- అవివాహితులే జనహితులు!
- కొన్ని కుటుంబాలకే పరిమితమౌతున్న జాతిసంపద
- సంపద పెరుగుతున్నా సామాన్య జన జీవితాల్లో మార్పు కానరాని స్థితి
- బ్యాచిలర్ లీడర్స్‌వైపే మొగ్గుచూపుతున్న ఓటర్లు
- కుటుంబ పెద్ద అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని దోచేస్తున్న వారసులు
- వ్యాపార, వాణిజ్య వేత్తలు, బ్యూరోక్రాట్లదీ అదే దారి
న్యూఢిల్లీ: మమతాబెనర్జీ, జయలలిత, నరేంద్రమోడి, నవీన్‌పట్నాయక్, మాయావతి, రాహుల్‌గాంధీ వీరందరినీ ఒకేగాటన కట్టిన అంశమేది?. వీరంతా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లో పేరెన్నికగన్న రాజకీయ వేత్తలు. అంతేకాదు.. వీరంతా వివాహానికి దూరంగా ఉన్నవారే. ఒంటరిగా బ్రతుకుతున్నవారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 19వ శతాబ్దపు ఐరీష్ విమర్శకులు ఆస్కార్ ఫింగల్ విల్స్ విండే ఓ సందర్భంలో పెళ్ళికాని, సొంత కుటుంబంలేని రాజకీయవేత్తలు, పాలకులు నెమ్మదిగా సమాజాన్నే తమ సొంతకుటుంబంగా భావించడం మొదలుపెడతారు... తమకుతాము సమాజానికి చెందిన ఆస్తి గానే వారు పరిగణించుకుంటారంటూ వ్యాఖ్యానించారు.
గత కొన్నేళ్ళుగా భారతీయ ఓటర్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పొచ్చింది. బ్యాచెలర్ నాయకులవైపే వారు మొగ్గుచూపుతున్నారు. వారినే విశ్వసిస్తున్నారు. పెళ్ళి చేసుకోకుండా భవబంధాలకు దూరంగా సొంత కుటుంబ సభ్యులంటూలేని వారికే పట్టం గడుతున్నారు. వారిచేతుల్లోనే దేశం, సమాజం భద్రంగా ఉంటాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక అధ్యయనం జరిగింది. ఈ మార్పుకు అవినీతే ప్రధాన కారణమని అధ్యయనకారులు తేల్చేశారు. ప్రస్తుతం భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య అవినీతే. గల్లీ నుంచి జాతీయ స్థాయి వరకు దేశం అవినీతిలో కూరుకుపోయింది. ఈ కారణంగానే ప్రపంచంలో భారత్ ప్రతిష్ఠ మసకబారుతోంది. దేశంలో దారిద్య్రం తాండవిస్తోంది. వ్యక్తిగత ఆదాయ వృద్ధి చోటు చేసుకోవడం లేదు. సంపద ఎంత పెరిగినా సాధారణ ప్రజల జీవితాల్లో వెలుగుకనబడటంలేదు. సంపదంతా కొన్ని కుటుంబాలకే పరిమితమైంది. అవినీతి విశృంఖల వ్యాప్తికి ప్రధాన కారణం రాజకీయం. దాన్ని ఆసరా చేసుకునే కార్పొరేట్ వ్యవస్థలు, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్‌లు కూడా అవినీతిలో కూరుకుపోతున్నారు. అవినీతి నిరోధానికి తొలిప్రయత్నం రాజకీయ ప్రక్షాళనే అన్న విశ్వాసం భారతీయుల్లో ఏర్పడింది. ఏపార్టీ.. ఏ రాజకీయ.. ఏ ప్రాంతానికి చెందిన పాలకుడైనా సరే తన పదవీకాలం ముగిసేలోగా పదితరాలకు సరిపడే సంపాదన పోగేసేయాలన్న దుగ్ధ కనబరుస్తున్నారు. దీంతో కుర్చీ ఎక్కీఎక్కగానే వ్యక్తిగతంగా కలిసొచ్చే పనులకే ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబ అభివృద్ధికి పనికొచ్చే పథకాలనే అమలు చేస్తున్నారు. ఈలోగా కుటుంబ సభ్యులు కూడా రంగంలో దిగుతున్నారు. కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు ఇలా తలొకరు ఒక్కో శాఖను, ప్రాంతాన్నీ పంచేసుకుంటున్నారు. కుటుంబపెద్ద అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాష్ట్రాన్ని, దేశాన్ని, దేశంలోని సంపదల్ని దోచేస్తున్నారు. కాంట్రాక్టుల నుంచి పరిశ్రమల వరకు ప్రతిదానిలోను వేలెట్టి లక్షలు, కోట్లు పోగేస్తున్నారు. అతి నిరుపేద కుటుంబం నుంచి రాజకీయాల్లోకొచ్చి జార్ఖండ్‌లాంటి చిన్న రాష్ట్రానికి ఏడాది మూడునెలలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మధుకొడా ఐరోపా ఖండంలో సొంతంగా ఓ దీవిని, బొగ్గు గనుల్ని కొనుగోలు చేశారు. దేశంలోని శ్రీమంతుల్లోనే ఒకరయ్యారు.
