Saturday, April 16, 2011

దిగజారిన ఇన్ఫీ క్యూ-4


ముంబై: స్టాక్‌ మార్కెట్‌ వర్గాలు ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ క్యూ-4 ఆర్థిక ఫలితాలు అంచనాలను చేరలేకపోయాయి. కనీసం ఆ సంస్థ ముందుగా ప్రకటించిన ఆదాయ లక్ష్యాన్ని సైతం తాకకపోడవంతో దాదాపు రెండు సంవత్సరాల తరువాత ఇన్ఫోసిస్‌ ఈక్విటీ ఒక రోజు సెషన్‌లో భారీ నష్టాన్ని నమోదు చేసింది. ఒకవైపు సంస్థ ఆర్థిక ఫలితాల వెల్లడి ప్రారంభం కాగానే బిఎస్‌ఇలో ఇన్ఫీ షేర్‌ ప్రైస్‌ 10 శాతం పతనమైంది.
దేశంలోని రెండవ అతిపెద్ద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థ కన్సాలిడేటెడ్‌ విధానంలో 1,818 కోట్ల రూపాయల నికర లాభాన్ని నాలుగో త్రైమాసికంలో నమోదు చేసింది. గత సంవత్సరం నెట్‌ ప్రాఫిట్‌ 1,779.8 కోట్లతో పోలిస్తే ఇది కేవలం 2.15 శాతం అధికం. సంస్థ ఆదాయం సైతం 2 శాతపు నామమాత్రపు వృద్ధిని నమోదు చేసి 7,105.6 కోట్ల నుంచి 7,250 కోట్లకు చేరింది. అంతకుముందు సంస్థ నికరలాభం 1.856 కోట్లకు, ఆదాయం 7,447 కోట్లకు పెరుగుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. జనవరి-మార్చి మధ్య కాలంలో ఇబిఐటి మార్జిన్లు సైతం తగ్గి 29 శాతానికి చేరాయి. ఇతర అదాయాలు 65 శాతం పెరిగి 252 కోట్ల నుంచి 415 కోట్లకు చేరాయి. ఇపిఎస్‌ 119.41 రూపాయలుగా నమోదైంది.
ఈ మూడు నెలల కాలంలో 3,041 మంది సంస్థను వీడిపోయారు. ఇదే సమయంలో 45 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని సంస్థ వెల్లడించింది.
పాయ్‌ రాజీనామా
కాగా, ఇన్ఫోసిస్‌ బోర్డుకు మోహన్‌దాస్‌ పాయ్‌ రాజీనామా చేశారు. దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇన్ఫోసిస్‌ బోర్డుతో అనుబంధం పెంచుకున్న పాయ్‌ ప్రస్తుతం సంస్థలో టాప్‌-2 పొజిషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. నందన్‌ నిలేకనితో కలసి ఇన్ఫీ ఫౌండర్‌లలో ఒకరైన పాయ్‌ రాజీనామా అనంతరం అతనితోనే కలసి ప్రతిష్ఠాత్మక ఆధార్‌ ప్రాజెక్టుకు సేవలందించాలని నిర్ణయించుకున్నారు. సాధ్యమైనంత త్వరగా తనను విధుల నుంచి తప్పించాలని శుక్రవారం నాడు పాయ్‌ ఇన్ఫోసిస్‌ బోర్డును కోరారు. జూన్‌ 11న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన సంస్థను వీడవచ్చని సమాచారం.
2011-12 కనీస వృద్ధి 5.5 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి వార్షిక వృద్ధి 5.5 శాతం నుంచి 7.3 శాతం మధ్య ఉంటుందని ఇన్ఫోసిస్‌ అంచనా వేసింది. ఇపిఎస్‌ 126.05 నుంచి 128.21 రూపాయల మధ్య ఉంటుందని బోర్డు డైరెక్టర్‌ మోహన్‌ దాస్‌ పాయ్‌ వివరించారు. ఐటి సేవల నిమిత్తం క్లయింట్లు వెచ్చిస్తున్న మొత్తం ఒడిదుడుకులకు లోనవుతోందని, దీనికితోడు మారక ద్రవ్య విలువల్లో మార్పు ఫలితాలపై ప్రభావం చూపుతోందని వివరించారు.
100 కంపెనీలకు సిఇఒలు ఇన్ఫీ ఉద్యోగులే
సమీప భవిష్యత్‌లో కనీసం 100 కంపెనీల్లో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లుగా ఇన్ఫోసిస్‌ ఉద్యోగులను చూడనున్నామని మోహన్‌దాస్‌ పాయ్‌ అభిప్రాయపడ్డారు. సంస్థలో 1.3 లక్షల మంది ఉద్యోగులు అత్యంత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దబడ్డారని, భవిష్యత్‌లో వీరిలో నుంచి కనీసం వంద మంది చిన్న, మధ్య తరహా కంపెనీలకు చీఫ్‌లు కానున్నారని ఆయన అన్నారు. కె దినేష్‌ రాజీనామాపై స్పందిస్తూ, ఆరోగ్య కారణాల వల్లే ఆయన సంస్థకు దూరం కావాల్సి వచ్చిందని వివరించారు.

No comments:

Post a Comment