Saturday, April 16, 2011

వేసవి 'పాట్లు' పై సన్నద్ధం ప్రజావసరాలపై ప్రత్యేక దృష్టి


  • తాగు నీరు, విద్యుత్‌, ఉపాధి కల్పన, వ్యాధుల నివారణకు సత్వర చర్యలు 
  • మేలో ప్రజా పథం, రైతు చైతన్య యాత్రలు 
  • ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం
  • కలెక్టర్లతో సిఎం వీడియో కాన్ఫరెన్స్‌
హైదరాబాద్‌: వేసవిలో తాగునీరు, వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా, వలసల నివారణ, ఉపాధి హామీ పథకం అమలు, అంటువ్యాధుల నియంత్రణకు ముందస్తు ప్రణాళికలతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వేసవిలో ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు, తాత్కాలిక ప్రత్యామ్నాయ ప్రణాళికలు, నిధుల అవసరాలను ప్రత్యేకంగా చర్చించారు. వ్యవసాయానికి విద్యుత్‌ వినియోగం కొంత వరకు తగ్గినప్పటికీ, రాబోవు పక్షం రోజుల పాటు పంటలకు అవసరమైన మేరకు విద్యుత్‌ సరఫరా చేయడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా అత్యంత ప్రాధాన్యం అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
వనరులను గుర్తించడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయడం, విద్యుత్‌ శాఖతో సమన్వయం ఏర్పరచుకొని సకాలంలో సక్రమంగా మంచినీటిని సరఫరా చేయడంపై గ్రామీణ మంచినీటి వ్యవస్థ దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. గ్రామీణ మంచినీటి అవసరాల కోసం రూ. 52 కోట్లు, పట్టణ ప్రాంత మంచినీటి సరఫరా కోసం రూ. 42 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంచినీటి అవసరాల కోసం నిధుల కొరత రానివ్వబోమని తెలిపారు. గ్రామాల్లో వలసలు నివారించాలని ముఖ్యమంత్రి సూచించారు. వేసవిలో ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే కూలి 30 శాతం అధికం చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాబోవు 65 రోజుల పాటు కూలీలకు పనులు కల్పించడానికి స్థానికంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
రాబోవు మూడు సంవత్సరాల కాలంలో షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన 11 లక్షల ఎకరాల భూములను అభివృద్ధి పర్చడానికి రూ. 5675 కోట్లు వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మహాత్మాగాంధీ వనాల పెంపకం పథకం కింద 30 కోట్ల మొక్కలు పెంచే పథకాన్ని పటిష్టంగా అమలు జరపాలని ఆదేశించారు. ప్రజాపధం, రైతు చైతన్య యాత్రల కోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా అధికారుల స్థాయిలో కార్యాచరణ ఉండాలని, రచ్చబండలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించి అర్హులకు ప్రయోజనం కల్పించవలసి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ. 572 కోట్లతో చేపట్టిన 1868 శాశ్వత తాగునీటి సరఫరా పథకాలను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయడానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను
కోరారు. వేసవిలో వచ్చే వ్యాధుల నియంత్రణ, నివారణలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెప్పారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరగవలసి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసే విధంగా నిరంతర పర్యవేక్షణ, సమీక్ష అవసరమని సూచించారు.
వచ్చే నెల మొదటి వారంలో ప్రజాపధం కార్యక్రమం ఉంటుందని, అది పూర్తి కాగానే రైతు చైతన్య యాత్రలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, ఎన్‌.రఘువీరారెడ్డి, పి. బాలరాజు, డి.శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, మహీధర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి. ప్రసాద్‌, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ కాన్ఫరెన్‌లో పాల్గొన్నారు.

No comments:

Post a Comment