ఏనుగెట్టుల తన బలమెఱుగలేదొ...అట్టులైనారు మన భారతీయులు నేడు'' మావటి చెప్పినట్లుగా వినితాను 'కూర్చో' అంటే కూర్చుంటుంది, 'లెయ్' అంటే లేస్తుంది. అటులనే ఈనాడు భారతీయులు పాశ్చాత్య విద్యల ప్రభావాన్ని పురస్కరించుకొని వాళ్లు చెప్పినట్లు చేస్తున్నారు. భారతీయులు ఎంతో శక్తి కలిగినటువంటివారు; భక్తి ప్రపత్తులచేత నిండినటువంటి హృదయం గలవారు. పుట్టినప్పటి నుంచి భారతీయులు భగవత్ నామస్మరణ లేకుండా ఎవ్వరూ లేరు. పిల్లల పేర్లయినా పెట్టుకొని భగవత్ నామస్మరణ చేసుకుంటున్నారు. ప్రతి పల్లెలో కూడా కనీసం ఒక చిన్న గుడిసె అయినా పెట్టుకొని, అందులో సీతారామలక్ష్మణసమేత ప్రతిమలను పెట్టుకొని పూజిస్తుంటారు. రాముని గుడి లేని గ్రామంగాని, రామనామాన్ని స్మరించని మానవులుగాని భారతదేశంలో ఎక్కడా లేరంటే అతిశయోక్తి లేదు. మొదటి నుండి భారతదేశం ఆధ్యాత్మిక మార్గాన్ని అభివృద్ధి చేసినటువంటిది లౌకిక, భౌతిక మార్గాలలో ఎప్పుడూ ప్రవేశించలేదు. భారతీయులు ఇంత క్షేమంగా ఉండటానికి మూలకారణం భక్తిమార్గంలో పయనించడమే! వేరే దేశాలలో అనేక కష్టనష్టాలకు, దు:ఖాలకు గురి అవుతున్నాయికాని, భారతదేశీయులకు ఎట్టి ఇబ్బందికూడను లేదు. ఆర్థిక పరిస్థితియందు కొంత లోనయినప్పటికినీ వారు ఏదో ఒకరీతిగా కాలాన్ని భగవంతునికి అర్పితం చేసుకొని బ్రతుకుతూ వస్తున్నారు.
ఆత్మారామా-అనంతరామా...
ఎన్ని కష్టాలు వచ్చినప్పటికినీ తట్టుకొని నెట్టుకొని అభివృద్ధివైపు పయనించినవారు భారతీయులు. భారతీయులు ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసం కలిగినవారే. అంతేకాని, వస్తువులపైన, ఉద్యోగాలపైన, ఆస్తులపైన ఆధారపడినటువంటివారు కాదు. వారెప్పుడుకూడను ఆత్మవిశ్వాసాన్ని ఆధారం చేసికొన్నవారు. ఇట్టి భారతీయులకు లౌకికం, భౌతికం ఏ విధంగా తెలుస్తుంది? ప్రతిదానికికూడను ఆత్మవిశ్వాసంపై ఆధారపడినటువంటివారు భారతీయులు. ''నాఆత్మా రామునికే తెలుసును'' అంటారు. రాములంటే ఏదో ఒక రూపమనిగాని, కృష్ణుడంటే ఏదో ఒక రూపమని గాని...అది కాదు వాళ్లు నమ్మినటువంటిది. అవన్నీ కూడను కేవలం పుట్టిన రూపాలు. కాని, పుట్టని రూపం హృదయమే. ఆ
