- ప్రైవేటు ట్రస్ట్‌లకు ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ట్రస్ట్ ఏర్పాటు చేయాలి
- సాయి అవతారం చాలించకముందే ఆ ప్రయత్నం జరగాలి
- ఆధ్యాత్మిక కేంద్రంగా భారత్ గుర్తింపు పొందడానికి బాబా ప్రాచుర్యం ఒక కారణం
- 166 దేశాల్లో 10 వేలకు పైగా కేంద్రాల ద్వారా సేవా కార్యక్రమాలు
- పుట్టపర్తిలో 220, బెంగళూరులో 333 బెడ్లతో అత్యాధునిక ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు
- ఇప్పటివరకు 12.50 లక్షల మందికి ఉచిత సర్జికల్ సేవలు
- వైట్‌ఫీల్డ్‌లోని మరో ఆస్పత్రిలో 20 లక్షల మందికి సేవలు
- అనంతపురం జిల్లాలో 800 గ్రామాలలో మంచినీటి సరఫరా
- ఉభయగోదావరి జిల్లాలు, మెదక, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు చెన్నై నగరానికీ మంచినీటి సరఫరా
- 33 దేశాల్లో సాయి ఎడ్యుకేర్ కార్యక్రమాల ద్వారా 2 కోట్ల మందికి విద్యావకాశాలు
ప్రపంచంలో వరుసగా జరుగుతున్న ఉత్పాతాలన్నింటి కంటే కూడా పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారికి ఆరోగ్యం సరిగాలేదన్న వార్త ప్రపంచ ప్రజల్ని ఎక్కువ ఆందోళనకు గురిచేసింది. భారతదేశం ప్రపంచానికందించిన సత్పురుషులు, మహారుషుల్లో సత్యసాయి ఒకరు. ఆదిశంకరాచార్య, రామానుజాచార్య, రామకృష్ణ పరమహంస, స్వామివివేకానంద, ఆనందమయిమాత, గురురాఘవేంద్రల సరసన ఆయన్ను కూడా పూజిస్తున్నారు. సత్యసాయి ఒక వ్యక్తికాదు... దైవాంశ సంభూతుడిగానే విశ్వసిస్తున్నారు. ఆయన్ను ఏదో ఒక మతప్రబోధకుడిగా మాత్రం ఎవరూ భావించడం లేదు. ఆయన భక్తుల్లో హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులేకాక జోరాష్ట్రియన్స్, టావోయిస్టులు ఇలా ప్రపంచంలోని పేరెన్నికగన్న మతస్తులంతా ఉన్నారు. సత్యసాయి భక్తులంతా ఆయన ప్రబోధించిన అందరినీ ప్రేమించు.. అందరికీ సేవచేయి.. ఎప్పటికీ సాయం చేయ్.. ఎప్పుడు ఎవరినీ బాధపెట్టకు అనే సందేశాలకనుగుణంగానే వ్యవహరిస్తారు. భక్తుల విశ్వాసాల్ని పొందడంలోనే కాదు.. సేవా కార్యక్రమాల నిర్వహణలో కూడా సత్యసాయి ప్రపంచంలోనే అగ్రగణ్యుడు. విశ్వంలో మరే సంస్థకు లేనన్ని శాఖల ద్వారా సత్యసాయి తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన పట్ల అంచలంచల భకి ్తవిశ్వాసాలుగల భక్తులు ఇందుకు మిలియన్‌లు, బిలియన్ల విరాళాలిస్తున్నారు. సేవలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్నారు. మొత్తం 166 దేశాల్లో 10 వేలకు పైగా కేంద్రాల ద్వారా ఈ సేవల్ని అందిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత విద్య, వైద్యం, సేవా సంస్థలు, తాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వహణ చేపడుతున్నారు. పుట్టపర్తిలో సత్యసాయి సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ విద్యాసంస్థ యుజిసికి చెందిన నేషనల్ ఎసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ ఎ డబుల్‌ప్లస్ ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంక్ సాధించిన ఏకైక విద్యాసంస్థ మొత్తం భారతదేశంలో ఇదొక్కటే కావడం విద్యాప్రమాణాల పరిరక్షణలో సత్యసాయి సేవా సంస్థల నిబద్ధతకు కొలమానమౌతోంది.
