Tuesday, April 5, 2011

విలువ ఆధారిత సేవలపై ప్రత్యేక దృష్టి

ఎయిర్‌టెల్‌ మొబైల్‌ సర్వీసెస్‌ హెడ్‌ అతుల్‌ బిందాల్‌

హైదరాబాద్‌: థర్డ్‌ జనరేషన్‌ వాయు తరంగాల ద్వారా కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన సేవలను దగ్గర చేయనున్నామని భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఎయిర్‌టెల్‌ 3-జి సేవలను మంగళవారం నాడు సంస్థ మబైల్‌ సేవా విభాగం హెడ్‌ అతుల్‌ బిందాల్‌, బాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌లు అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా అతుల్‌ బిందాల్‌ ప్రసంగిస్తూ, తమ సంస్థ విలువ ఆధారిత సేవలపై ప్రత్యేక దృష్టిని సారించనుందని, హై డెఫినిషన్‌ గేమింగ్‌ అనుభూతిని అధించనున్నామని వివరించారు. అతి త్వరలోనే వైజాగ్‌, విజయవాడ తదితర ప్రాంతాల్లో 3-జి సేవలను విస్తరించనున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఎయిర్‌టెల్‌ 3-జి సేవలందుకుంటున్న వారి సంఖ్య 20 లక్షలకు చేరిందని ఆయన తెలిపారు. విడియో కాల్స్‌కు సెకనుకు ఐదు పైసలు వసూలు చేయనున్నామని, ఏ విధమైన ప్యాకేజీలో లేకుండా 3-జి సేవలను వాడుకుంటే ప్రతి 20 కిలోబైట్ల వాడకానికి 30 పైసలు చార్జ్‌ చేయనున్నామని ఆయన తెలిపారు. ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం ఎనిమిది రకాల ప్యాక్‌లు విడుదల చేశామని తెలిపారు. కనీసం రోజుకు 9 రూపాయల నుంచి నెలకు గరిష్ఠంగా 750 రూపాయల వరకూ వివిధ రకాల ప్యాక్‌లను అందిస్తున్నట్టు తెలిపారు.

No comments:

Post a Comment