హృదయంపైనే వాళ్లు ఆధారపడి ఈనాటి వరకు కూడను ఎన్ని కష్టాలపాలైనా, ఎన్ని నష్టాలపాలైనా, ఎన్ని దు:ఖాలపాలైనా భరిస్తూ, సహిస్తూ వచ్చారు. 'సుఖ దు:ఖే కృత్వా లాభా లాభౌ జయా జ¸°'' సుఖ దు:ఖాలు లేని జీవితం ఎక్కడా ఉండదు. దు:ఖం వచ్చినా, ''ఓహో, ఇది నా సుఖం కోసమే వచ్చింది'' అని భావించుకొనేవారు. అట్టి ఉత్తమ భావాలచేతనే భారతీయులు ఉత్తమ స్థితికి రాగలిగారు. బాంబులు పేలినా, నదులు పొంగినా, విమానాలు కూలినా ఎన్ని విధాల విపత్తులు ఎదురైనప్పటికీ వారందరూ దైవాన్ని నమ్మినవారే. దైవం పైన ఆధారపడి నటువంటి వారికి ఉప్పుడు కష్టం, నష్టం కలుగదు. ఏవో కొన్ని వస్తుంటాయి పోతుం టాయి. అవన్నీ పాసింగ్ క్లౌడ్స్. పుట్టిన ప్రతి వ్యక్తి చావక తప్పదు. జగత్తులో ఏదీ శాశ్వతం కాదు. మోక్షమని, స్వర్గమని, వైకుంఠమని అనుకుంటారు. కాని, ఇవన్నీ ఏవీ శాశ్వతం కాదు. ఆత్మ ఒక్కటియే సత్యం. ప్రపంచంలో ఎన్ని రూపాలు నీవు చూసినప్పటికీ ఏవీ శాశ్వతం కాదు. మనకు శాశ్వతమైనటు వంటిది ఆత్మయే. రామాయణ విషయమే చూసుకుందాం. రాముడు ఎక్కడ పుట్టాడు? అయోధ్యలో పుట్టాడు. అయోధ్య అనగా ఎవరైనా కట్టినటువంటి నగరమా? కాదు, కాదు. విశ్వకర్మ నిర్మించినటువంటి నగరం. అతను నిర్మించినటువంటి అయోధ్యలో ఎవ్వరైనాగాని కాలుపెట్టి జయించడానికి వీలుకాదు. అయోధ్యకు రాజయిన దశరథునికి ముగ్గురు భార్యలు. ఒకరు కౌసల్య, రెండవ భార్య సుమిత్ర, మూడవ భార్య కైక. మొదటి భార్య కౌసల్యకు ఒక ఆడబిడ్డ పుట్టింది. ఆమె పేరు శాంత. కాని, కుమార్తెకు రాజ్యాభిషేకం చేయడానికి వీలుకాదు. కొడుకు కావాలి. ఆ బిడ్డను రోమపాదునికి ఇచ్చి సాకుకోమన్నారు. అతను ఆ బిడ్డను సాకుతూ సాకుతూ అన్ని విద్యలూ నేర్పించాడు. తరువాత ఆమెను ఋష్యశృంగుని కిచ్చి వివాహం చేశాడు. ఒకానొక సమయంలో సుమంతుడు, మంత్రులందరూ చేరి దశరథా! నీవు పుత్రుడు కావాలని ఆశిస్తున్నావు కాబట్టి, నీవు పుత్రకామేష్టి యాగం చేయి. ''ఈ యుగానికి ఆధ్వర్యం వహించడానికి ఎవరు అర్హులు?'' అని ప్రశ్నించాడు, దశరథుడు. ఋష్యశృంగుడు మాత్రమే దీనికి అర్హులు అన్నారు. దశరథుడు, సుమంతుడు, మంత్రులు అందరూ బయలుదేరి ఋష్యశృంగుని దగ్గరకు వెళ్లి ప్రార్థిం చారు. ''నాయనా! అది మా అదృష్టం, మా ప్రాప్తి. తప్పక మేము వస్తాం'' అని చెప్పి ఋష్యశృంగుడు, శాంత ఇరువురూ వచ్చి దశరథునిచే పుత్రకామేష్టి యాగం చేయించారు. అగ్నిగుండమునుండి
యజ్ఞపురుషుడు ఒక పాయస పాత్రను తీసికొని వచ్చి, దశరథునికి ఇచ్చి, ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకు సమానంగా పంచమని చెప్పాడు. దరశరథుడు యజ్ఞపురుషుడు చెప్పినట్లుగా మూడు
కప్పులు తెప్పించి, ముగ్గురికీ సమానంగా పంచాడు.