అనంతపురం జిల్లా మారుమూల ప్రాంతమైన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలోనే ఎక్కువగా కాలం గడిపే సత్యసాయి తనవద్దకొచ్చే భక్తులకు మాత్రమే దర్శనమిస్తున్నారు. ఆయన ఎలాంటి ప్రచారానికి పాకులాడటం లేదు. ఏ దేశం వెళ్లీ భక్తుల్ని ఆకర్షించడం లేదు. మానవసేవే.. మాధవసేవ.. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అంటూ ఆయన చేసే ఉద్బోధలే ప్రపంచ ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. ఆయన సేవాతత్పరతకు, సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ప్రజలు ఆకర్షితులౌతున్నారు. దేశ ప్రజలకంటే కూడా ఎక్కువ సంఖ్యలో విదేశీ భక్తులే పుట్టపర్తి వస్తున్నారు. ఆయన సేవా కార్యక్రమాలకు విరాళాలిస్తున్నారు. కొంతమంది నాస్తికులు, మరికొంతమంది వితండవాదులు సత్యసాయిని వివాదాస్పదం చేసే ప్రయత్నాలు చేశారు. మీడియాతో సహా కొంతమంది విషప్రచారానికి పాల్పడ్డారు. అయినా భక్తుల్లో సత్యసాయిపై ఉన్న విశ్వాసం ఏమాత్రం సడలలేదు. ఈ విషప్రచారం ఏమాత్రం ప్రభావం చూపలేదు. కులం, మతం, ప్రాంతం, జాతితో ప్రమేయం లేకుండా సత్యసాయిపట్ల విశ్వాసం పెరుగుతూనే ఉంది.
భారత్ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపుపొందడానికి సత్యసాయిబాబాకున్న ప్రాచుర్యం కూడా ఓ కారణం. వివిధ దేశాధ్యక్షులు, పాలకులతోపాటు భారతదేశ అధ్యక్షులు, ప్రధానులు, శాస్త్రవేత్తలు, సీనియర్ బ్యూరోక్రాట్‌లు, కార్పొరేట్ సంస్థల అధిపతులు కూడా సత్యసాయి దర్శనం లభిస్తే చాలు మహద్భాగ్యం అంటూ పొంగిపోతారు. తమ స్థాయిని కూడా మర్చి ఆయన పాదాలచెంత కూర్చుని పరవశించిపోతారు. ఇలాంటి చర్యలపై ఎవరెన్ని విమర్శలు చేసినా అదంతా తమ వ్యక్తిగతంగా పేర్కొంటూ వీటిని ఖాతరు చేయరు.
