదు. మద్యం బ్రాండ్లపై నేరుగా ప్రచారాన్ని ఇప్పటికే నిషేధించారు. దీంతో ఆయా బ్రాండ్ల వారు సోడా పేరుతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలను గుప్పిస్తున్నాయి. మోడల్స్‌తో సెక్సీ ఫోజులతో కేలండర్లు తయారు చేసి మద్యం షాపుల్లో తగిలిస్తున్నారు. హోర్డింగ్‌లతో సహా అన్నిరకాల వ్యాపార ప్రకటనల్లోనూ ఆయా బ్రాండ్ల ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పబ్‌లు, బార్లు, మద్యం షాపుల్లో అధిక భాగం మద్యం వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి నిర్వహిస్తున్నారు. ఈ సిండికేట్లకు బినామీగా అన్ని రాజకీయపార్టీలకు చెందిన నేతలే ఉన్నారన్నది బహిరంగ రహస్యం. కాగా, తాజాగా ఈ రకమైన ప్రచారాన్ని కూడా నిషేధించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించి అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో సిండికేట్ల నోట్లో వెలక్కాయ పడింది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని పావులు కదుపుతున్నాయి. సిండికేట్లన్నీ రాజకీయమయమే. అన్ని పార్టీలకు చెందిన రాజకీయవేత్తలు సిండికేట్లలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సిండికేట్లు సాగుతున్నాయి. తాజాగా బ్రాండ్ల ప్రచారాన్ని కూడా అబ్కారీ శాఖ అడ్డుకోవడంతో మరోసారి పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
బ్రాండ్ల ప్రచారం నియంత్రించడానికి అబ్కారీ శాఖ తీసుకుంటున్న చర్యలు వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, వైన్‌షాపులు, హోటళ్లు, వినోద ప్రాంతాల్లో మద్యం బ్రాండ్లపై అడ్వర్టైజ్‌మెంట్లు ప్రదర్శించిన పక్షంలో జరిమానా విధించడం, మూసివేత ఆదేశాలు జారీ చేయడం లాంటి పరిణామాలు ఉత్పాదక, వ్యాపార వర్గాలను కలవరపెడుతోంది. మద్యం వ్యాపారం వేల కోట్లతో సాగుతోంది. బ్రాండ్లను ప్రచారం చేయడానికి వందల కోట్లు వ్యయం చేస్తున్నారు. దేశంలోని అన్ని రకాల ప్రచార, ప్రసార మాద్యమాలను మద్యం వ్యాపారులు తమ ఉత్పత్తుల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. పత్రికలు, టెలివిజన్‌లకు ఇదో లాభసాటి భేరం. గత సంవత్సరం దేశంలోని ప్రైవేటు టెలివిజన్ సంస్థలు మద్యం ప్రచార ప్రకటనలతో రూ. 167 కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందాయి. దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లోని దినపత్రికలు
రూ. 250 కోట్ల మేరకు అడ్వర్టైజ్‌మెంట్లుగా లాభం పొందాయి. దేశంలో మద్యం వ్యాపారం 3.60 బిలియన్లు అని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. మద్యం బ్రాండ్లతో ప్రత్యామ్నాయ ఉత్పత్తులను ప్రచారం చేయడం సర్వసాధారణం. మద్యం ప్రచారంపై నిషేధం ఉన్నప్పటికీ ఉత్పాదక సంస్థలు వందల కోట్లతో అడ్వర్టైజ్‌మెంట్లు రూపొందించడం, వాటిని వివిధ ప్రచార, ప్రసార మాద్యమాల ద్వారా ప్రచారంలో పెట్టి విక్రయాలు పెంచుకొనడం దేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇలాంటి ప్రకటనలను నిషేధించడాన్ని వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మద్యంపై ప్రచారం నిషేధం కొత్తేమీ కాదని, పాత నిబంధనలు సక్రమంగా అమలు జరపడానికి ప్రయత్నిస్తున్నామని ఎక్సైజ్ కమిషనర్ వినోద్ కె. అగర్వాల్ పేర్కొన్నారు. ప్రచార, ప్రసార మాద్యమాల్లో మద్యం ప్రచారం నిషేధం అని వివరించారు. దేశ వ్యాప్తంగా నిషేధం అమలులో ఉందని పేర్కొన్నారు. మద్యం ప్రభావం యువతపై పడకుండా చర్యలు తీసుకోవలసి ఉందని వివరించారు. మద్యం అలవాటును తగ్గించడం ప్రధానం అని చెప్పారు. మద్యం ప్రచార ప్రకటనలు అశ్లీలంగా ఉంటున్నాయని, అలాంటి ప్రచారం సమాజానికి ఎట్టి పరిస్థితిలో దోహదపడబోదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
