ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
భువనగిరి : అత్యంత దారుణమైన ప్రేమోన్మాద ఘటన నల్గొండ జిల్లా భువనగిరిలో బుధవారం వెలుగు చూసింది. ప్రేమించిన ప్రియుడే కాలయముడై క్షణికావేశంలో ప్రియురాలి ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. నెల రోజుల క్రితం ప్రియురాలిని హతమార్చిన ప్రేమికుడు పోలీసులకు లొంగిపోవడంతో తీగలాగకుండానే డొంకంతా కదిలింది. పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన రుక్సాన బేగం, షబ్బీర్ అలీ గత 3సంవత్సరాలుగా గాఢంగా ప్రేమించుకున్నారు. నెల 13న షబ్బీర్ ద్విచక్రవాహనంపై రుక్సానాను తీసుకొని ప్రభుత్వ ఐటిఐ వద్ద గల గుట్టల ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన సంభాషణను బట్టి రుక్సానా తనను వివాహం చేసుకోవాల్సిందిగా షబ్బీర్ పై వత్తిడి తేగా అతను కొంత కాలం ఆగుదామని నచ్చచెప్పే ప్రయత్నంలో మాటామాట పెరిగి ఊహించని దారుణానికి దారి తీసింది. ఈ క్రమంలో షబ్బీర్ రుక్సాన తలపై రాయితో మోదగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ఆందోళనకు గురైన షబ్బీర్ రుక్సాన శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆరోజు నుంచి రుక్సాన కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు గత నెల 27న మిస్సింగ్ కేసును స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయించారు. సంఘటన తర్వాత షబ్బీర్ కనిపించకుండా పోయాడు. బుధవారం పోలీసుల ముందు ప్రత్యక్షమై హత్యకు తానే కారణమంటూ లొంగిపోయాడు. తన వెంట పోలీసులను సంఘటన స్థలానికి తీసుకవెళ్లి జరిగినదంతా చెప్పాడు. ఈసంఘటనను పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు డిఎస్పీ ఎం యాదయ్య , సిఐ కోట్ల నర్సింహారెడ్డి, ఎస్సై శంకర్ గౌడ్ తెలిపారు.
No comments:
Post a Comment