పుట్టపర్తిలోని 220 పడకల సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ రోగులందరికీ మెడికల్, సర్జరీ సేవల్ని ఉచితంగా అందిస్తోంది. బెంగళూరులో ఇదే సంస్థ నిర్మించిన 333 పడకల ఆసుపత్రి అత్యాధునిక వైద్య సదుపాయాల్తో పాటు ఐసియు, సిసియు యూనిట్లలో సేవల్ని కూడా ఉచితంగానే అందిస్తోంది. ఇంతవరకు 12.50 లక్షల మంది రోగులు ఇక్కడ ఉచితంగా సర్జికల్ సేవల్ని అందుకున్నారు. వైట్‌ఫీల్డ్‌లో నిర్వహిస్తున్న మరో ఆసుపత్రిలో రోగులందరికీ వైద్య సేవలతోపాటు ఆహారం, వసతి కూడా ఉచితంగానే అందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటివరకు 20లక్షలమందికి ఈ సేవలందాయి. ఇవికాక సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు, సాధారణ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్ని దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ
మురికివాడల్లో సత్యసాయి సేవా ట్రస్ట్ నిర్వహిస్తోంది. 1996 నుంచి మంచినీటి సరఫరా ప్రాజెక్ట్‌లపై సత్యసాయి ట్రస్ట్ దృష్టిపెట్టింది. తీవ్ర దుర్భిక్షంలో ఉన్న అనంతపురం జిల్లాలోని 800 గ్రామాలకు తొలుత మంచినీటి సరఫరా కార్యక్రమం మొదలెట్టింది. అనంతరం జిల్లా వ్యాప్తంగా దీన్ని విస్తరించింది. ఆతర్వాత చెన్నైకు మంచినీటి సదుపాయం కల్పించింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాల్లోని సుమారు 10 లక్షలమంది గిరిజనులకు గోదావరి నీటిని సరఫరా చేసే పథకం నిర్వహిస్తోంది. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించింది. అనంతరం మహరాష్ట్రలోని లాతూర్‌లో కూడా మంచినీటి సరఫరా అమలు చేస్తోంది. 33 దేశాల్లో సాయిబాబా ఎడ్యుకేర్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచంలో 2కోట్లమంది ఈ సంస్థల ద్వారా విద్యావకాశాలు పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లమంది సాయిభక్తులున్నట్లు అంచనా. ఆఖరకు కమ్యూనిస్ట్ దేశాలైన రష్యా, చైనాల్లో కూడా బాబాను విశ్వసించే భక్తులు లక్షలాదిమంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనాథ బాలల శరణాలయాల్ని బాబా భక్తులు నిర్వహిస్తున్నారు. పౌష్ఠికాహార సరఫరా కార్యక్రమాల్ని అమలు చేస్తున్నారు. విలువల్తో కూడిన విద్య, విజ్ఞానాన్ని అందిస్తున్నారు. సర్వమత సౌభ్రాతృత్వాల్ని ప్రబోధిస్తున్నారు.
బాబా దైవస్వరూపుడు. ఆయన నిరంతరం తమ మధ్యే ఉండాలని ఆయన భక్తులు కోరుకుంటున్నారు. వందేళ్ళకు పైగా ఆయన జీవించాలని ఆశిస్తున్నారు. మరికొంత కాలం తమను దీవించాలని కోరుతున్నారు. అయితే వయస్సుపైబడే కొద్ది శారీరక క్షీణత ఏర్పడ్డ ప్రకృతిసహజం. బాబా పట్ల ఇతోధిక గౌరవాభిమానాలు, భక్తప్రపత్తులు ప్రదర్శించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు ఆయన ఈ ప్రపంచానికి ప్రబోధించిన తత్వం.. చేపట్టిన సేవా కార్యక్రమాలు ఏ క్షణంలోనూ నిలిచిపోకుండా నిరంతరం కొనసాగేలా చేపట్టాల్సిన సమయమిది.
ఉచిత విద్య, వైద్యం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సేవా సంస్థలు అనునిత్యం ఇలాగే సాగాలంటే పుట్టపర్తిని ఓ ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. తిరుపతి, షిర్డీల తరహాలో నిరంతరం ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పుడున్న ప్రైవేటు ట్రస్ట్‌లకు ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పకడ్బందీ చట్టంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాల్ని నిరంతరం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. కనీసం ఇద్దరు ముగ్గురు ఐఎఎస్ అధికారులకు ఈ బాధ్యతను అప్పగించడం ద్వారా పుట్టపర్తిని శాశ్వతంగా ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. తద్వారా సత్యసాయి ట్రస్ట్‌లకొస్తున్న విరాళాలు నిలిచిపోకుండా ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాల్సిన అవసరముంది. ఇందుకు సత్యసాయి సజీవుడిగా ఉండగానే తగిన ప్రణాళికలు రూపుదిద్ది అమల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
No comments:
Post a Comment