స్వదేశంలో తయారు చేయబడుతున్న విదేశీ మద్యం బ్రాండ్ల ప్రచార ప్రకటనలు తమ షాపుల్లో ప్రదర్శించిన నగరంలోని 20 వైన్ షాపులకు ఇప్పటికే మూసివేత నోటీసులు జారీ చేశారు. కొన్ని హోటళ్లను గుర్తించి రూ. 5000 వరకు జరిమానా విధించారు. పబ్‌లు, క్లబ్‌లకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. షాపులు, బార్లు, హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లలో అడ్వర్టైజ్‌మెంట్లను ప్రదర్శించరాదని ఆదేశించడంతో అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ప్రదర్శిస్తున్న బోర్డులను కప్పేస్తున్నారు. అబ్కారీ శాఖకు చెందిన ప్రత్యేక బృందం ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. విస్కీ, రమ్, వోడ్క, బీర్, జిన్, వైన్‌ల ప్రచార ప్రకటనలు సభ్య సమాజం తలదించుకొనే విధంగా ఉంటుందని మద్యం వ్యతిరేక పౌర సమాజం ఇటీవల ఎక్సైజ్ అధికారులకు విజ్ఞాపన పత్రం అందచేయడంతో పాత నిబంధనల దుమ్ము దులుపుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి మద్యం ప్రచారంపై దేశ వ్యాప్తంగా నిషేధం అమలు జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలోను మద్యం బ్రాండ్లు బహిరంగంగా వ్యాపార దృక్పథంతో ప్రచారం చేయడానికి వీలు లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించిన ఉత్పాదక సంస్థ్థలు వివిధ కార్యక్రమాలను సమర్పించడం లాంటి ఒప్పందాలు కుదుర్చుకొని తమ బ్రాండ్లను పరోక్షంగా ప్రచారంలో పెడుతున్నాయి. మోడల్స్‌తో అశ్లీల పోస్టర్లు తయారు చేసి బార్లు, వైన్ షాపులు, హోటళ్లు, పబ్‌లలో ప్రచారంలో పెడుతున్నారు. ఇలాంటి ప్రచారం పట్ల పౌర సమాజం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల పరిధిలో మద్యం ప్రచారం నియంత్రించాలని అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచింది.
అశ్లీలతకు తావు లేని విధంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల పరిధిలో మద్యం ప్రచారం చేసుకొనడానికి ఉత్పాదక సంస్థలు అనుమతి పొందడంతో పాటుగా అదనపు రుసుము చెల్లించవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. పొగాకు ఉత్పత్తుల ప్రచారం కొన్ని ఆంక్షల పరిధిలో జరుగుతుంది. ఆల్కహాల్ ఉత్పత్తుల ప్రచారంపై కూడా ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంటున్నారు. వ్యాపారం వృద్ధి చేసుకొనేందుకు ప్రచారం ఎంత ముఖ్యమని భావిస్తుంటారో దాని దుష్ప్రభావం ప్రజలపై పడకుండా జాగ్రత్త పడటం ప్రభుత్వ బాధ్యత అని వివరించారు. అధికారుల ఆంక్షలను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర మద్యం వ్యాపారులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తేవడానికి సిద్ధమయ్యారు.
పబ్‌ల యాజమాన్యాలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాస్త విరామం దొరిగిన సమయంలో వినోదం కోసం వచ్చే మద్యం వినియోగదారుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని తెలిపారు. యువతను ఉర్రూతలూగించే ప్రచారం పరిమితంగానైన అనుమతించాలని కోరుకుంటున్నారు. మద్యం సేవించే వారి సంఖ్య రాష్ట్ర జనాభాలో 62 శాతం వరకు ఉంది. మద్యం విక్రయాల్లో షావాలెస్, యునైటెడ్ బ్రెవరీస్ వాటా 53 శాతం వరకు ఉంది. ఈ రెండు ఉత్పాదక సంస్థల బ్రాండ్లు దేశంలో అత్యధికంగా విక్రయించబడుతుంటాయి. బ్రాండ్ల ప్రచారం కోస వేల కోట్లు వ్యయం చేస్తుంటారు. రాష్ట్రాల వారీగా ప్రచార వార్షిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపారం వృద్ధి చేసుకొనేందుకు వ్యాపారులకు ప్రోత్సాహకాలు, బహుమతులు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తుంటారు. ప్రతి బ్రాండ్ కొనుగోలుపై వ్యాపారులకు అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పించి వారి విక్రయ కేంద్రాల్లో ప్రచార పోస్టర్లను ప్రదర్శిస్తుంటారు.
No comments:
Post a Comment