ఇలాంటి పాలకుల వైఖరే దేశ ఓటర్ల మనోగతంలో మార్పును తెచ్చింది. సొంత కుటుంబమంటూ ఉన్న పాలకులు ప్రజలు, రాష్ట్రం, దేశం కంటే కుటుంబం కోసమే తాపత్రయ పడుతుండడంతో అసలు సొంత కుటుంబమే లేని వ్యక్తుల పట్ల ఆకర్షణపెరిగింది. గత దశాబ్దంలో ఇది మరింత జోరందుకుంది. గుజరాత్ సిఎంగా నరేంద్రమోడి మూడుసార్లు వరుసగా గెలిచినా.. దేశంలోనే అత్యంత క్లీన్ ఇమేజ్ సంపాదించగలిగినా.. ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలుగుతున్నా.. ముఖ్యమంత్రుల్లో నెంబర్ వన్‌గా గుర్తింపు పొందినా ఇదంతా ఆయనకు సొంతకుటుంబమంటూ లేనందువల్లే. ఆయనలో సంపాదించి వెనకేసేయాలన్న తాపత్రయం కనబడదు. అలాగే నవీన్‌పట్నాయక్. ఒడిషాలో ప్రధాన పార్టీల్ని కూడా కాదని ప్రాంతీయ పార్టీ నేతగా ఆయన వరుస విజయాల్ని సాధిస్తున్నారు. దేశంలో అత్యంత క్లీన్ ఇమేజ్ పొందగలిగారు. పెళ్ళికాని మాయావతిపట్ల యుపిలో అత్యంత ప్రజాదరణ వ్యక్తమౌతోంది. పార్టీపరంగా తప్ప ఆమెపై వ్యక్తిగత అవినీతి ఆరోపణలకు తావులేకుండా పోయింది. నితీష్‌కుమార్ భార్య మంజుకుమార్ నిన్హా మరణానంతరం కుమారుడు నిశాంత్‌ను దూరంగా పెట్టడంతోనే ఆయనకు రాజకీయప్రభ జోరందుకుంది. నితీష్‌పై బీహారీల్లో విశ్వాసం పెరిగింది. వరుసగా రెండోసారి ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించగలిగారు. దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా పశ్చిమబెంగాల్, తమిళనాడులపైనే జాతీయ, అంతర్జాతీయ పరిశీలకుల దృష్టిపడింది. దీనిక్కారణం మమతాబెనర్జీ, జయలలితలే. వీరిద్దరూ అవివాహితులే. ఇద్దరికి సొంతకుటుంబాల్లేవు. ఇంతవరకు వెల్లడైన అన్ని ఎన్నికల అధ్యయనాల్లోనూ వీరిద్దరు విజయం సాధించి అధికారంలోకి రావడం తథ్యమని తేలుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి వ్యక్తిగతంగా ఎలాంటి వారైనప్పటికీ కుటుంబ సభ్యుల కారణంగా అవినీతిముద్రకు గురయ్యారు. పార్టీ నుంచి ప్రభుత్వం వరకు అన్ని అంశాల్లోను కొడుకులు, కూతురు, సమీప బంధువుల ప్రమేయం పెరిగింది. ఆఖరకు కేంద్రమంత్రి పదవుల్ని పొందడం నుంచి దేశంలోనే అతిపెద్ద 2జి స్పెక్ట్రమ్ స్కామ్ వరకు కరుణానిధి కుటుంబ సభ్యుల పాత్ర బయటపడింది. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా కుటుంబ సభ్యుల తాకిడితో అవినీతి ఆరోపణల పాలయ్యారు. ఓ దశలో పదవిని కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. చివరకు భార్యతో సహా అందరినీ అధికార నివాసానికి దూరంగా పెట్టి ఒంటరిగానే జీవిస్తుండడంతో ప్రభుత్వంపై వారి ప్రభావం తప్పింది. యాడ్యురప్పకు తిరిగి మనుగడ సాధ్యపడింది. ఎబివాజ్‌పేయి కున్న వ్యక్తిగత ఇమేజ్ బిజెపితో సహా మరే పార్టీలోనూ మరెవరికీ లేదు. ఇందుకుకారణం ఆయన బ్యాచెలర్ కావడం. అలాగే బిజెపిలో దివగంత కుశభావ్‌ఠాక్రే, పిఎసి చైర్మన్ మురళీమనోహర్‌జోషిలకు క్లీన్ ఇమేజ్ ఉంది. గతంలో యుపి ముఖ్యమంత్రిగా పనిచేసిన కళ్యాణ్‌సింగ్ కూడా ఈ కారణంగానే ఎలాంటి అవినీతి ఆరోపణలకు గురికాలేదు. వెస్ట్‌బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను కూడా అవినీతి ఆరోపణలపై ఎవరూ వేలెత్తి చూపలేరు. వీరంతా అవివాహితులే. సిపిఎమ్ కూటమి దీర్ఘకాలం పదవిలో కొనసాగడంవల్ల కొంత వ్యతిరేకత ఉండొచ్చు తప్ప వ్యక్తిగతంగా భట్టాచర్యపై ఎలాంటి ఆరోపణల్లేవు. ఈ విషయాన్ని గుర్తించడం వల్లే రాహుల్‌గాంధీ పెళ్ళికి దూరంగా ఉన్నట్లు పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. బ్యాచెలర్స్‌ను నమ్మినంతగా ప్రస్తుతం కుటుంబంతో ఉన్న రాజకీయవేత్తల్ని భారతీయులు విశ్వసించడంలేదు. వారిచేతుల్లో తమకూ, దేశానికీ భద్రత లేదన్న భయం వారిలో వ్యక్తమౌతోంది.
No comments:
Post a Comment