సుమిత్ర చాలా గుణవంతురాలు. ఆమె పేరే సుమిత్ర సర్వులకు మిత్రురాలైనటువంటిది. కౌసల్య పట్టపురాణి కాబట్టి, ఆమెకు పుట్టిన కుమారునికి పట్టం కట్టవచ్చు. కేకయరాజుకు దరశరథుడు ఇచ్చిన మాట ప్రకారం కైకేయి కుమారునికి పట్టం కట్టవచ్చు. ఏదైతేనేమి, అంతా భగవంతుని సంకల్పమే అని భావించింది. స్నానం చేసి, మిద్దెపైకి వెళ్ళి కప్పును అక్కడ పెట్టింది, వెంట్రుకలు ఆర్చుకుంటూ ఉన్నది. ఇంతలోపల ఒక పెద్ద గద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుపోయింది. చూస్తే కప్పు లేదు. దశరథ మహారాజు, గురువుగారు ఏమంటారో ఏమో నాకింత అలక్ష్యమని దూషిస్తారో ఏమో అని భయపడుతూ సుమిత్ర క్రిందికి దిగి వచ్చింది.
ఈనాటి సవతులవలె ఆనాడు వారు ముగ్గురూ పోట్లాడుకోలేదు. ఒకరికొకరు ఐకమత్యముచేత ఉండేవారు. కౌసల్య వచ్చి, ''చెల్లిd, నీవు బాధ పడనక్కర్లేదు. ఇదిగో, నా పాయసంలో అర్థభాగం నీకిస్తాను'' అన్నది. ఈలోపల కైక వచ్చి, ''అక్కా, మీరేమీ బాధపడనక్కర్లేదు. మనం ముగ్గురం సమానంగా కప్పులో పోసుకొని, వసిష్ఠులవారి ఆశీర్వాదం తీసుకొని పాయసం త్రాగారు. ముగ్గురికీ గర్భమైంది. కౌసల్యకు ఒక కుమారుడు, కైకకు ఒక కుమారుడు, సుమిత్రకు ఇద్దరు కుమారులు పుట్టారు. అనగా ఏమిటి? కౌసల్య ఇచ్చిన అర్థభాగం, కైకేయి ఇచ్చిన అర్థం భాగం రెండూ చేరి ఇద్దరు పుట్టారు. మొదట పుట్టినటువంటివాని పేరు లక్ష్మణుడు. రెండవవాడు శత్రుఘ్నుడు. ఇరువురూ పుట్టినప్పటినుండి పాలు త్రాగరు, నిద్ర పోరు. ఒకటే ఏడుపు, ఏడుపు, ఏడుపు! ఎన్నో మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు వేయించింది. కాని, ప్రయోజనం లేకపోయింది. అప్పుడు గురువైన వసిష్ఠులవారి దగ్గరకు వచ్చి, ''స్వామీ, నా బిడ్డలెందుకు ఈ విధంగా నిద్రించడం లేదు? భుజించడంలేదు? దీనికి కారణ మేమిటి?'' అని అడిగింది. అమ్మా, నీవేమీ భయపడవద్దు. లక్ష్మణుని తీసికొనివెళ్ళి రాముడున్న తొట్టెలో పరుండబెట్టు. శత్రుఘ్నుని గొనిపోయి భరతుని పక్కన పరుండబెట్టు'' అన్నాడు. రాముని పక్కన పరుండబెట్టేసరికి లక్ష్మణునికి, భరతుని పక్కన పరుండ బెట్టేసరికి శత్రుఘ్నునికి ఎంతో ఆనందమైంది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు కూడా భరతునికి సేవ చేయగలడని భావించి సుమిత్ర ఎంతో ఆనందించింది.
రాముడు జనక మహారాజు సభలో శివ ధనుర్భంగం గావించి సీతను వివాహమాడాడు. సీతా రాముల కల్యాణ మహోత్సవం తిలకించడానికి అందరూ ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు.
(శ్రీసత్యసాయిబాబా 3.4.2009లో అనుగ్రహించిన దివ్య సందేహం)
No comments:
Post a Comment