- బంద్‌లు, డౌన్..డౌన్ నినాదాలకు చెక
- విధులకు హాజరై ఆందోళనల్లో పాల్గొంటే కఠిన చర్యలు
- జివో 177ను విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్: ఇటీవల జరిగిన పలు పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి చెక్ పెట్టే ఉద్దేశంతో 177 పేరిట కొత్త జివోను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు, డిమాండ్‌ల పరిష్కారం కోసం ఏర్పాటుచేసుకున్న సంఘాలు, అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో 'పెన్ డౌన్', 'చాక్ డౌన్', 'టూల్ డౌన్', 'సహాయ నిరాకరణ'ల పేరిట చేస్తున్న ఆందోళనా కార్యక్రమాలను చేపట్టకుండా ఈ జివోను జారీ చేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త జివోకు రూపకల్పన చేశారు. ఇకపై విధులకు హాజరై అక్కడి రిజిష్టర్‌లో సంతకాలు చేసిన అనంతరం తమ తమ సంఘాలు లేదా అసోసియేషన్‌లు చేపట్టే ఆందోళనా కార్యక్రమాలు, నిరసనలు, బంద్‌లలో పాల్గొనే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశం ఈ జివోలో స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఈ ఉత్తర్వులు హెచ్చరిస్తున్నాయి. 1964లో ప్రవేశ పెట్టిన ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్(కండక్ట్), 1991లో రూపొందించిన క్లాసిఫికేషన్, కంట్రోల్, అప్పీల్‌లను అనుసరించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగుల పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. దీంతో పాటు ఆయా ఉద్యోగుల పనిచేసిన దినాలకు మాత్రమే మాత్రమే వేతనం చెల్లిస్తారు.
ప్రభుత్వం ఈ జివోను విడుదల చేసే సందర్భంలో ఉద్యోగుల నిరసన కార్యక్రమాలకు సంబంధించి సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ఉదహరించింది. 1953లో బకింగ్‌హమ్ కర్నాటిక్ లిమిటెడ్‌లో పనిచేసే ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని సుప్రీంకోర్టు సమ్మెగా భావించాలని తీర్పు ఇచ్చింది. 1989లో కేంద్ర ప్రభుత్వానికి బిఆర్ సింగ్‌ల మధ్య జరిగిన వాగ్వాదాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు. సంస్థలలో పనిచేసే ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి చేపట్టే నిరసన కార్యక్రమాలలో విభిన్న రకాలుంటాయని పేర్కొన్నారు. వీటిలో నిదానంగా పనిచేయడం, నిబంధనల మేరకు విధులకు హాజరుకావడం, పనికి రాకపోవడం, సమ్మెకు దిగడం లాంటి చర్యలను హక్కులను కాపాడుకునేందుకు అనుసరించే మార్గాలుగా భావించాలని పేర్కొన్నారు. 2003లో తమిళనాడు ప్రభుత్వానికి టిఆర్ రంగరాజన్‌లకు మధ్య జరిగిన అంశాలను బట్టి ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు సమ్మెకు దిగే చట్టబద్ధంగా గానీ నైతిక హక్కుల పేరిట సమ్మెలలో పాల్గొనడాన్ని తప్పు బట్టారు.
ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉద్యోగులు ప్రవర్తించకూడదు. ఉద్యోగులకు అన్యాయం జరిగిందని భావిస్తే తమ పరిధిలో ఉన్న సదుపాయాలు, ఇతర హద్దుల పరిధిలోనే నిరసన తెలపాలి. సమ్మెను ఆయుధంగా భావించి దానిని దుర్వినియోగం చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ రకమైన తీర్పు వెలువడింది.
అధిక సంఖ్యలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత సమయంలో సమ్మె అనేది సమాజాన్ని విపరీతంగా దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు ఆయా సందర్భాలలో స్పష్టంగా పేర్కొంది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమ్మెలకు అవకాశం ఇవ్వకూడదని సూచించింది. నిరసనలు తప్పనిసరిగా తెలపాల్సి వచ్చినప్పుడు అధికంగా పనిచేయడం, విధి నిర్వహణలో మరింత పారదర్శకంగా వ్యవహరించడం లాంటి చర్యలకు పాల్పడినట్లయితే ప్రజలు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా ఆయా ఉద్యోగులకు తమ మద్దతు తెలుపుతారని పలు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఆందోళనలు, బంద్‌లు, పెన్ డౌన్‌లు, సహాయ నిరాకరణ ఉద్యమాలలో పాల్గొనే వారి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఫాక్స్ (నెంబర్ 040-23454810) ద్వారా చేరేలా ఏర్పాట్లు చేశారు.
ఇదే విధంగా విధులకు ఎగ్గొట్టి ఆందోళనలు చేపట్టే ఉద్యోగుల గురించి ప్రభుత్వ కార్యదర్శికి, సాధారణ పరిపాలనా విభాగానికి ఇ-మెయిల్ ద్వారా తెలియజేయవచ్చు. నిరసన తెలిపే ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇలాంటి చర్యలకు దిగే ఉద్యోగుల సమాచారాన్ని ప్రభుత్వం పొందుపరుస్తుంది. ఎవరైతే ఆందోళనా కార్యక్రమాలలో పాల్గొనకుండా విధులకు హాజరవుతారో వారికి భద్రత కల్పించాలి. విధులకు హాజరైనట్లు అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకం పెట్టిన తర్వాత అదే కార్యాలయ ఆవరణలో నిరసన కార్యక్రమాల పేరిట వివిధ రకాల ఆటలాడటం, వాయిద్య పరికరాలతో పెద్ద ఎత్తున చప్పుడు చేస్తూ విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో ఉండే ఇతర ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే వారిని ఉపేక్షించేది లేదని జివో స్పష్టం చేస్తోంది.
బంద్‌లు, సహాయ నిరాకరణ తదితర కార్యక్రమాలలో పాల్గొనే ఉద్యోగులకు 'నో వర్క్- నో పే' ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయడంతో పాటు ఆయా ఉద్యోగులపై 'నాట్ డ్యూటీ', వేతనం, ఇతర భత్యాలలో కోత విధిస్తారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను అన్ని ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డులలో ఉంచి ఉద్యోగుల దృష్టికి
తీసుకువస్తారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉన్నతాధికారులు ఈ జివోలోని అంశాలను అనుసరించి క్రమశిక్షణ ఉల్లంఘించిన ఉద్యోగుల గురించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తారు.
No comments:
Post a Comment